ఖరగ్‌పూర్(పశ్చిమబెంగాల్)/మార్ఘెరిటా(అస్సాం): అధికారంలోకి వచ్చిన తరువాత పశ్చిమబెంగాల్‌ను బంగారు బంగ్లాగా మారుస్తామని, రాష్ట్రంలో నిజమైన మార్పు తీసుకువస్తామని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్, అస్సాంల్లో ఆయన ఆదివారం ప్రచారంలో పాల్గొన్నారు. బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో, అస్సాంలోని నజీరా, మార్ఘెరిటాల్లో అమిత్ షా రోడ్ షోలను నిర్వహించారు. ఖరగ్‌పూర్‌లో తన రోడ్ షోకు భారీగా తరలివచ్చిన ప్రజలను చూస్తుంటే.. వారు మార్పు కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతుందని షా వ్యాఖ్యానించారు. వేలాదిగా జనం రావడంతో కిలోమీటరు దూరం రోడ్ షో సాగడానికే చాలా సమయం పట్టింది. ప్రచారంలో షా తో పాటు బీజేపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ విజయ్ వర్గియ, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దిలిప్ ఘోష్ తదితరులు పాల్గొన్నారు. ఖరగ్‌పూర్ సదర్ స్థానం నుంచి బీజేపీ తరఫున నటుడు హిరణ్ చటర్జీ పోటీ చేస్తున్నారు.
ఊహించని స్థాయిలో, భారీగా జనం తరలిరావడంతో అమిత్ షాతో పాటు ఇతర నాయకుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ప్రజలవైపు విక్టరీ సంకేతం చూపుతూ, ప్రజలపై గులాబీ రేకులు విసురుతూ ఆద్యంతం అమిత్ షా నవ్వుతూ, ఉత్సాహంగా కనిపించారు. దారి పొడవునా ‘ఈబర్ బీజేపీ(ఈసారి బీజేపీ)’ అనే నినాదం హోరెత్తింది. అస్సాం ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌పై అమిత్ షా విరుచుకుపడ్డారు. దేశాన్ని విడగొట్టాలని ప్రయత్నిస్తున్న పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని ఆరోపించారు. బీజేపీ ఎన్నడూ ఓటుబ్యాంక్ రాజకీయాలు చేయబోదన్నారు. 15 ఏళ్లు అధికారంలో ఉండి కూడా, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన నేత ప్రధానిగా ఉండి కూడా రాష్ట్రంలో అక్రమ వలసల సమస్యను పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రయత్నించలేదన్నారు.
మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన రాజ్యసభలో అస్సాంకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. గెలవడం కోసం కాంగ్రెస్ ఏమైనా చేస్తుందని, అస్సాంలో బద్రుద్దీన్ అజ్మల్‌కు చెందిన ఐఏయూడీఎఫ్‌తో, కేరళలో ముస్లింలీగ్‌తో, పశ్చిమబెంగాల్‌లో ఐఎస్‌ఎఫ్‌తో పొత్తు పెట్టుకుందని విమర్శించారు. అజ్మల్ చేతుల్లో అస్సాం సురక్షితంగా ఉండబోదని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం అజ్మల్ ఆలోచిస్తారా? లేక ప్రధాని మోదీ ఆలోచిస్తారా? ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. గత ఐదేళ్ల పాలనలో బీజేపీ రాష్ట్రం నుంచి చొరబాటుదారులను ఏరివేసిందన్నారు. హింస, ఆందోళనలు, అవినీతి లేని పాలన అందించిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు అధికారమిస్తే చొరబాటుదారులకు మళ్లీ అవకాశమిచ్చినట్లు అవుతుందన్నారు.
‘ఇప్పుడు మీరు కాంగ్రెస్‌కు ఓటేస్తే అది అజ్మల్ ఏఐయూడీఎఫ్‌కు వేసినట్లు అవుతుంది. వాళ్లు చొరబాట్లను ప్రోత్సహిస్తారు. చొరబాటుదార్లను ప్రోత్సహించే ప్రభుత్వం కావాలా? లేక వారిని ఏరివేసే ప్రభుత్వం కావాలా? మీరే నిర్ణయించుకోండి’ అన్నారు. ‘అధికారమిస్తే రాష్ట్రంలో అందోళనలు, మిలిటెన్సీ లేకుండా చేస్తానని నేను ఐదేళ్ల క్రితం హామీ ఇచ్చాను. ఆ హామీ నెరవేర్చాం. ఇప్పుడు రాష్ట్రంలో మిలిటెన్సీ లేదు. ఎలాంటి ఆందోళనలు లేవు. రెండు వేలకు పైగా మిలిటెంట్లు జనజీవన స్రవంతిలో కలిశారు’ అని షా వివరించారు. ఇప్పుడు రాష్ట్రం శాంతియుతంగా, అభివృద్ధి పథంలో వెళ్తోందని, ముఖ్యమంత్రి శర్బానంద్ సొనొవాల్ ఆ దిశగా కృషి చేశారని పేర్కొన్నారు. మరో ఐదేళ్లు అవకాశమిస్తే రాష్ట్రంలో వరదల సమస్యను, చొరబాటుదారుల సమస్యను పరిష్కరిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment