
వెల్లువెత్తుతున్న దరఖాస్తులు
● ఆన్‌లైన్‌లో 16,500కుపైగా నమోదు ● సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ● ప్రత్యామ్నాయంగా ఆఫ్‌లైన్‌లోనూ స్వీకరణ ● బల్దియాలు, ఎంపీడీవో ఆఫీసుల్లో హెల్ప్‌డెస్క్‌లు ● ఆఫ్‌లైన్‌లోనూ మరో వెయ్యి వరకు దరఖాస్తులు
పెద్దపల్లిరూరల్: స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా డెయిరీ, వ్యాపారం, పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం అమలులోకి తీసుకొస్తోంది. దీనిద్వారా 21 నుంచి 55ఏళ్ల మధ్య వయసుగల వారినుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఈనెల 14వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఆన్‌లైన్‌లో ఇప్పటివరకు జిల్లాలో 16,500 మంది దరఖాస్తు చేశారు. ఆన్‌లైన్‌లో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయనే ఫిర్యాదులతో ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు పట్టణాల్లో మున్సిపల్, గ్రామాల్లో మండల పరిషత్ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. వీటిద్వారా ఇప్పటివరకు దాదాపు 1,000 వరకు దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.
హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు..
పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటుకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలిచ్చారు. వీటిద్వారా దాదాపు వెయ్యి వరకు దరఖాస్తులు అందగా, ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వారే అత్యధికంగా ఉన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు ఇబ్బందులు పడుతున్న వారినుంచి ఆధార్ కార్డు, కులం, దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్, ఆహారభద్రత కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణపత్రాలతోపాటు 27 కాలమ్స్‌లో అభ్యర్థి పూర్తివివరాలు నమోదు చేయాల్సి ఉంది.
వితంతు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యం..
రాజీవ్ యువ వికాసం కింద సాయం పొందేందుకు మహిళలకు (అందులో ఒంటరి మహిళ, వితంతువులకు ప్రాధాన్యం) 25శాతం కేటాయించనున్నారు. దివ్యాంగులకు ఐదుశాతం వర్తింపజేస్తారు. కుటుంబంలో ఒక్కరికే ఈ పథకం వర్తిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో నివసించేవారి వార్షికాదాయం రూ.2లక్షల లోపు, పల్లెప్రాంతాలకు చెందిన వారైతే రూ.1.50లక్షల లోపు ఉండాలనే నిబంధన ఉంది.
యూనిట్ ఒకటే.. నిధుల కేటాయింపుల్లోనే తేడా..
రాజీవ్ యువ వికాసం పథకం కింద లాండ్రీ, డ్రైక్లీనింగ్ షాపు యూనిట్ నిధులను బీసీ, ఎస్సీల అభ్యర్థుల కేటాయింపులో తేడా కనిపిస్తోంది. యూనిట్ ఒకటే తీరుగా ఉన్నప్పుడు కులాన్ని బట్టి యూనిట్ విలువ ఎలా మారుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ యూనిట్ స్థాపనకు ముందుకొచ్చే ఎస్సీ అభ్యర్థులకు రూ.3లక్షలు, బీసీలకు రూ.4లక్షలను కేటాయిస్తున్నారు.
0.50 వరకు 100
1 వరకు 90
2 వరకు 80
4 వరకు 70
జిల్లా సమాచారం
ఎంప్లాయిమెంట్ ఆఫీసులో
నమోదైనవారు 20,762
పదో తరగతిలోపు చదివినవారు 870
రాజీవ్ యువ వికాసానికి అందిన
దరఖాస్తులు 16,500
లబ్ధిదారులకు
యూనిట్ల కేటాయింపు జూన్ 2న
యూనిట్ విలువ
(రూ.లక్షల్లో)
రాయితీ
(శాతంలో)
రాజీవ్ యువ వికాస పథకానికి
అవసరమైన కులం, ఆదాయం సర్టిఫికెట్ల కోసం రాష్ట్రంలోని మీ సేవ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు సుమారు 15 లక్షల వరకు దరఖాస్తు చేశారు. ఈనెల 2వ తేదీన ఒక్కరోజే రికార్డుస్థాయిలో దాదాపు 1.50 లక్షల దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయాలకు చేరాయి. అందులో పెద్దపల్లి జిల్లాలోని మీసేవ కేంద్రాల ద్వారా దాదాపు 12వేల మంది (కుల, ఆదాయ) దరఖాస్తు చేశారని అధికారులు చెబుతున్నారు. ఇందులో 70శాతం వరకు సర్టిఫికెట్లు జారీ చేశామని వారు అంటున్నారు. మిగతా 30శాతం సర్టిఫికెట్ల కోసం అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు.