యూపీలోని అమేథీలో బీజేపీ మహిళానేత స్మృతి ఇరానీపై వివిధ వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయా? అంటే అవుననే సమాధానమే విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. అమేథీలో స్మృతి ఇరానీకి వ్యతిరేకంగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు ఇటీవల పలు చోట్ల ఆందోళనలు చేపట్టారు. ఈసారి బీజేపీకి ఓటేయబోమని ప్రతిజ్ఞ కూడా చేశారు. ఇంతకీ వీరు స్మృతీ ఇరానీపై ఎందుకు ఆగ్రహంతో ఉన్నారు?
కొంతకాలం క్రితం కాంగ్రెస్ నేత దీపక్ సింగ్‌పై అక్రమంగా కేసు పెట్టడంపై వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బీజేపీలో తమ సామాజికవర్గానికి ప్రాధాన్యత తగ్గుతున్నదని వారు వాపోతున్నారు. మహిళలను గౌరవించని ఏ పార్టీనైనా వ్యతిరేకిస్తామని కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు మహిపాల్ సింగ్ పేర్కొన్నారు. దీనికి ఉదాహరణగా ఆయన మహాభారత కాలంలో ద్రౌపది అపహరణను ఉదహరిస్తూ.. ద్రౌపదిని అవమానించనప్పుడు కొంతమంది మౌనంగా కూర్చున్నారని, వారంతా ఆ తరువాత బాధ పడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈసారి దేశవ్యాప్తంగా రాజ్‌పుత్ సమాజానికి చెందినవారెవరూ బీజేపీకి ఓటు వేయరని తెలిపారు.
స్మృతి ఇరానీని ఉద్దేశించి మహిపాల్ సింగ్ మాట్లాడుతూ మహిళా ఎంపీగా ఆమె మహిళల గౌరవం గురించి ఎప్పుడూ మాట్లాడలేదని, ఆమె పార్లమెంట్‌లో మహిళల సమస్యలను లేవనెత్తలేదని, అలాంటప్పుడు మహిళల గౌరవం కోసం పోరాడుతున్నామని చెప్పే హక్కు ఆమెకు లేదన్నారు. యోగి ఆదిత్యనాథ్‌ను కట్టడి చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, వసుంధర రాజేను తొలగించారని, మధ్యప్రదేశ్ సీఎం పదవి నుంచి శివరాజ్‌సింగ్‌ను కూడా తొలగించారని, హర్యానాలో మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కూడా తొలగించారని, రమణ్‌సింగ్ పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందేనని అన్నారు.
బీజేపీలో క్షత్రియ సామాజికవర్గం స్థాయి తగ్గుతోందని, బీజేపీకి మంచి చేసిన రాజ్‌నాథ్‌సింగ్‌ను ఆ పార్టీ పక్కన పెట్టిందని అన్నారు. బీజేపీలో క్షత్రియ సామాజికవర్గం స్థాయి తగ్గుతోందనడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయని అన్నారు. అందుకే కర్ణిసేన సామాజిక వర్గం వారంతా బీజేపీని వ్యతిరేకిస్తున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment