బెదిరింపులు.. ప్రలోభాలు
నరసరావుపేట: అసలు బలమేలేని మండల పరిషత్‌లో పాగా వేసేందుకు కూటమి నేతలు, కుట్రలు, కుతంత్రాలకు, బెదిరింపులకు గురిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. మాచర్ల మండల పరిషత్‌లో 14 ఎంపీటీసీల్లో కూటమికి ఒక్క ఎంపీటీసీ కూడా లేరు. అయినా శనివారం జరిగిన మండల పరిషత్ అత్యవసర సమావేశంలో బలవంతంగా ఎంపీటీసీలను తమ ఖాతాలో వేసుకొని ఎట్టకేలకు బడ్జెట్ అంచనాలను ఆమోదించుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎలాగైనా మండల పరిషత్‌ను స్వాధీనం చేసుకోవాలని కుయుక్తులు పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీపీగా చేస్తున్న బూడిద మంగమ్మ ఏడు నెలల క్రితం అనారోగ్యంతో సెలవుపై వెళ్తూ మొదటి వైస్ ఎంపీపీగా ఉన్న పోతురెడ్డి సుజాతకు బాధ్యతలివ్వాలని సభ్యులందరి చేత తీర్మానం చేయించి తీర్మాన పత్రాన్ని, సెలవు మంజూరు దరఖాస్తును అప్పటి జెడ్పీ సీఈఓను స్వయంగా కలిసి అందించారు. ఇదే అదనుగా భావించిన కూటమి నేతలు కుట్రలకు తెరలేపారు. జిల్లా అధికారుల నుంచి ఇన్‌చార్జి ఎంపీపీ బాధ్యతలను సుజాతకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఒక్క సభ్యుడూ లేని మండల పరిషత్‌లో రెండవ వైస్ ఎంపీపీగా ఉన్న పరిమళ మనీషాను నయానో.. భయానో తమ వైపునకు తిప్పుకొని ఆమెను అడ్డం పెట్టుకుని మండల పరిషత్‌ను ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని కూటమి నేతలు పన్నిన కుయుక్తులు ఏడు నెలలుగా ఫలించలేదు. ఒక్కరు తప్పితే మిగతా 13 మంది వైఎస్సార్ సీపీ వైపే ఉన్నారు.
● అయితే శనివారం జరిగిన అత్యవసర సమావేశంలో అధికార పార్టీ నాయకులు మండల పరిషత్ కార్యాలయంలోకి ప్రవేశించి సంబంధిత ఎంపీటీసీలను బెదిరింపులకు, ప్రలోభాలకు గురిచేస్తూ హల్‌చల్ సృష్టించారు. ఉదయం 11గంటలకు ప్రారంభమైన సమావేశం మధ్యాహ్నం 2గంటలు దాటుతున్నా నలుగురు మాత్రమే హాజరు కావటంతో ఎలాగైనా మరొక ఎంపీటీసీని తెప్పించి బడ్జెట్ అంచనాలను ఆమోదం చేసుకోవాలనే కూటమి నేతల కుతంత్రాలకు తెరలేపి ఎంపీటీసీలను బెదిరించి, బుజ్జగించి ప్రలోభాలకు గురి చేసి ఎట్టకేలకు ఐదుగురితో సంతకాలు చేయించి బడ్జెట్ ఆమోదం చేసుకున్నారు. సమావేశానికి హాజరైన వైఎస్సార్ సీపీ సర్పంచ్‌ల పై కూటమి నేతలు దూషణకు పాల్పడి దౌర్జన్యాలకు దిగారు. వైఎస్సా ర్‌సీపీ నాయకులు ఈ సమావేశ ప్రాంతంలో ఉండకూడదని, వెళ్లిపోవాలని ఆగ్రహిస్తూ ఇతర మండలాల నుంచి వచ్చిన కూటమి నాయకులు, కార్యకర్తలు వారిపై దౌర్జన్యం చేస్తూ ఆ ప్రాంతం నుంచి వెళ్లగొట్టారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఐ, ఎస్‌ఐల ముందే కూటమి నేతలు దౌర్జన్యాలకు పాల్పడడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
మాచర్ల మండల పరిషత్ సమావేశంలో టీడీపీ నేతల హల్‌చల్
వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు,
సర్పంచ్‌లపై దౌర్జన్యం
బడ్జెట్ అంచనాలు
ఆమోదింపజేసుకున్న వైనం
ఐదుగురు ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు
సంవత్సర బడ్జెట్ అంచనాలను ఉన్నతాధికారులకు నివేదించేందుకు అత్యవసర సమావేశం నిర్వహించాం. ఈ సమావేశానికి పశువేముల, కంభంపాడు 2, చింతలతండ, జమ్మలమడక, కొప్పునూరుకు చెందిన ఐదుగురు ఎంపీటీసీ సభ్యులు హాజరయ్యారు. వైస్ ఎంపీపీ–2గా ఉన్న పరిమళ మనీషా ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఐదుగురు సభ్యుల ఆమోదంతో బడ్జెట్ అంచనాలను ఆమోదించి ఉన్నతాధికారులకు అందజేస్తాం.
– ఫణికుమార్ నాయక్, ఎంపీడీఓ
Comments
Please login to add a commentAdd a comment