హన్మకొండలో సోమ్‌నాథ్ భారతికి స్వాగతం పలుకుతున్న ఇందిరాశోభన్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయనున్న కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చేరబోదని ఆ పార్టీ తెలంగాణ ఎన్నికల ఇన్‌చార్జి సోమ్‌నాథ్ భారతి స్పష్టం చేశారు. బీజేపీని ఓడించాలన్న ఏకైక ఎజెండాతో వచ్చే కూటములు విజయవంతం కావని, అలాంటి కూటముల్లో ప్రజాసమస్యలే ఎజెండాగా ఉంటే అప్పుడు ఆలోచిస్తామన్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన ఆదివారం రాత్రి ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.
ఢిల్లీ, ఆ తర్వాత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సునామీ విజయాలు సృష్టించిన తర్వాత తమ పార్టీ దేశవ్యాప్త విస్తరణపై దృష్టి సారించిందన్నారు. సీఎం కేసీఆర్ అవినీతి గురించి రాష్ట్రంలోని చిన్న పిల్లలను అడిగినా చెప్తారన్నారు. సీఎం కేజ్రీవాల్ అంటే ప్రధాని మోదీకి భయం పట్టుకుందని, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ గెలుస్తుందన్న భయంతో ఎన్నికలను వాయిదా వేయించారని సోమ్‌నాథ్ ఆరోపించారు.
14న న్యాయ పాదయాత్ర
తెలంగాణలో వచ్చే నెల 14న అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని చేపట్టనున్న న్యాయ పాదయాత్రను విజయవంతం చేయాలని సోమ్‌నాథ్ భారతి పిలుపునిచ్చారు. ఆదివారం వరంగల్ జిల్లాలో పర్యటించిన ఆయన హన్మకొండ, నర్సంపేట నియోజకవర్గాల్లో ఆప్ కార్యాలయాలను ప్రారంభించి, జెండాలను ఆవిష్కరించారు. హన్మకొండలో తాళ్లపల్లి సురేష్‌గౌడ్, నర్సంపేటలో నవీన్‌రెడ్డి ఆయన సమక్షంలో పార్టీలో చేరారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ తరహాలో పాలన అందించడానికి మీ బిడ్డగా తెలంగాణలో అడుగుపెడుతున్న కేజ్రీవాల్‌ను అక్కున చేర్చుకొని, ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో ఆప్ తెలంగాణ సెర్చ్ కమిటీ చైర్‌పర్సన్ ఇందిరాశోభన్, సెర్చ్ కమిటీ సభ్యులు రామ్‌గౌడ్, సయ్యద్ గఫ్ఫర్, తాళ్లపల్లి సురేష్‌గౌడ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment