ఇదే చివరి తడి..!
● 18 టీఎంసీలకు పడిపోయిన ఎస్సారెస్పీ నీటి నిల్వలు ● ఏప్రిల్ 2 వరకే చివరి నీటి తడంటూ అధికారుల ప్రకటన ● ‘యాసంగి’పై ఉమ్మడి జిల్లా రైతుల ఆందోళన
ఉమ్మడి జిల్లాలో 7 లక్షల ఎకరాల ఆయకట్టు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎస్సారెస్పీ కింద దాదాపు ఏడు లక్షల ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. ఈ యాసంగిలో వరి ఎక్కువగా సాగు చేశారు. పంట పొట్టదశలో ఉంది. ఇప్పుడు సాగునీరు అందకపోతే కష్టం. ఎస్సారెస్పీ నుంచి మరో 8 టీఎంసీలు మాత్రమే విడుదల చేసే అవకాశముంది. దీంతో రైతులు వ్యవసాయ బావులపైనే ఆధారపడి ఉన్న పంటలను కాపాడుకోవాల్సిన పరిస్థితి.
ఎందుకీ సమస్య?
ఈ ఏడాది ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నీటితో నిండింది. ఓ ప్రణాళికంటూ లేకుండా ఇష్టారీతిన నీటిని వాడటంతో చి‘వరి’కి సాగునీటి గండం ఏర్పడుతోంది. ప్రజాప్రతినిధులు చెప్పారని వానాకాలం, ఎండాకాలం తేడా లేకుండా ఎస్సారెస్పీ అధికారులు నీరు విడుదల చేశారు. ఎస్సారెస్పీ కాలువలకు ఇష్టారీతిన తూములు ఏర్పాటు చేసి, సాగునీటిని చెరువులకు మళ్లిస్తున్నారు. దీంతో చివరి ఆయకట్టుకు నీటి విడుదల సరిగ్గా కాకపోవడంతో రైతులు ఆందోళనకు దిగుతున్నారు.
జగిత్యాల అగ్రికల్చర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా సాగునీటికి వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుతోంది. బుధవారం నాటికి 18.833 టీఎంసీలకు పడిపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎస్సారెస్పీ జోన్–2 ఆయకట్టు(ఎల్‌ఎండీ ఎగువ భాగం)కు డీ–54 నుంచి డీ–94 వరకు ఏప్రిల్ 2వ తేదీ వరకు, జోన్–1 ఆయకట్టు(డీ–5 నుంచి డీ–53 వరకు)కు ఏప్రిల్ 9వరకు మాత్రమే చివరి సాగు నీటితడి అందిస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు బుధవారం ప్రకటించారు. దీంతో యాసంగి పంట సాగుపై ఉమ్మడి జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే చివరి తడి..!