![Adimulapu Suresh Comments On Ayyanna Patrudu - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/24/Adimulapu-Suresh.jpg.webp?itok=LyyzKQlw)
సాక్షి, అమరావతి: మధ్యాహ్న భోజన పథకం బిల్లులు చెల్లించలేదని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఖండించారు. ఆదివారం ఆయనొక ప్రకటన చేస్తూ.. మధ్యాహ్న భోజన పథకానికి సంబందించిన బిల్లులను వంట వారికి, కాంట్రాక్టర్లకు డిసెంబర్ వరకు పూర్తిగా చెల్లించామని స్పష్టం చేశారు. ‘బిల్లులను అప్‌లోడ్ చేసిన వెంటనే ఆటో డెబిట్ సిస్టం ద్వారా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ఆదేశాలిచ్చారు.
కేంద్రం ఇస్తున్న ఆర్థిక సహాయంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన వాటా కూడా సింగిల్ నోడల్ ఖాతాకు వచ్చిన బిల్లులన్నీ వంటవారి ఖాతాలకు బదిలీ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో గోరుముద్దకు సంబంధించిన లావాదేవీలన్నీ సింగిల్ నోడల్ ఖాతాకు బదలాయించి ప్రతినెలా 7వ తేదీలోగా వంటవారికి, కాంట్రాక్టర్లకు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం.
దేశంలో ఎక్కడా లేనివిధంగా వారానికి 5 రోజులు కోడిగుడ్లతో పాటు చిక్కీని అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్’ అని మంత్రి సురేష్ వివరించారు. జగనన్న గోరుముద్ద పథకంలో పూర్తిగా మార్పులు చేసి పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని 15 రకాల వంటలతో 6 రోజులపాటు మెనూను తయారు చేశామని తెలిపారు.ఇవేమీ తెలియని అయ్యన్నపాత్రుడు భోజన పథకం బిల్లులు చెల్లించటం లేదని ఆరోపించటం సిగ్గు చేటని మంత్రి సురేష్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment