మనస్తాపంతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
పెదకూరపాడు: చదువుకోవటం నాకు ఇష్టం లేదు... నన్ను బలవంతం పెట్టకండి.. నేను హాస్టల్‌కి వెళ్లను. ఇంటివద్ద ఉంటాను... అంటూ విద్యార్థి చెప్పడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థిని పంట పొలంలోని పురుగులు మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలోని జలాలపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. జలాలపురం గ్రామానికి చెందిన మన్నవ శరీలు, చిట్టెమ్మల కుమార్తె మన్నవ జోష్ రాణి (17) నరసరావుపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సెలవులకు స్వగ్రామం జలాలపురం వచ్చింది. సెలవులు అనంతరం కళాశాలకు వెళ్లకపోవటంతో తల్లి మందలించింది. చదువు ఇష్టం లేదని జోష్ రాణి చెప్పటంతో కళాశాలకు వెళ్లక పోతే నాతో పాటు వ్యవసాయ పనులకు రావాలని ఒత్తిడి చేయటంతో రెండు రోజులపాటు తల్లితో కలిసి మిరప కోత పనులకు వెళ్లింది. ఈ క్రమంలో బుధవారం మిర్చి కోతలు కోస్తున్న పంట పొలంలో రైతు దాచుకున్న పురుగులు మందును తాగింది. వాంతులు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను సత్తెనపల్లి ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఇన్విజిలేటర్‌కు దేహశుద్ధి
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పరీక్షలు రాస్తున్న ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఇన్విజిలేటర్‌కు తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. ప్రకాశం జిల్లా దర్శి మండలానికి చెందిన విద్యార్థిని గుంటూరులోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాల హాస్టల్లో ఉండి చదువుతోంది. ఈనెల 3 నుంచి పొన్నూరు రోడ్డులోని ఓ ప్రైవేటు కళాశాల పరీక్ష కేంద్రంలో సీనియర్ ఇంటర్ పరీక్షలకు రాస్తోంది. ఇన్విజిలేటర్‌గా వ్యవహరిస్తున్న యువకుడు పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం, ఫోన్ నంబర్ ఇవ్వాలంటూ అడగడం చేశాడు. దీంతో విద్యార్థిని తాను చదువుతున్న కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది. కళాశాల ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ యువకుడిని రెండు రోజుల క్రితం మందలించారు. అదే రోజు అతడిని ఇన్విజిలేషన్ విధుల నుంచి అధికారులు తొలగించారు. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం పరీక్ష కేంద్రం వద్దకు చేరుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు చీఫ్ సూపరింటెండెంట్‌తోపాటు కళాశాల ప్రిన్సిపాల్‌తో మాట్లాడి యువకుడిని కళాశాలకు పిలిపించారు. అతడికి దేహశుద్ధి చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో ఓ ప్రైవేటు కళాశాలలో ఎంబీఏ చదువుతున్న వ్యక్తిని అధికారులు ఇన్విజిలేటర్‌గా నియమించడం గమనార్హం. ఈ విషయం ఆర్‌ఐఓ జీకే జుబేర్ దృష్టికి వెళ్లడంతో ఎంబీఏ విద్యార్థిని ఇన్విజిలేటర్‌గా నియమించడంపై చీఫ్ సూపరిండెంట్‌ను సంజాయిషీ కోరారు.
1,22,426 బస్తాలు మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శుక్రవారం 1,11,958 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,22,426 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.14,500 వరకు పలికింది.
మనస్తాపంతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment