
సాక్షి, హైదరాబాద్: కొన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టుగా బీజేపీని ఓడించే స్థాయికి కాంగ్రెస్ చేరితే ఇక్కడ కూడా ఆ పార్టీతో సర్దుబాటు చేసుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. కానీ రాష్ట్రంలో పరిస్థితి ఆవిధంగా లేదని, అందుకే బీఆర్‌ఎస్ వైపే ఉంటామని చెప్పారు.
అయితే సీట్ల గురించి బీఆర్‌ఎస్‌తో ఇంకా చర్చ జరగలేదని, సమయం వచ్చిన ప్పుడు తమ బలానికి తగ్గట్టుగా సీట్లు కోరతామని అన్నారు. తాము కోరుకున్నట్టుగా బీఆర్‌ఎస్ సీట్లు ఇవ్వకపోతే విడిగానే పోటీ చేస్తామని తెలిపారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా బుధవారం ఎంబీ భవన్‌లో పొలిట్‌బ్యూరో సభ్యులు ఎ.విజయరాఘవన్, బీవీ రాఘవులు, నాయకులు చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డిలతో కలిసి తమ్మినేని విలేకరులతో మాట్లాడారు.
స్నేహంగా ఉంటాం..సమస్యలపై పోరాడతాం
బీజేపీని వ్యతిరేకిస్తున్న బీఆర్‌ఎస్‌తో రాజకీయంగా స్నేహంగా ఉంటామని తమ్మినేని వీరభద్రం చెప్పారు. అదే సమయంలో ఇచ్చిన హామీల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామన్నారు. బీఆర్‌ఎస్ తప్పులను విమర్శిస్తామని, ఒప్పును సమర్థిస్తామని చెప్పారు. బీజేపీని ఎదుర్కోవడం అంత సులువు కాదని, అందుకే కేసీఆర్‌ను సమర్థిస్తున్నామని వివరించారు. బీజేపీ వ్యతిరేక పోరాటాన్ని బలపర్చేందుకే బీఆర్‌ఎస్‌తో సానుకూలంగా ఉన్నామని, బీజేపీని ఎదుర్కోవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
అఖిలపక్షం పేరుతో కొన్ని రాజకీయ పార్టీలు చేసే ఆందోళనల్లో తాము పాల్గొనబోమని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని తాము కోరుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలన్నింటినీ క్రోడీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, వారంలో సీఎం కేసీఆర్‌తో భేటీ అవుతామని తమ్మినేని చెప్పారు. జూన్‌లో సంతకాల సేకరణ, ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, నిరసనలు చేపడతామన్నారు. ప్రజాసంఘాల పోరాట కమిటీ ఉద్యమ కార్యాచరణకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, తాము కూడా అందులో పాల్గొంటామని తెలిపారు.
బీజేపీ ఎజెండా ప్రమాదకరం: విజయరాఘవన్, బీవీ రాఘవులు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేట్, మతతత్వ ఎజెండా దేశానికే ప్రమాదకరమని విజయరాఘవన్, రాఘవులు విమర్శించారు. అదానీ అక్రమాలపై హిండెన్‌బర్గ్ నివేదిక ఇచ్చినా దానిపై పార్లమెంటులో చర్చ జరగలేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజాస్వామిక హక్కులు కాలరాస్తున్నారని, పోలీసు రాజ్యం నడుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా సామాన్యులను సమీకరించి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు.