BJP State President Kishan Reddy Sensational Comments On BRS Party And CM KCR - Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ను ఫాంహౌస్‌ అరెస్టు చేస్తాం

Jul 22 2023 1:41 AM | Updated on Jul 22 2023 11:43 AM

BJP state president Kishan Reddy comments over brs  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అవినీతి, కుటుంబ, దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ‘బుల్డోజర్‌ ప్రభుత్వం’ రావాల్సిందేనని కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘సీఎం కేసీఆర్‌ అవినీతికి రారాజు. ఆయన చేయని మాఫియా పని లేదు. దేశంలో ఏ రాజకీయ పార్టీ ఇంత అవినీతికి పాల్పడలేదు.

ఈప్రభుత్వాన్ని అబిడ్స్‌ చౌరస్తాలో పాతరేసే దాకా నిద్రపోయేది లేదు. నియంత, దుర్మార్గ, నిరంకుశ కల్వకుంట్ల రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేసి కూకటివేళ్లతో పెకిలిస్తాం. ఖబడ్దార్‌ కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ను ఫాంహౌస్‌ అరెస్టు చేసే సమ యం ఆసన్నమైంది..’ అని హెచ్చరించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి శుక్రవారం పార్టీ కార్యా లయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.  ‘తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో జన ప్రభంజనం, నిశ్శబ్ద విప్లవం రానుంది. ఇందులో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ కొట్టుకుపోవడం ఖాయం’ అని చెప్పారు. 

వెయ్యి మంది కేసీఆర్‌లు వచ్చినా...
‘వెయ్యి మంది కేసీఆర్‌లు వచ్చి తలకిందులుగా తపస్సు చేసినా, లక్ష మంది అక్బరుద్దీన్, అసదుద్దీన్‌లు వచ్చి తలలు నరుక్కున్నా.. వేలాది మంది రాహుల్‌ గాంధీలు వచ్చినా 2024లో మోదీ ప్రభుత్వం రాకుండా అడ్డుకోలేరు. ఎంఐఎం, బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మూడు పార్టీల్లో దేనికి ఓటేసినా మూడు ముక్కల పార్టీకి వేసినట్లే. ఓల్డ్‌ సిటీలో ఓ మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకున్న కేసీఆర్‌.. బీజేపీని మతతత్వ పార్టీ అనడం విడ్డూరం..’ అని కిషన్‌రెడ్డి విమర్శించారు. 

సమష్టి నిర్ణయాలతో ముందుకెళదాం..
‘నేను పార్టీకి అధ్యక్షుడిని కావొచ్చు. సమావేశాలకు అధ్యక్షత వహించవచ్చు. కానీ సీనియర్‌ నేతలు, పెద్దలు అందరం కలిసి సమష్టి నిర్ణయాలు తీసుకుందాం. కలిసి పోరాటం చేద్దాం..’ అని కిషన్‌రెడ్డి చెప్పారు. బీజేపీ ఎప్పుడూ బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల కోసం ఈ నెల 24న జిల్లా కేంద్రాల్లో ధర్నాలకు పిలుపునిస్తున్నామని, 25న ఇందిరాపార్కులో పెద్ద ఎత్తున నిరసన చేపడతామని తెలిపారు. 

సంజయ్‌కు మరిన్ని మంచి అవకాశాలు: ప్రకాశ్‌ జవదేకర్‌
బండి సంజయ్‌ రాష్ట్రంలో బీజేపీకి మంచి ఊపు తీసుకొచ్చారని, ఆయనకు పార్టీ మరిన్ని  మంచి అవకాశాలు కల్పిస్తుందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్‌ జవదేకర్‌ చెప్పారు. మరో నాలుగు నెలల్లో కేసీఆర్‌కు ప్రజలు బై.. బై చెబుతారని, ఇది ఖాయం అని అన్నారు.

తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌ చెప్పారు. సామాన్యుల కలలు నెరవేరే రోజు దగ్గర్లోనే ఉందని ఎంపీ డా.కె.లక్ష్మణ్‌ అన్నారు. పాత కొత్త అనే తేడా లేకుండా అందరూ కలిసి పోరాడి కేసీఆర్‌ను గద్దె దింపాలని జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పిలుపునిచ్చారు.

కేసీఆర్‌ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం ఖాయం: ఈటల
అందరం కలిసికట్టుగా కేసీఆర్‌ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని, రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయడం తథ్యమని రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ చెప్పారు. నగరాలకు పరిమితం అనుకున్న పార్టీని బండి సంజయ్‌ గ్రామస్థాయికి తీసుకెళ్లారని అభినందించారు. కారు (బీఆర్‌ఎస్‌ గుర్తు) తాళాలు మనం తీసుకోవాలని, తాళాలు తీసుకుంటే కారు ముందుకు వెళ్ళదని మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. 

ఏపీలో పేదలకు 20 లక్షల ఇళ్లు కట్టారు
‘కాంగ్రెస్‌ పార్టీ చేయని మోసం, కుట్ర లేదు. దానిని తలదన్నే విధంగా బీఆర్‌ఎస్‌ దేశంలోనే అత్యంత అవినీతిమయ ప్రభుత్వంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు 20 లక్షల ఇళ్లు కడితే పక్క రాష్ట్ర సీఎం కేసీఆర్‌కు సోయి కూడా లేదు. ఉమ్మడి ఏపీలో అప్పటి సీఎం దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి రేషన్‌కార్డులు ఇచ్చారు. ఆ తర్వాత తొమ్మిదేళ్ల కేసీఆర్‌ హయాంలో ఒక్క కొత్త కార్డు కూడా ఇవ్వకపోవడం దారుణం. 2018 నుంచి కొత్త పెన్షన్లు రాలేదు..’ అని అన్నారు.

బీఆర్‌ఎస్‌ను ఓడించాలని తెలంగాణ ప్రజలు ఫిక్స్‌ అయ్యారు
‘మేమంతా పోరాటం చేస్తే కేసీఆర్‌ సీఎం కుర్చీలోకి వెళ్లి కూర్చున్నారు. అందరూ తనకు బానిసలుగా ఉండాలని కోరుకుంటున్నారు. నేను, నా తర్వాత కొడుకు, ఆ తర్వాత మన వడు రాజులుగా ఉంటాం.. మీరెప్పుడూ బాని సలు గానే ఉండాలన్నట్లు సీఎం చూస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా బీజేపీ నేతృత్వంలో యుద్ధం ప్రారంభమైంది. బీఆర్‌ఎస్‌ను ఓడించాలని తెలంగాణ ప్రజలు ఫిక్స్‌ అయ్యారు.

కత్తికైనా కనికరం ఉంటుంది కానీ తెలంగాణ ప్రజలకు ఉండదు. రజాకార్లను తరిమిన గడ్డ ఇది. కేసీఆర్‌ డబ్బు, అధికారం, పోలీసు యంత్రాంగం మా పోరాటాన్ని ఆపలేవు. మమ్మల్ని జైలుకు పంపించినా భయపడేది లేదు. సింహం (బీజేపీ) ఒక అడుగు వెనక్కు వేసిందంటే పది అడుగులు ముందుకు దూకడానికే..’ అని కిషన్‌రెడ్డి చెప్పారు.

బాత్రూంలోకి వెళ్లి ఏడ్చా: రాజగోపాల్‌రెడ్డి
‘రాష్ట్రంలో బీజేపీకి జోష్‌ వచ్చిందంటే దానికి కారణం బండి సంజయ్‌. ఈ రోజు సంజయ్‌ను చూసి కళ్ళలో నీళ్ళు తిరిగితే బాత్రూంలోకి వెళ్లి ఏడ్చా. కేసీఆర్‌కి వ్యతిరేకంగా సంజయ్‌ తీవ్రస్థాయిలో పోరాటం చేశారు. సంజయ్‌ను పార్టీ గుండెల్లో పెట్టుకోవాలి. కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి ఈడీని మేనేజ్‌ చేశారు.. అందుకే కవిత బయట ఉంది. భవిష్యత్‌లో కేసీఆర్‌ను, ఆయన కొడుకును కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు జైల్లో పెడతాయి.

పార్టీ మారతానంటూ నాపై దుష్ప్రచారం చేస్తున్నారు..’ అని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి అన్నారు. బీజేపీ మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జి మురళీధర్‌రావు, ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు, పార్టీ నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి తదితరులు మాట్లాడారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement