
హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వ సిద్ధమైంది.
కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వ సిద్ధమైంది. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలలో జరిగే ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాటు చేశారు. రేపు(మంగళవారం) ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు కాగా, ముందుగా వాటిని లెక్కించనున్నారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం రెండు హాళ్లు ఏర్పాటు చేయగా హాలుకు 7 టేబుళ్ల చొప్పున మొత్తం 14 టేబుళ్లు సిద్ధం చేశారు. ఫలితాలు సాయంత్రం నాలుగు గంటలకు వెలువడే అవకాశం ఉంది.
ఉప ఎన్నిక కౌంటింగ్ 22 రౌండ్లలో కొనసాగనుంది. ఒక్కో రౌండ్ ఫలితానికి అరగంట సమయం పట్టే అవకాశం ఉంది. కరోనా నిబంధనలు పాటిస్తూ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు సీఈవో శశాంక్ గోయల్ తెలిపారు. ఇక హుజూరాబాద్ ఉపఎన్నికకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్లను మార్చారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కరీంనగర్ సీపీ సత్యనారాయణ స్పందించారు. వాటిని మార్చేందుకు అవకాశం లేదని తెలిపారు.
ఆదివారం రాత్రి కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడుతూ... శనివారం రాత్రి పోలింగ్ ముగించుకుని కరీంనగర్‌కు వస్తున్న జమ్మికుంట మండలం కొరటపల్లి, వెంకటేశ్వరపల్లి 160,161,162 పోలింగ్ బూత్‌లకు సంబంధించిన ఈవీఎంలతో ఉన్న బస్సు జమ్మికుంట ఫ్‌లైఓవర్ వంతెన వద్ద టైర్ పంక్చర్ కావడంతో సేప్టీటైర్ అమర్చే క్రమంలో కొంత ఆలస్యమైందన్నారు.