సాక్షి, హైదరాబాద్: పాత బస్తీలోని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయ అమ్మవారికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉద్రిక్తత నడుమ శుక్రవారం ఉదయమే భట్టి , వీహెచ్ , సీతక్క, అంజనీయాదవ్.. తదితర నేతలు ఆలయానికి చేరుకున్నారు.
బండి సంజయ్ సవాల్ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు భాగ్యలక్ష్మి అమ్మవారిని సందర్శించుకోవడం విశేషం. అదే సమయంలో.. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కరోనా త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేయించారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే భాగ్యలక్ష్మి దేవాలయం మీద చేయి వేయాలంటూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు.
బండికి రాసి ఇవ్వలేదు
తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన మా అధినేత్రి సోనియా గాంధీకి కొవిడ్ వచ్చింది. ఆమె త్వరగా కోలుకోవాలని పూజ చేశాం. అమ్మవారిని పూజించడం ఎప్పటి నుంచో ఉంది. బండి సంజయ్ పుట్టిన తర్వాతే పూజలు చేయడం లేదు. ఇదేం బండి సంజయ్‌కి రాసి ఇవ్వలేదు. కాంగ్రెస్ భావజాలం తెలిసిన వాళ్ళు అలా మాట్లాడరు అంటూ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. అమ్మవారు అందరికీ దేవత. హిందువులు అసహ్యించుకునేలా ఉంది బీజేపీ నేతల ప్రవర్తన. రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధిపొందాలని బీజేపీ ప్రయత్నిస్తోంది అంటూ విమర్శించారాయన.
Comments
Please login to add a commentAdd a comment