యువతకు అండగా వైఎస్సార్ సీపీ
● రేపు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ‘యువత పోరు’ కార్యక్రమం ● పోస్టర్లు ఆవిష్కరించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
మాచర్ల: విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ ఈనెల 12వ తేదీన పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘యువత పోరు’ నిర్వహిస్తున్నట్లు పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. మాచర్ల పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలసి సోమవారం పోస్టర్లు ఆవిష్కరించారు. పిన్నెల్లి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మోసపోతున్న విద్యార్థులు, యువతకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందన్నారు. ఈనెల 12న ఉదయం 10 గంటలకు నరసరావుపేటలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ‘యువత పోరు’ ర్యాలీ ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా చేరుకుని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, నిరుద్యోగ యువత పెద్దఎత్తున తరలివచ్చి ప్రభుత్వ మోసపూరిత విధానాలపై గళం వినిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలైనా, ఇప్పటివరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సరైన కేటాయింపులు చేయలేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేశారన్నారు. మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తెచ్చారని, ఈ పథకం ద్వారా ఎంతో మంది పేదలు ఉన్నత చదువులు చదివారన్నారు. డాక్టర్లు, ఇంజినీర్లుగా స్థిరపడ్డారన్నారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మరో అడుగు ముందుకు వేసి వసతిదీవెన పథకం కింద హాస్టల్ ఖర్చులు అందజేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి తూట్లు పొడుస్తోందని విమర్శించారు. వెంటనే రూ.4,600 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫీజుల కోసం కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఎన్నికల్లో రూ.3 వేల నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ బడ్జెట్లో ఎక్కడా దీని ప్రస్తావన లేదన్నారు. వై.ఎస్.జగన్ పాలనలో 17 మెడికల్ కళాశాలలకు శ్రీకారం చుడితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమవుతోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ చేస్తున్న ‘యువత పోరు’లో అందరూ భాగస్వాముల కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈనెల 12న వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నరసరావుపేటలోని జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తామని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment