సాక్షి, అమరావతి: ‘అమరావతిలో జరుగుతున్నది అసలు ఉద్యమమే కాదు.. అక్కడ ప్రజా ఉద్యమమే లేదు.. అదో రియల్ ఎస్టేట్ ఉద్యమం.. కెమెరా ఉద్యమం.. అక్కడ జరిగేది భూస్వామ్య, పెట్టుబడిదారి, ధనవంతుల ఉద్యమం’ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు మనుషులు కెమెరాల కోసం చేసే అల్లరిని ఉద్యమం అంటే, ఉద్యమం అన్న పేరుకే అది అవమానం అన్నారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వారు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ.. బాబు రాజధాని కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నట్టు భ్రమ కల్పిస్తున్నారన్నారు. ఇంకా ఏమన్నారంటే..
► అమరావతి అనేది పెద్ద స్కాం. బాబు తన తాబేదార్ల కోసం పెట్టిందే అమరావతి. రాజధాని కోసం 85 మంది చనిపోయిన దాఖలాలు లేవు. అదంతా ఓ కట్టుకథ. రాజధాని కోసం త్యాగాలు లేవు. ఎవ్వరూ చనిపోలేదు. సాధారణంగా చనిపోయిన వారిని అమరావతి కోసం చనిపోయారని ప్రచారం చేస్తున్నారు. 85 మంది అమరావతి కోసం చనిపోతే ఉద్యమం ఇలా ఉంటుందా?
► దళితులకు ఇచ్చిన భూములను టీడీపీ నేతలు బలవంతంగా లాక్కున్నారు. అమరావతిలో జరుగుతున్నది దళిత వ్యతిరేక ఉద్యమం. టీడీపీ దళిత వ్యతిరేక పార్టీ. అమరావతిలో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతోంది. ఇప్పటికే కొంత మందిని అరెస్ట్ చేశారు. త్వరలో మరికొంత మందిని అరెస్ట్ చేస్తారు.
► అభివృద్ధి అంతా హైదరాబాద్‌లో కేంద్రీకృతం కావడం వల్ల మనం నష్టపోయాం. ఏ ప్రాంతానికీ అన్యాయం జరగకూడదనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన వికేంద్రీకరణ చేశారు.
అమరావతి ఉద్యమం బాబు కుట్ర
► ఈ 250 రోజుల్లో ఎక్కడా ఉద్యమమే లేదు. రాజధానిలో బాబు, ఆయన బినామీల అక్రమాలు బయట పడుతున్నాయి. అభివృద్ధిని అమరావతిలో కేంద్రీకృతం చేసి
లబ్ధిపొందాలనేది బాబు కుట్ర.
► జూమ్‌లో బాబు ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఎవరినీ సంప్రదించకుండా మూడు రాజధానులపై నిర్ణయం తీసుకున్నారని మాట్లాడటానికి చంద్రబాబుకు సిగ్గుండాలి.
పరిపాలన వికేంద్రీకరణపై శాసనసభలో చర్చ సమయంలో బాబు పారిపోయారు.
► వికేంద్రీకరణపై బాబుకు ఎందుకు వ్యతిరేకత? సెక్రటేరియట్ విశాఖకు వెళితే, హైకోర్టు కర్నూలుకు వెళితే చంద్రబాబుకు వచ్చిన నష్టమేమిటి? కమ్యూనిస్ట్‌లు కేపిటలిస్ట్‌లుగా మారిపోయారు. 54 వేల మంది పేదలకు ఇదే రాజధాని భూముల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తే, ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకున్న బాబుకు కమ్యూనిస్ట్‌లు ఎలా మద్దతిస్తారు?
► సీపీఐ కాస్తా చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియాగా మారిందా? పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం రామకృష్ణ లాంటి కమ్యూనిస్ట్‌లు దిగజారిపోయారు.
► రమేష్ హాస్పిటల్స్ నిర్లక్ష్యం కారణంగా పది మంది చనిపోయారు. డాక్టర్ రమేష్‌ను బాబు దాచిపెట్టారు. నేరస్తులను దాచిపెట్టడం కూడా నేరమే అవుతుంది. ఇప్పటికైనా డాక్టర్ రమేష్‌ను బాబు పోలీసులకు అప్పగించాలి. పది మంది ప్రాణాలు పోవడానికి కారణమైన వారికి బాబు మద్దతు ఇవ్వటం దారుణం.
బాబుకు కమ్యూనిస్టుల మద్దతు దారుణం
► పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దన్న బాబుకు కమ్యూనిస్ట్‌లు మద్దతు తెలపటం దారుణం అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
► రాజధానిలో దళితులకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యం దెబ్బ తింటుందంటారా? అఫిడవిట్‌లో ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలి.
► అమరావతి ఉద్యమంలో ఉన్న వారు చంద్రబాబు ట్రాప్‌లో పడ్డారు. రాజకీయంగా బాబు వారిని ఉపయోగించుకుంటున్నారు.
► రైతులు ప్రభుత్వంతో ఘర్షణ పడటం, సీఎం వైఎస్ జగన్‌ను దూషించటం సరికాదు. అమరావతిలో దళిత ఉద్యమం లేదు.. అది దగా ఉద్యమం.
Comments
Please login to add a commentAdd a comment