సీఎంగా ప్రమాణం చేస్తున్న బొమ్మై
సాక్షి, బెంగళూరు: ఉత్కంఠకు తెరదించుతూ బీజేపీ శాసనసభాపక్ష కొత్త సారథిగా మంగళవారం ఎన్నికైన బసవరాజ బొమ్మై(61) బుధవారం కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణంచేశారు. బుధవారం ఉదయం బెంగళూరు రాజ్‌భవన్‌లో గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్.. బసవరాజ చేత సీఎంగా ప్రమాణం చేయించారు. రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో బొమ్మై దేవుని మీద ప్రమాణంచేసి సీఎంగా పగ్గాలు చేపట్టారు.
ఉదయం 11 గంటలకు మొదలైన ప్రమాణస్వీకారోత్సవం కేవలం మూడు నిమిషాల్లోనే ముగిసింది. తాజా మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సీఎంగా ప్రమాణంచేసిన రోజున ‘రైతు ప్రభుత్వం’కు సూచికగా ఆకుపచ్చ శాలువా ధరించారు. బొమ్మై మాత్రం కాషాయ రంగు శాలువాను ధరించారు. పార్టీ పెద్దల సూచన మేరకు ఒకే విడతలో పూర్తిస్థాయిలో త్వరలోనే కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటుచేస్తానని కొత్త సీఎం బసవరాజ వెల్లడించారు. ప్రమాణోత్సవానికి కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ప్రధాని మోదీ ప్రశంసల జల్లు
శివాజీనగర: కర్ణాటక నూతన సీఎంగా ప్రమాణం చేసిన బసవరాజకు ప్రధాని మోదీ శుభాభినందనలు తెలిపారు. ‘సుదీర్ఘమైన శాసన, పరిపాలనా అనుభవం బొమ్మై సొంతం’అని మోదీ ట్వీట్ చేశారు. ‘కర్ణాటక అభివృద్ధిలో మాజీ సీఎం యడియూరప్ప సేవలు అపారమైనవి. దశాబ్దాలుగా కృషి చేసి కర్ణాటకలో బీజేపీని బలోపేతం చేశారు. పార్టీ నాయకులను, కార్యకర్తలను తయారు చేయడంలో ఆయన అపార శ్రమ దాగి ఉంది’అని యడియూరప్పను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
బసవరాజ్ బొమ్మై ప్రస్థానం:
► బసవరాజ్ బొమ్మయ్ జనతాదళ్ పార్టీతో రాజకీయాల్లోకి ప్రవేశించారు.
► 1995లో జనతాదళ్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక
► 1996-97 వరకు అప్పటి సీఎంగా ఉన్న జేహెచ్ పటేల్ వద్ద రాజకీయ కార్యదర్శిగా పనిచేసిన బొమ్మయ్
► 1998,2008 ధారవాడ నుంచి 2 సార్లు ఎమ్మెల్సీగా ఎన్నిక
► 2007లో ధారవాడ నుంచి 232 కిలోమీటర్లు రైతుల కోసం పాదయాత్ర
► 2008లో బీజేపీలో చేరిన బసవరాజ్ బొమ్మయ్
► 2008లో షిగ్గాన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక
► 2008 జూన్ 7 - 2013 మే 13 వరకు జలవనరుల మంత్రిగా విధులు
► 2019 సెప్టెంబర్ 27 నుంచి 2020 ఫిబ్రవరి 6 వరకు సహకార మంత్రిగా విధులు
► 2019 ఆగస్టు 26 నుంచి 2021 జులై 26 వరకు.. రాష్ట్ర హోంమంత్రిగా పనిచేసిన బసవరాజ్ బొమ్మయ్
► వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తెచ్చిన బసవరాజు బొమ్మయ్
► మెకానికల్ ఇంజనీర్, పారిశ్రామికవేత్తగా బసవరాజు బొమ్మయ్‌కు గుర్తింపు
Comments
Please login to add a commentAdd a comment