
కలసపాడు: బద్వేలు ఉప ఎన్నికలో టీడీపీ వారు బీజేపీకి ఓట్లు వేస్తామని ముం దుకు వస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆది నారాయణరెడ్డి చెప్పారు. ఈ ఉప ఎన్నికలో టీడీపీ వారు తమకు సహకరిస్తారని ఇంతకుముందే చెప్పిన ఆయన వారు తమకు ఓట్లు వేస్తారని మరోసారి పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ సీఎం రమేష్ కలిసి ఆదినారాయణరెడ్డి కాశినాయన మండలం నరసాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వెంకటరెడ్డితో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. వైఎస్సార్ జిల్లా కలసపాడు మండలం రెడ్డిపల్లెలో సోమవారం బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహిం చింది.
ఈ సందర్భంగా ఆదినారాయణరెడ్డి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల ఎంపీటీసీ సభ్యులతో తన అన్న నారాయణరెడ్డికి ఓట్లు వేయించుకున్నామని, గెలిచిన తర్వా త వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అని ప్రకటించుకున్నారని చెప్పారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2014లో ఎందుకు సీఎం కాలేదని, వైజాగ్‌లో విజయమ్మ ఎంపీగా ఎందుకు గెలవలేదని అడిగారు. ఎంపీ అవి నాష్‌రెడ్డి రాజకీయాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. వివేకా హత్యకేసును మాఫీ చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో భూకబ్జాలు ఎక్కువయ్యాయని, అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగడాలు ఆపకపోతే శంకరగిరి మాన్యాలేనని పేర్కొన్నారు.
కేంద్రం ఇచ్చిన నిధులను వినియోగించుకోకపోవడం రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో దాదాపు 80 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులేనని చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఓటు వేయకుంటే పింఛన్లు తీసేస్తామని వలంటీర్ల ద్వారా ఓటర్లను భయపెడుతున్నారని ఆరోపించారు. కేం ద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉపాధి జాబ్‌కార్డులు, కేంద్రం నిర్మించిన రోడ్లలో తిరగొద్దు అని మేం అన్నామా.. ఇలా ఓటర్లను బెదిరించి ఓట్లు వేయిం చుకోవడం మంచి పద్ధతికాదు అని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జయరాములు, బీజేపీ మండలశాఖ అధ్యక్షుడు కృష్ణారెడ్డి పాల్గొన్నారు.