సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు తథ్యమేనా? బండి సంజయ్ స్థానంలో మరొకరిని నియమించాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారా? ఈ దిశగా ఇప్పటికే చర్చ జరుగుతోందా? ఈ ప్రశ్నలకు బీజేపీ జాతీయ పార్టీ వర్గాల నుంచి ఔననే సమాధానం వస్తోంది. అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీజేపీ పెద్దలు పార్టీలో గందరగోళాన్ని సరిదిద్దేందుకు చర్యలు చేపట్టారని.. ఈ క్రమంలో సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పగించాలని నిర్ణయించారని పార్టీలో చర్చ జోరుగా సాగుతోంది. కానీ దీనికి కిషన్‌రెడ్డి విముఖంగా ఉన్నారని.. దీనిపై ప్రధాని నిర్ణయమే ఫైనల్ అని, ఆయన స్పందన కోసం నేతలు ఎదురుచూస్తున్నారని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. ఇక రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి మార్చాక సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి ఇచ్చే చాన్సుందనే చర్చ జరుగుతోంది.
సమన్వయ లోపం నేపథ్యంలోనే..
బండి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక పారీ్టలో దూకుడు పెరిగిందని.. బీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢీ అనే స్థాయికి రావడంలో సంజయ్ విజయం సాధించారని బీజేపీ వర్గాలు అంటున్నా యి. కానీ నేతల మధ్య సమన్వయం, పాత–కొత్త నేతలను కలుపుకొని వెళ్లడం, సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడంలో సంజయ్ విఫలమయ్యారంటూ హైకమాండ్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ క్రమంలో పార్టీలో అందరినీ సమన్వయపరుస్తూ ముందుకెళ్లేందుకు, ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు.. నాయకత్వ మార్పు, ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ నియామకం అవసరమనే భావన నేతల్లో వ్యక్తమవుతున్నట్టు తెలిసింది.
కీలక ఎన్నికల నేపథ్యంలో..
దక్షిణాదిలో బలపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ.. అందుకు తెలంగాణలో అవకాశం ఉందన్న ఆలోచనతో గతంలోనే ప్రత్యేకంగా దృష్టి సారించింది. అయితే ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో పార్టీకి ఎదురుదెబ్బ తగలడంతో అప్రమత్తమైంది. అక్కడి మాదిరిగానే ఇక్కడా జరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కొందరు నేతలు చేసిన సూచనలతో నాయకత్వం ఆలోచనలో పడినట్టు సమాచారం. కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. రాష్ట్ర అధ్యక్షుడి మార్పు, ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ నియామకంతోపాటు ఇతర సంస్థాగత మార్పులు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. పార్టీ అగ్రనేత అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, రాష్ట్ర పార్టీ సంస్థాగత ఇన్‌చార్జి సునీల్ బన్సల్ తదితరులు కూడా తాము జరిపిన సమీక్షల్లో ఇదే అభిప్రాయాన్ని గుర్తించినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
మోదీ కోర్టులో బంతి!
తెలంగాణ ఎన్నికల్లో వివిధ సామాజికవర్గాల ఓట్లను రాబట్టేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని అమిత్‌షా, నడ్డా, సంతో‹Ù, బన్సల్ నిర్ణయించినట్టు తెలిసింది. ఈ దిశలోనే.. రెడ్డి వర్గానికి చెందిన కిషన్‌రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా, సీఎం కేసీఆర్‌పై పోరులో ముందున్న, బీఆర్‌ఎస్ కిటుకులు తెలిసిన, ప్రజల్లోనూ గుర్తింపు ఉన్న బీసీ నేత ఈటల రాజేందర్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించాలని ప్రాథమికంగా ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనపై మోదీ వెంటనే స్పందించలేదని.. విదేశీ పర్యటన, తిరిగి రాగానే బిజీ షెడ్యూల్ వల్ల తుది నిర్ణయమేదీ తీసుకోలేదని తెలిసింది. జూలై 3న ఢిల్లీలో జరగనున్న కీలక సమావేశంలో.. కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణతోపాటు వివిధ రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల మార్పు, సంస్థాగత మార్పులపై నిర్ణయాలు వెలువడవచ్చని పారీ్ట వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కేంద్ర మంత్రిగా ఉండేందుకే మొగ్గు!
రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టేందుకు కిషన్‌రెడ్డి విముఖంగా ఉన్నారని, కేంద్ర మంత్రిగా కొనసాగేందుకే మొగ్గుచూపుతున్నారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. బండినే కొనసాగించాలని.. ముఖ్య నేతలమంతా ఆయనతో కలసి సాగుతామని కోరుతున్నారని అంటున్నాయి. రాష్ట్రంలో పార్టీ స్తబ్దతకు నేతల తీరు కారణం కాదని, ఇతర అంశాలు ప్రభావితం చేస్తున్నాయని ఆయన చెప్తున్నారని పేర్కొంటున్నాయి. కిషన్‌రెడ్డి వాదనతో మోదీ ఏకీభవించి బండినే కొనసాగిస్తారా లేక అందరినీ కలుపుకొని వెళ్లే మరో నేతను తెరపైకి తెస్తారా? అన్న దానిపైనా పారీ్టలో చర్చ సాగుతోంది.
అవినీతిపై ఆరోపణలే.. చర్యలేవనే ప్రశ్నలతో..
కేసీఆర్ సర్కారు అవినీతి, ప్రాజెక్టుల్లో అక్రమాలు, ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రమేయం ఇలా బీజేపీ తరచూ ఆరోపణలు గుప్పిస్తోంది. బీజేపీ అగ్రనేతలు కూడా బహిరంగ సభల్లో ఈ అంశాలను ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇన్ని ఆరోపణలు చేస్తున్న బీజేపీ.. కేంద్రంలో అధికారంలో ఉండీ ఎలాంటి చర్య తీసుకోవడం లేదేమని ప్రజల్లో సందేహాలు వస్తున్నాయని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు అంటున్నారు. దీనికితోడు కొన్నిరోజులుగా సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్‌పై జాతీయ నేతల విమర్శలు తగ్గిపోవడం, ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో.. బీఆర్‌ఎస్–బీజేపీ కలసిపోయాయనే అభిప్రాయం మొదలైందని చెప్తున్నారు. దీనంతటినీ చక్కదిద్దేలా చర్యలు చేపట్టేందుకు, రాష్ట్ర పార్టీని మళ్లీ పట్టాలెక్కించేందుకు జాతీయ నాయకత్వం ఏం చేస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: BRS Party: కొత్త ముఖాలు.. కోటి ఆశలు!
Comments
Please login to add a commentAdd a comment