ఆధ్యాత్మికం.. పర్యాటకం | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మికం.. పర్యాటకం

Published Mon, Mar 24 2025 6:08 AM | Last Updated on Mon, Mar 24 2025 6:08 AM

ఆధ్యా

ఆధ్యాత్మికం.. పర్యాటకం

● టూరిజం స్పాట్‌గా గోదావరి తీరం ● సమ్మక్క – సారలమ్మ గద్దెల అభివృద్ధి ● రూ.3 కోట్లు వెచ్చించనున్న సింగరేణి

గోదావరిఖని: మంచిర్యాల – పెద్దపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ గోదావరిఖని సమీపంలోని గోదావరి నదిపై రెండు వంతెనలు నిర్మించారు. గోదావరి తీరంలోనే ప్రతీ రెండోళ్లకోసారి సమ్మక్క– సాలరమ్మ జాతర నిర్వహిస్తారు. ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన వేలాది మంది భక్తులు గోదావరి నదిలోనే పుణ్యస్నానాలు ఆచరించి తరిస్తారు. వీరికోసం పుష్కరఘాట్‌ నిర్మిస్తారు. ఇక్కడి శివుని విగ్రహం, పరిసరాలను అందంగా తీర్చిదిద్దుతారు. గిరిజన దేవతల జాతర నిర్వహణకు ఆధునిక హంగులతో కూడిన సౌకర్యాలు కల్పిస్తారు. ఇందుకోసం సింగరేణి యాజమాన్యం సుమారు రూ.3 కోట్లు వెచ్చిస్తోంది.

ఎండోమెంట్‌ పరిధిలోకి..

మంచిర్యాల – పెద్దపల్లి జిల్లాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు గిరిజన జాతరకు వస్తున్నారు. దీంతో 1998లో జాతర ఎండోమెంట్‌ పరిధిలోకి వెళ్లింది. అయితే, అభివృద్ధికి నోచుకోక పోగా.. గోదావరి బ్యాక్‌వాటర్‌తో అమ్మవార్ల గద్దెలు నీట మునుగుతున్నాయి. దీనిని అధిగమించేందుకు సింగరేణి సంస్థ ఓబీ మట్టిని లోతట్టు ప్రాంతాల్లో నింపి సుమారు 2 మీటర్ల ఎత్తున గద్దెలు నిర్మించేలా ప్రణాళిక రూపొందించింది. ఇదేసమయంలో నదీతీరంలోని పుష్కరఘాట్‌ను సుందరంగా తీర్చిదిద్ది పైపులైన్లు నిర్మిస్తుంది. గ్రిల్‌కూడా బిగిస్తుంది.

శ్మశానవాటిక కనిపించకుండా..

సమ్మక్క – సారలమ్మ జాతర ప్రాంగణం సమీపంలోనే హిందూ శ్మశానవాటి ఉంది. ఇది భక్తులకు కనిపించకుండా దాదాపు 200 మీటర్ల పొడవున ప్రహరీ, సుమారు 600 మీటర్ల పొడవున సీసీరోడ్లు నిర్మిస్తారు. భక్తులు సేదతీరడంతోపాటు వంటలు తయారు చేసుకునేందుకు వీలుగా పెద్ద షెడ్లు నిర్మించనున్నారు. వచ్చే రెండు నెలల్లోగా ఈపనులు పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించారు.

1992లో సమ్మక్క – సారలమ్మ జాతర ప్రారంభం

గోదావరిఖని శివారులోని గోదావరి తీరంలో 1992లో సమ్మక్క – సారలమ్మ జాతర ప్రారంభమైంది. ప్రతీ రెండేళ్లకోసారి మేడారంలో నిర్వహించే జాతరకు వేల సంఖ్యలో సింగరేణి కార్మికులు తరలివెళ్లేవారు. దీంతో బొగ్గు ఉత్పత్తిపై తీవ్రప్రభావం పడేది. దీనిని దృష్టిలో పెట్టుకున్న సింగరేణి యాజమాన్యం.. గోదావరి తీరంలోనే గిరిజన దేవతల జాతర నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో రెండేళ్లకోసారి మేడారం నుంచి కోయ పూజారులను రప్పించి జాతర నిర్వహిస్తోంది. ఇలా సుమారు 33 ఏళ్లుగా ఇక్కడ జాతర వైభవంగా జరుగుతోంది. 25వేల మంది భక్తులతో ప్రారంభమైన జాతర 5లక్షల మందికి చేరుకుంది.

సింగరేణి సంస్థ కేటాయించిన నిధులు(రూ.లక్షల్లో)

సీసీరోడ్లు 64

పుష్కరఘాట్‌ 25

పుష్కరఘాట్‌ రెయిలింగ్‌ 19.50

పుష్కరఘాట్‌ గదుల అభివృద్ధి 5.26 రిటర్నింగ్‌ వాల్‌ 42.50

ఓపెన్‌షెడ్‌(సమ్మక్క గద్దెల వెనకాల) 52

షాబాదిబండతో గద్దెల వద్ద ఫ్లోరింగ్‌ 34

ఓపెన్‌షెడ్‌(గద్దెల కుడివైపు) 43

నదీ తీరం.. ఇక పర్యాటకం

గోదావరి నదీతీరాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చుదిద్దుతానని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్‌ ఆధ్వర్యంలో గోదావరితీరంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద రూ.3 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఆదివారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అంతేకాదు.. ఎకోపార్క్‌, రోడ్లు, షెడ్ల నిర్మాణం, జీడీకే–5 ఓసీపీ వద్ద రూ.98 లక్షల వ్యయంతో చేపట్టిన ఖబరస్తాన్‌ పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగుండం, పాలకుర్తి, అంతర్గాం మండలాలకు చెందిన 148 మందికి కల్యాణలక్ష్మి, 23 మందికి షాదీముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. నాయకులు మహంకాళి స్వామి, పెద్ద్దెల్లి ప్రకాశ్‌, పొలసాని శ్రీనివాస్‌, బొంతల రాజేశ్‌, మారెల్లి రాజిరెడ్డి, ముస్తాఫా, బాలరాజ్‌కుమార్‌, శంకర్‌నాయక్‌, ఎస్‌వోటూ జీఎం గోపాల్‌సింగ్‌, డీజీఎం(పర్సనల్‌) కిరణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

ఆధ్యాత్మికం.. పర్యాటకం 1
1/1

ఆధ్యాత్మికం.. పర్యాటకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement