సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని.. తాము అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేస్తున్నామన్నారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. హైదరాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో మేధావుల సదస్సులో మాట్లాడిన అమిత్‌షా.. కేసీఆర్ తన పార్టీ సిద్ధాంతం ఏంటో చెప్పాలన్నారు. ఆయన లక్ష్యం కూతురును జైల్‌కు వెళ్లకుండా కాపాడుకోవడం, కొడుకును ముఖ్యమంత్రి చేయడం. బీజేపీ సిద్ధాంత పార్టీ. విదేశాల్లో భారత్ గౌరవం పెరిగింది. 2014కు ముందు దేశంలో అశాంతి ఉండేది’’ అని ఆయన పేర్కొన్నారు.
మోదీ నాయకత్వంలో దేశం ప్రగతి పథంలో దూసుకుపోతోందన్న ఆయన.. వచ్చే 50 ఏళ్లలో ప్రపంచంలోనే భారత్ కీలక పాత్ర పోషించబోతోందన్నారు. బీఆర్‌ఎస్‌ను కుటుంబ పార్టీగా అభివర్ణించిన అమిత్‌షా.. ఇలాంటి పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండవన్నారు. కేటీఆర్‌ను సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యం.. బీఆర్‌ఎస్ పార్టీ స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉంది’’ అంటూ అమిత్‌షా ఎద్దేవా చేశారు.
‘‘వచ్చే ఐదేళ్ల కోసం మూడు పార్టీల మధ్య ఎవరిని ఎన్నుకోవాలో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. 2014 ముందు దేశం లో అశాంతి, మహిళ లకు రక్షణ లేదు.. యువత ఉద్యోగాలు లేక, పారిశ్రామికవేత్తలు కూడా ఆందోళన.. దేశం ఏమవుతుంది అనే అవేదన ఉండేది.. 9 ఏళ్ల తర్వాత దేశం పరిస్థితి ఏందో అర్థం చేసుకోవచ్చు. మోదీపైన అవినీతి ఆరోపణలు లేవు. అంతర్గత రక్షణ పటిష్టంగా తయారయ్యింది’’ అని అమిత్‌షా పేర్కొన్నారు.
‘‘కరోనా టైమ్‌లో దీపాలు వెలిగించాలి అంటే కేటీఆర్ వెటకారం చేశారు. కరోనా వ్యాక్సిన్‌ను మోదీ వ్యాక్సిన్ అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. కేసీఆర్ నీళ్లు నిధుల నియామకాలు కోసం ఉద్యమం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో సంపాదించుకున్నాడు. నీళ్లు ఇవ్వలేదు.. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు. తెలంగాణ ప్రజలను ఓటు అడిగే హక్కు కేసీఆర్‌కు లేదు. దేశాన్ని మహోన్నత స్థానానికి తీసుకెళ్లే మోదీతో తెలంగాణ ఉంటుందా.. కొడుకును సీఎం చేయాలనుకుంటున్న కేసీఆర్‌తో ఉంటుందా తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలి. కేసీఆర్‌తో ఎప్పుడు కలిసేది లేదు.. కలిసి వెళ్లేది లేదు.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ఓటు వేస్తే అవినీతి ప్రభుత్వం వస్తుంది. అభివృద్ది తెలంగాణ బీజేపీతోనే సాధ్యం’’ అని అమిత్‌షా పేర్కొన్నారు.
అంతకు ముందు ఆదిలాబాద్ జనగర్జన సభలో ప్రసంగించిన అమిత్‌షా.. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆదిలాబాద్‌లో నినాదిస్తే.. హైదరాబాద్‌లో కేసీఆర్‌కు వినిపించాలన్నారు. డిసెంబర్ 3 తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం రావాలి.. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి జిల్లాల్లో సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని అమిత్ షా ప్రకటించారు.
చదవండి: కేసీఆర్‌ను గద్దె దించండి: అమిత్‌షా
Comments
Please login to add a commentAdd a comment