
సాక్షి,హైదరాబాద్: సీఎం కేసీఆర్ స్వార్థపూరిత వైఖరి వల్ల రాష్ట్ర ప్రజల నీటి హక్కులకు తీవ్ర విఘాతం ఏర్పడిందని, ప్రాజెక్టులకు సంబంధించిన వివిధ అంశాలు, విషయాలపై వివరణ ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ మోసపూరిత నిర్ణయాల వల్ల కృష్ణా జలాల్లో రాష్ట్రానికి న్యాయబద్ధంగా దక్కాల్సిన వాటా కోల్పోతున్నామని ఆయన ఆరోపించారు. ఇప్పటికే కృష్ణా జలాల్లో 575 టీఎంసీలు దక్కాల్సి ఉండగా, 299 టీఎంసీలకు ఒప్పుకుని రాష్ట్రానికి ద్రోహం చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చి తద్వారా వచ్చే కమిషన్ల కోసం పొరుగు రాష్ట్రానికి సహకరిస్తున్నారని, కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా ఆర్‌ఎల్‌ఐఎస్ టెండర్ ప్రక్రియ పూర్తికి అవకాశం కల్పించారని ఆయన ఆరోపించారు. ఇరురాష్ట్రాల జలవివాదాలపై చర్చకు రెండుబోర్డులూ కేఆర్‌ఎంబీ సమావేశాలు నిర్వహిస్తున్నా ఈ సమావేశాలకు కేసీఆర్ గైర్హాజరు కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు, ప్రత్యేకించి దక్షిణ తెలంగాణ ఏడారిగా మారుతుందని తాము హెచ్చరించినా సీఎం కేసీఆర్ సకాలంలో స్పందించకపోవడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరగబోతోందన్నారు.