సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: బీఆర్‌ఎస్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల జాబితాను చూస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌కు ఎదురుదెబ్బ తగలడం ఖాయమని స్పష్టమవుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్ పేర్కొన్నారు.
కనీసం 20 మంది ఎమ్మెల్యేలు దళిత బంధు పథకంలో 30శాతం లంచం తీసుకుంటున్నట్టు తనకు సమాచారం ఉందన్న కేసీఆర్.. ఆ అవినీతిని సమర్థిస్తూ మళ్లీ అభ్యర్థులుగా ఖరారు చేయడం దేనికి సంకేతమని ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
‘‘పాచిపోయిన కూరను మళ్లీ వేడి చేసినట్టు.. చెడిపోయిన ఎమ్మెల్యేలనే మళ్లీ ప్రజలకు అందించే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్, ఆయన పార్టీ సిగ్గు తప్పిన విధానాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. సీఎం కేసీఆరే స్వయంగా పెద్ద అవినీతిపరుడు. అవినీతిలో ఆయన ఆవిష్కరిస్తున్న కొత్త విధానాలకు ఆస్కార్ స్థాయి అవార్డు ఇవ్వవచ్చు..’’అని తరుణ్ ఛుగ్ వ్యాఖ్యానించారు.
మహిళలకు సీట్లు ఏవి?
అసెంబ్లీ, పార్లమెంట్‌లో మహిళలకు 30శాతం రిజర్వేషన్లు కల్పిం చాలంటూ కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో ధర్నా చేశారని.. ఇప్పుడు బీఆర్‌ఎస్ 115 మంది అభ్యర్థుల్లో ఏడుగురే మహిళలకు టికెట్ ఇవ్వడం దేనికి సంకేతమని తరుణ్ ఛుగ్ నిలదీశారు. సొంత పార్టీలో మహిళలకు జరిగిన అన్యాయాన్ని కవిత ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు.
మునుగోడు ఉప ఎన్నికల సమయంలో సీపీఐ, సీపీఎంలతో దోస్తీ కట్టి, కలిసే ఉంటామని ప్రకటించిన కేసీఆర్.. ఇప్పుడు వదిలేశారని పేర్కొన్నారు. కేసీఆర్ అవకాశవాద రాజకీయాలకు ఇది నిదర్శనమని.. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ విద్యార్థులు, ఉద్యోగులు, ఉద్యమకారులను వాడుకుని వదిలేశారని ఆరోపించారు. అందుకే ప్రజలు బీఆర్‌ఎస్‌ను బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారని, వచ్చేదీ బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారేనని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment