పట్నా: లోక్ జనశక్తి పార్టీని ఎన్డీయేలో కొనసాగించడంపై నిర్ణయం తీసుకునేది కూటమిలోని కీలక భాగస్వామి అయిన బీజేపీయేనని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో జేడీయూ 43 స్థానాలకే పరిమితం కావడానికి ఎల్జేపీనే కారణమన్న వార్తలపై నితీశ్ మాట్లాడారు. గత ఎన్నికల్లో ఆర్జేడీతో కలిసి పోటీ చేసిన జేడీయూ 71 స్థానాల్లో గెల్చడం తెల్సిందే. ఎన్డీయే మిత్రపక్షాలతో శుక్రవారం చర్చించి, ప్రమాణ స్వీకార తేదీని నిర్ణయిస్తామని నితీశ్ తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 29తో ముగుస్తుందని, అందువల్ల ప్రమాణ స్వీకారానికి తమకు తగినంత సమయముందని వ్యాఖ్యానించారు.
నవంబర్ 29 లోపు ప్రమాణ స్వీకారం చేయాలంటే ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ ఎన్నికల్లో తమ కన్నా బీజేపీకి ఎక్కువ సీట్లు రావడం వల్ల సీఎంగా పాలనలో ఏమైనా ఇబ్బంది పడే అవకాశముందా? అన్న ప్రశ్నకు నితీశ్.. అలాంటిదే ఉండబోదని సమాధానమిచ్చారు. ‘నేరాలు, అవినీతి, మతతత్వం.. ఈ మూడింటి విషయంలో రాజీ ఉండదు. వాటి విషయంలో మా విధానంలో మార్పు ఉండదు. నేను సీఎం అయిన తరువాత బిహార్‌లో ఇప్పటివరకు ఎలాంటి ఘర్షణలు జరగలేదు’ అన్నారు. ఎన్నికల్లో తక్కువ స్థానాల్లో గెలుపొందడంపై స్పందిస్తూ.. ప్రజా తీర్పు అంతిమమని వ్యాఖ్యానించారు. ‘ఇవే నా చివరి ఎన్నికల’ని ప్రచార సమయంలో తాను చేసిన వ్యాఖ్యను సరిగ్గా అర్థం చేసుకోలేదని నితీశ్‌కుమార్ తెలిపారు. ‘చివరి ఎన్నిక అంటే నా ఉద్దేశం చివరి ప్రచార సభ అని’ అని వివరణ ఇచ్చారు.
సోమవారం ప్రమాణ స్వీకారం!?
బిహార్ ముఖ్యమంత్రిగా వరుసగా నాలుగో సారి నితీశ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. ప్రమాణ స్వీకార తేదీని ఇంకా ప్రకటించనప్పటికీ.. పవిత్రమైన ‘భయ్యూ దూజ్’ పండుగ రోజైన సోమవారం ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టవచ్చని జేడీయూ వర్గాలు తెలిపాయి.
ఎల్జేపీపై బీజేపీదే నిర్ణయం: నితీశ్
Published Fri, Nov 13 2020 3:38 AM | Last Updated on Fri, Nov 13 2020 10:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment