సాక్షి టాస్క్‌ఫోర్స్, తిరుపతి: గండాలు.. కన్నీటి సుడిగుండాల మధ్య లోకేష్ పాదయాత్ర సాగుతోంది. నాయకులకే కాదు.. అటు కార్యకర్తలు, అధికారులకు సైతం ప్రాణ సంకటంగా మారింది. తమపైనే ఆధారపడ్డ కుటుంబాలకు తీరని శోకం మిగులుతోంది. యువగళం పాదయాత్ర ప్రారంభమైన మొదటి రోజే తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిపోగా.. 14వ రోజు మరో రూపంలో గండం ఎదురైంది.
తోపులాటలో విధుల్లో ఉన్ హెడ్‌కానిస్టేబుల్ గుండె ఆగిపోయింది. ఇక అరుపులు.. కేకలు, తోపులాటల మధ్య మరో కార్యకర్త త్రిశూలంపై పడి తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. మున్ముందు ఎన్ని అనర్థాలు ఎదురవుతాయో.. ఎంతమంది ప్రాణాలు పోతాయోనని నాయకులు, కార్యకర్తల గుండెల్లో గుబులు పట్టుకుంది.
మునిగిపోతున్న నావను తెడ్డేసి పైకిలేపాలని టీటీడీ అధిష్టానం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇందులో భాగంగానే యువగళం పేరుతో పార్టీ పేరునూ స్పష్టంగా పలకలేని నారా లోకేష్‌బాబును పాదయాత్రకు దింపింది. ఆయన పాదయాత్ర ప్రారంభించిన నాటి నుంచి తరచూ అపశ్రుతులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. సినీ నటుడు నందమూరి తారకరత్న తీవ్ర గుండెపోటుతో కర్ణాటక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాజాగా గురువారం గంగాధరనెల్లూరు నియోజకవర్గానికి పాదయాత్ర చేరుకోగా.. అక్కడ టీడీపీ కార్యకర్తలు, నాయకుల తోపులాటలో పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ రమేష్(56) ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. చికిత్స కోసం చిత్తూరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు.
రోడ్డుపై బైఠాయించి.. కార్యకర్తలను పురమాయించి
లోకేష్ యువగళం పాదయాత్ర గురువారం గంగా ధరనెల్లూరు మండలం.. సమిసిరెడ్డిపల్లికి చేరుకుంది. అక్కడ రహదారిపై బహిరంగ సభకు పోలీ సులు అనుమతించకపోవడంతో లోకేష్ రగిలిపోయారు. సమిసిరెడ్డిపల్లి రహదారిపైనే సభ పెట్టేందుకు కార్యకర్తలను పురమాయించారు. కార్యకర్త నుంచి మైక్ తీసుకునేందుకు ప్రయత్నం చేయగా.. లంచ్ బ్రేక్ ఏర్పాటు చేసిన ప్రాంతానికి వెళ్లి ప్రసంగించాలని డీఎస్పీ శ్రీనివామూర్తి సూచించారు.
అయినా లోకేష్ వినకుండా రోడ్డుపై బైఠాయించారు. కార్యకర్తలందర్నీ రోడ్డుకు అడ్డుగా కూర్చోమని ఆదేశించారు. రాకపోకలకు ఇబ్బంది అవుతుందని పోలీసులు పలుమార్లు ప్రాధేయపడినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఒకానొక దశలో పోలీసులపై టీడీపీ నేతలు, కార్యకర్తలు తిరగబడి దాడిచేసేందుకు యత్నించారు. తనకు చట్టం తెలుసంటూ పోలీసులపై లోకేష్ ఊగిపోయారు. మీ అంతుచూస్తానంటూ చిందులేశారు. ఈ పరిస్థితుల్లో అక్కడే విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రమేష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
జనం లేరు.. తరలించాలి సారూ!
గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో లోకేష్ యాత్ర ప్రారంభం కాగా.. ఆ పార్టీ అగ్రనేతలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం అటు ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. గతంలో పార్టీ లేదు.. బొక్కలేదు అన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇప్పుడు ‘చిత్తూరు జిల్లాలో యువగళం యాత్రకు జనం రాకపోవడంతో అధినేత, నేను చాలా బాధపడ్డాం’’ అని చెప్పడం సంచలనంగా మారింది.
చదవండి: ఆ విషయాన్ని మాత్రం ‘ఈనాడు’ ఎందుకు చెప్పదు?
జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్‌చార్జి చిట్టిబాబుకు ఫోన్‌చేసి యాత్రకు జనాన్ని తరలించాలని.. ఎంత డబ్బయినా పెట్టి 300 వాహనాల వరకు ఉండేలా జాగ్రత్తపడాలని సూచించారు. వీరి మధ్య సాగిన సంభాషణకు సంబంధించిన ఆడియో లీక్ అవ్వడంతో టీడీపీ శ్రేణులు షాక్‌కు గురయ్యారు. లోకేష్ పాదయాత్ర డొల్లతనం బయటపడిందని జనం చర్చించుకుంటున్నారు.
టీడీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలు
గంగాధరనెల్లూరు మండలం, పోటుకృష్ణమ్మపల్లికి చెందిన లోకనాథం (47) లోకేష్ పాదయాత్రలో పాల్గొని తీవ్రంగా గాయపడ్డాడు. ముత్యాలమ్మ గుడి వద్ద పాదయాత్ర సాగుతుండగా కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పక్కనే ఉన్న త్రిశూలంపై లోకనాథం పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే టీడీపీ నేతలు గుట్టుచప్పుడు కాకుండా అతన్ని చిత్తూరుకు తీసుకెళ్లారు. లోకనాథం ఫొటోలు తీయడానికి, అతని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించిన మీడియాను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. లోకనాథం పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. రహస్య సమాచారం మేరకు లోకనాథం ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment