
కరీంనగర్: విజయోత్సవ ర్యాలీలో ఈటల, బండి సంజయ్ తదితరులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నాలుగున్నర నెలల ఉత్కంఠ పోరుకు తెరపడింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. నియోజకవర్గంలో మొత్తం 2,36,873 ఓటర్లు ఉండగా.. రికార్డు స్థాయిలో 2,05,236 మంది (86.64%) ఓటేశారు. మరో 777 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. ఈసారి బీజేపీ నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్‌కు 1,07,022 ఓట్లు (ఇందులో పోస్టల్ బ్యాలెట్ 242).. టీఆర్‌ఎస్ నేత గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు 83,167 ఓట్లు (ఇందులో పోస్టల్ బ్యాలెట్ 455) వచ్చాయి. మొత్తంగా టీఆర్‌ఎస్ అభ్యర్థిపై 23,855 ఓట్ల మెజార్టీతో ఈటలవిజయం సాధించారు. నియోజకవర్గంపై తనపట్టును మరోసారి నిరూపించుకున్నారు. దాదాపు 20ఏళ్లుగా టీఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న హుజూరాబాద్ (ఇంతకుముందు కమలాపూర్) నియోజకవర్గంలో తొలిసారిగా కాషాయ జెండా ఎగిరింది.
ప్రతి రౌండులోనూ..
కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీలో మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కించా రు. 8.30 గంటలకు ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొదలైంది. మొదట హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేటకు చెందిన ఈవీ ఎం ఓట్లు లెక్కిం చారు. అప్పటి నుంచి చివరిదాకా బీజేపీ అభ్యర్థి ఈటలకు మెజారిటీ కొనసాగింది. 8వ రౌండులో 162 ఓట్లు ఎక్కువ రావ డంతో టీఆర్‌ఎస్ శిబిరంలో ఆశలు రేగాయి. కానీ 9, 10 రౌండ్లలో టీఆర్‌ఎస్ వెనుకబడింది. తిరిగి 11 రౌండ్‌లో 385 ఓట్లు ఎక్కువగా సంపాదించింది. ఆ తర్వాత ఏ దశలోనూ టీఆర్‌ఎస్ పోటీ ఇవ్వలేదు.
కారుకు పట్టున్న చోటా..
హుజూరాబాద్ అర్బన్, హుజూరాబాద్ రూరల్, వీణవంక మండలాల్లో టీఆర్‌ఎస్‌కు బాగా పట్టు ఉంది. కానీ ఆ ప్రాంతాల్లో కూడా కారు జోరు కనిపించలేదు. బీజేపీకి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ముఖ్యంగా 15వ రౌండు (జమ్మికుంట మండలం)లో 2,049 ఓట్లు లీడ్, 18వ రౌండు (ఇల్లందకుంట మండలం)లో 1,876 ఓట్ల ఆధిక్యం, 19వ రౌండు (కమలాపూర్ మండలం)లో 3,047 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఎక్కువ ఆధిక్యం వచ్చిన కమలాపూర్ ఈటల సొంత మండలం కావడం గమనార్హం. ఓట్ల లెక్కింపు ముగిసిన అనంతరం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపొందినట్టు రిటర్నింగ్ అధికారి రవీందర్‌రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఈటల రాజేందర్‌కు గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.