బీజేపీ రెండో జాబితాలో రాష్ట్రంలోని 6 ఎంపీ సీట్లకు అభ్యర్థులు
మొత్తంగా 15 లోక్‌సభ స్థానాలకు ఖరారు.. వరంగల్, ఖమ్మం పెండింగ్
ఇతర పార్టీల నుంచి చేరిన వారికి ప్రాధాన్యంపై కొందరు నేతల అసంతృప్తి
బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన వారికి వెంటనే టికెట్లు ఇవ్వడం ఏమిటనే ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి పోటీచేసే మరో ఆరుగురు అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం రెండో జాబితాను విడుదల చేసింది. తొలిజాబితాలో 9 మంది పేర్లను, తాజాగా ఆరుగురి పేర్లను ప్రకటించడంతో.. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకుగాను 15 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. వరంగల్, ఖమ్మం స్థానాలు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చిన పారాచూట్ నేతలకు ఎంపీ టికెట్లు ఇవ్వడం ఏమిటంటూ బీజేపీలో అసంతృప్త స్వరాలు వినిపిస్తున్నాయి.
సగందాకా ‘పారాచూట్ల’కే!
ఇప్పటివరకు ప్రకటించిన 15 మంది అభ్యర్థులలో ఏడుగురు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారేనని (ఒకరు పార్టీలో కూడా లేనివారు) పలువురు బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. పెండింగ్‌లోని ఖమ్మం, వరంగల్ స్థానాలను కూడా బీఆర్‌ఎస్ నుంచి చేరేందుకు సిద్ధపడ్డవారికే ఇవ్వనున్నట్టు ప్రచారం సాగుతోందని చెప్తున్నారు. అంటే 17 సీట్లలో 9 స్థానాలను (సగానికిపైగా) బయటి నుంచి వచ్చిన వారికే కేటాయిస్తే.. ఏళ్లుగా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నవారి పరిస్థితి ఏమిటని వాపోతున్నారు.ఇన్నాళ్లూ తీవ్ర విమర్శలు చేసిన బీఆర్‌ఎస్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరగానే ఎంపీ టికెట్లు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రెండో జాబితాలో డీకే అరుణ, రఘునందన్‌రావు మినహా మిగతా నలుగురు సైదిరెడ్డి, సీతారాంనాయక్, గోడెం నగేశ్, గోమాస శ్రీనివాస్ ఇతర పార్టీల నుంచి వచ్చినవారేనని అంటున్నారు.
తొలిజాబితాలో ప్రకటించిన ఎంపీ బీబీ పాటిల్ (జహీరాబాద్), ఎంపీ పి.రాములు కుమారుడు భరత్ (నాగర్‌కర్నూల్) బీఆర్‌ఎస్ నుంచి వచ్చారని.. పార్టీలో కూడా చేరని మాధవీలతకు హైదరాబాద్ టికెట్ ఇచ్చారని పేర్కొంటున్నారు. అయితే పార్టీపరంగా బలమైన అభ్యర్థులు లేని ఎంపీ సీట్లలో గెలుపు ప్రాతిపదికగా ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి జాతీయ నాయకత్వం టికెట్లు కేటాయించిందంటూ కొందరు పార్టీ ముఖ్యనేతలు సమర్థిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టు చెప్తున్నారు.
ఎస్సీ రిజర్వ్‌డ్ అన్నీ వారికేనా?
రాష్ట్రంలో మూడు ఎస్సీ రిజర్వ్‌డ్ లోక్‌సభ స్థానాలు ఉండగా.. ఆ స్థానాలను పార్టీలో ముందు నుంచీ ఉన్నవారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఇవ్వడం ఏమిటని అంతర్గతంగా విమర్శలు వస్తున్నాయి. ఈ మూడు సీట్లను మాదిగ సామాజికవర్గానికి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించడంతోపాటు ఇప్పటికే రెండు టికెట్లను (నాగర్‌కర్నూల్, పెద్దపల్లి) వారికే ప్రకటించడం పట్ల పార్టీలోని మాల సామాజికవర్గ నేతలు, కార్యకర్తల్లో అసంతృప్తి కనిపిస్తోంది.
పెండింగ్‌లో పెట్టిన వరంగల్ (ఎస్సీ) సీటును కూడా మాదిగలకే కేటాయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక్కడ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ బీజేపీలో చేరి పోటీ చేయాలని నిర్ణయించుకున్నా.. బీఆర్‌ఎస్ నేతలు తాత్కాలికంగా అడ్డుకున్నారని కాషాయ వర్గాలు అంటున్నాయి. వరంగల్ టికెట్‌ను బీఆర్‌ఎస్ కడియం కావ్యకు ఇచ్చిన నేపథ్యంలో.. అరూరి రమేశ్ బీజేపీ తరఫున పోటీ చేసేందుకు ఇంకా అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment