డిస్పూర్: అసోం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రూప్‌జ్యోతి కుర్మి శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే బీజేపీలో చేరతానని తెలిపారు. అలానే శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన కుర్మి.. రాజీనామా లేఖను అసోం అసెంబ్లీ స్పీకర్ బిస్వాజిత్ డైమరీకి అందజేశారు. అస్సాం జోర్హాట్ జిల్లాలోని మరియాని నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న రూప్‌జ్యోతి కుర్మి పార్టీని వీడుతున్న సమయంలో సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ యువనాయకులను పట్టించుకోవడం లేదని ఆరోపించడమేకాక రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా రూప్‌జ్యోతి కుర్మి మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ యువ నాయకుల సూచనలు పట్టించుకోవడం లేదు. మా మాట వినడం లేదు. ఫలితంగా అన్ని రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. రాహుల్ గాంధీ పార్టీ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా లేరు. ఆయన నాయకత్వ బాధ్యతలు స్వీకరించకపోతే పార్టీ ముందుకు సాగడం కష్టం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. అసెంబ్లీ స్పీకర్‌ని కలిసి నా రాజీనామాను అందజేస్తాను’’ అన్నారు.
‘‘ఇక అసోం నాయకులు వయసుమళ్లిన లీడర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ సారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకే ఏఐడీయూఎఫ్‌తో పొత్తు వద్దని చెప్పాం. కానీ మా మాట వినలేదు. ఫలితం ఏంటో చూశారు’’ అంటూ రూప్‌జ్యోతి సంచలన ఆరోపణలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment