జీరో చూసుకోండి! | - | Sakshi
Sakshi News home page

జీరో చూసుకోండి!

Published Sat, Mar 22 2025 1:39 AM | Last Updated on Sat, Mar 22 2025 1:33 AM

● పెట్రోల్‌ బంకుల్లో యథేచ్ఛగా మోసాలు ● అధికారుల తనిఖీలు నామమాత్రం ● జిల్లాలో పర్యవేక్షించే శాఖ కరువు ● ఏడాదిలో ఏడు కేసులే నమోదు
కొలతల్లోనూ తేడా...

అధికారుల తనిఖీలు లేకపోవడం.. ఎక్కువగా నిరక్షరాస్యులున్న ఏజెన్సీ ప్రాంతం కావడంతో పెట్రోల్‌ కొలతల్లోనూ తేడా కనిపిస్తోంది. బాటిల్‌ పట్టుకుని, లీటరు చొప్పున కొనుగోలు చేస్తే బాగానే ఇస్తున్నారని.. అదే నేరుగా బండిలో ఇంధనం పోయించుకుని, కిలోమీటర్లు లెక్క గడితే... 10–15 కిలోమీటర్లకు ముందుగానే రిజర్వ్‌కు వచ్చేస్తోందని పార్వతీపురం పట్టణానికి చెందిన సురేష్‌ అనే వాహనదారుడు వాపోయాడు. పార్వతీపురం పట్టణంలోని ఓ బంకులో ‘సాక్షి’ శుక్రవారం పరిశీలించగా.. 500 ఎంఎల్‌కు 2 ఎంఎల్‌ పెట్రోల్‌ తక్కువగా వచ్చింది. సాలూరులోని ఓ బంకులో కొంత కాలంగా పెట్రోల్‌ కల్తీ జరుగుతోందన్న ప్రచారం జోరుగా ఉంది. కల్తీతోపాటు కొలతల్లో కూడా తేడా ఉందని వాహనదారులు చెబుతున్నారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో గిరిజనులు పెట్రోల్‌ పోయించేటప్పుడు కొలతల్లో తేడా చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు కూడా పెద్దగా దృష్టి సారించడం లేదు. జిల్లా విభజన తర్వాత పార్వతీపురం మన్యానికి తూనికలు, కొలతలు విభాగ కార్యకలాపాలు పెద్దగా కనిపించడం లేదు. గత ఏడాది కాలంలో బంకుల్లో జరుగుతున్న మోసాలపై కేవలం ఏడు కేసులే నమోదు చేయడం గమనార్హం. రూ.లక్షా పది వేలను అపరాధ రుసుంగా విధించినట్లు తూనికలు కొలతలు శాఖల అధికారులు చెబుతున్నారు. వినియోగదారుల్లో ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల కూడా అధికారుల తనిఖీలు శూన్యమవుతున్నాయి.

సాక్షి, పార్వతీపురం మన్యం:

సాధారణంగా వాహనదారులు పెట్రోల్‌ బంకుకు వెళ్లి.. ఇంధనం పోయాలని అక్కడికి సిబ్బందికి అడిగిన వెంటనే... వారు ‘జీరో చూసుకోండి’ అని ఎంతో వినయంగా చెబుతారు. మన దృష్టి కూడా ఆ ‘సున్నా’పైనే ఉంటుంది. జీరో ఉన్నంత మాత్రాన మనం మోసపోం అనుకుంటే పొరపాటే. బంకుల్లో ఎప్పటికప్పుడు నయా మోసాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. వినియోగదారులు నష్టపోతూనే ఉన్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు తనిఖీలు లేకపోవడం.. వినియోగదారులు సైతం దీనిపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో జిల్లాలో పెట్రో ల్‌ బంకుల నిర్వాహకులు యథేచ్ఛగా దోపిడీకి తెరతీస్తున్నారు.

ఇదో ‘జంప్‌ ట్రిక్‌’ మోసం

జిల్లాలో 48 వరకు పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. కొన్ని బంకుల్లో ‘జంప్‌ ట్రిక్‌’ మోసానికి పాల్పడుతున్నారు. పెట్రోల్‌ కొట్టేటప్పుడు అక్కడ సిబ్బంది ‘జీరో చూసుకోండి’ అని చెబుతుంటారు. పెట్రోల్‌ పోయడం మొదలుపెట్టగానే మీటరు నెమ్మదిగా పెరగకుండా ఒక్కసారిగా 10–20 పాయింట్లు పెరుగుతుంది. దీనివల్ల మనకు తక్కువ పెట్రోల్‌ పోసినా, మీటరులో ఎక్కువ చూపిస్తుంది. సాధారణంగా మీటరు నాలుగైదు పాయింట్లు మాత్రమే జంప్‌ అవ్వాలి. జిల్లాలోని అనేక బంకుల్లో ఈ తరహా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ఇది గమనించి అడిగినా.. పెట్రోల్‌ బంకు సిబ్బంది నుంచి మౌనమే సమాధానంగా వస్తోందని వాహనచోదకులు చెబుతున్నారు.

కనీస సౌకర్యాలు కరువు

పెట్రోల్‌బంకుల వద్ద ఎక్కడా కనీస సౌకర్యాలు ఉండటం లేదు. ప్రతి బంకు వద్ద మరుగుదొడ్లు, గాలి పంపులు, తాగునీరు వంటి సదుపా యాలు కల్పించాల్సి ఉంది. అవి ఎక్కడా ఉన్న దాఖలాలు లేవు.

కనీసం జాతీయ రహదారి వెంబడి ఉన్న బంకుల్లోనూ ఈ తరహా సౌకర్యాలు శూన్య మని వాహనదారులు చెబుతున్నారు. పెట్రోల్‌ బంకుల్లో మోసాలపై ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. కనీసం ఇప్పటికైనా తనిఖీలు ముమ్మరం చేస్తే వాహన చోదకులకు మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జీరో చూసుకోండి! 1
1/1

జీరో చూసుకోండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement