సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సర్కార్‌ను ఓడించేందుకు అనుసరించాల్సిన వ్యూహం ఖరారుపై బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా అందరి అభి ప్రాయాలను పరిగణనలోకి తీసుకోను న్నట్టు పార్టీ నాయకత్వం స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో రాబోయే వంద రోజుల్లో ఎలాంటి వ్యూహాలు, కార్యాచరణ చేపడితే బావుంటుందనే దానిపై అభిప్రాయసేకరణ చేపట్టింది.
గత 2, 3 ఏళ్లలో పార్టీలో చేరిన మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మె ల్యేలు, మాజీ చైర్ పర్సన్లు, ఇతర నాయకులతో రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్, సహ ఇన్‌చార్జి సునీల్ బన్సల్ శనివారం పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమ య్యారు. పార్టీపరంగా చేపట్టాల్సిన కార్య క్రమాలు, ముఖ్యమైన సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై సూచించాలని వీరు కోరినట్టు తెలిసింది.
బీఆర్‌ఎస్ నుంచి వెలమ, కాంగ్రెస్ నుంచి రెడ్డి సామాజికవర్గం నుంచి సీఎం అభ్యర్థులను ప్రకటించే అవకాశమున్నందున, రాష్ట్రంలో అధికశాతం ఓటర్లను ఆకర్షించేలా బీసీ నేతను బీజేపీ సీఎం అభ్యర్థిగా ముందుగానే ప్రకటించాలని కొందరు సూచించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
పలు సందర్భాల్లో కేసీఆర్ సర్కార్ అవినీతిపై, ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయంపై బీజేపీ అగ్ర త్రయం మోదీ, అమిత్ షా, నడ్డా తీవ్ర విమర్శలు చేసి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తప్పుడు సంకేతాలిస్తున్నట్టు కొందరు నేతలు ప్రస్తావించినట్టు తెలిసింది. ఈ విషయంపైనే కిందిస్థాయిలో ఎక్కువగా తమను ప్రశ్నిస్తున్నారని చెప్పినట్లు సమాచారం. దీనిపై చర్యలు ఉండాలంటూ సూచించగా, వారు చేసిన సూచనలను ముఖ్యనేతలు పరిగణనలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఏ పని బాగా చేస్తారో చెప్పండి...
తాము ఇక్కడే అందుబాటులో ఉంటామని, వ్యక్తిగతంగా ఎవరైనా వచ్చి తమ అభిప్రాయాలు చెప్పవచ్చని జవదేకర్, బన్సల్ పేర్కొన్నట్టు తెలిసింది. ఎన్నికల్లో పోటీకి ఆసక్తిలేని వారు పార్టీ కోసం తాము ఏయే రంగాల్లో, విధుల్లో బాగా పనిచేయగలరో చెబితే వారికి ఆయా బాధ్యతలు అప్పగిస్తామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తాను అందుబాటులో లేకపోతే కార్యాలయంలోనే ఉండే సీనియర్‌నేత నల్లు ఇంద్రసేనారెడ్డికి చెప్పొచ్చన్నారు.
పార్టీ గ్రాఫ్ పడిపోయిందని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని, నేటికి కూడా బీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయంగా ఉందని మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చెప్పినట్టు తెలిసింది. తాను పార్టీలో చేరాక మూడేళ్లకు ఇలాంటి సమావేశానికి తొలిసారి పిలిచారని ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ పేర్కొన్నట్టు తెలిసింది.
ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, గరికపాటి మోహన్‌రావు, డా.జి.విజయరామారావు, మర్రి శశిధర్‌రెడ్డి, కపిలవాయి దిలీప్‌కుమార్, కుంజా సత్యవతి, మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment