సాక్షి, చేవెళ్ల: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్లాన్స్ రచిస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ.. చేవెళ్లలో విజయ సంక్పల సభ తలపెట్టింది. ఈ సభకు బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో విచ్చేశారు. ఈ బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘ఢిల్లీలో ప్రధాని మోదీకి వినపడేలా గట్టిగా నినదించాలి. తెలంగాణలో అవినీతి సర్కార్ పాలన సాగిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించబోతోంది. మోదీ ఢిల్లీ నుంచి నిధులు ఇస్తుంటే అవి తెలంగాణ ప్రజలకు అందడం లేదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి. తెలంగాణలో రామరాజ్యం స్థాపిస్తాం. బీజేపీ కార్యకర్తలను చూసి కేసీఆర్ భయపడుతున్నారు. కేసీఆర్‌ను గద్దె దింపేవరకు బీజేపీ పోరాటం కొనసాగుతుంది. తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయింది. బీఆర్‌ఎస్‌తో ఏం సాధిస్తారు?. 9 ఏళ్లుగా బీఆర్‌ఎస్ అవినీతిలో కూరుకుపోయింది. తెలంగాణలో వరుసగా ప్రశ్నాపత్రాలు లీకవుతున్నాయి. తెలంగాణలో యువతకు అన్యాయం జరగుతుంది. కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి.
బండి సంజయ్ ఏం తప్పు చేశారు. పేపర్ లీకేజీపై బండి సంజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అందుకే సంజయ్‌ను కేసీఆర్ సర్కార్ జైల్లో వేసింది. బండి సంజయ్ అరెస్ట్‌ను మీరు సమర్థిస్తారా?. పేపర్ లీకేజ్‌తో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. బీజేపీ సర్కార్ వచ్చాక అవినీతిపరులను జైలుకు పంపుతాం. ప్రధాని కుర్చీ ఖాళీగా లేదని కేసీఆర్ తెలుసుకోవాలి. మరోసారి మోదీనే ప్రధాని అవుతారు. తెలంగాణలో అవినీతి గంగలా ప్రవహిస్తోంది. ఉద్యోగాల భర్తీ పేరుతో దోచుకుంటున్నారు. 9 ఏళ్లుగా టీచర్ల నియామకం చేపట్టలేదు.
తెలంగాణ కోసం మోదీ ఎన్నో పనులు చేపట్టారు. హైవేల విస్తరణ కోసం లక్ష కోట్లు ఖర్చు చేశారు. హైదరాబాద్-బీజాపూర్ హైవే కోసం నిధులిచ్చాం. కానీ, భూసేకరణను బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టలేదు. చేవెళ్ల ప్రజలకు ప్రయోజనం కలగకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సర్కార్ జవాబు చెప్పాలి.
ఎంఐఎం కోసమే విమోచన దినం జరపడం లేదు. కారు స్టీరింగ్ మజ్లీస్ చేతిలో ఉంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లు తొలగిస్తాం. మజ్లీస్‌కు కేసీఆర్ భయపడతారు.. బీజేపీ భయపడదు. అవినీతిపరులను బీజేపీ జైళ్లకు పంపిస్తుంది. తెలంగాణలో బీఆర్‌ఎస్ పని అయిపోయింది. ఇప్పుడు నడుస్తున్నది ట్రైలర్ మాత్రమే. 2024లో ఫుల్ పిక్చర్ కనిపిస్తుంది’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment