సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కౌలురైతులకూ ‘రైతుబంధు’ పథకాన్ని వర్తింపజేయాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే బీసీ సబ్‌ప్లాన్ చట్టాన్ని తీసుకురావాలన్నారు. ‘దళితబంధు’తోపాటు ‘బీసీబంధు’పథకాన్ని కూడా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. గొర్ల పంపిణీలో కేంద్రం నయాపైసా కూడా ఇవ్వడం లేదంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై సంజయ్ మండిపడ్డారు.
గొర్ల పంపిణీకి ఇచ్చే రుణంలో కేంద్రం రూ.వెయ్యి కోట్ల సబ్సిడీ ఇస్తున్న విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. బీసీలపట్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యధోరణికి నిరసనగా ఉధృత పోరాటాలకు ఓబీసీ మోర్చా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. శనివారం బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్‌రాజ్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ నియంత, అవినీ తి, కుటుంబ పాలనపట్ల విసిగిపోయిన ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు.
బీసీ కుటుంబాలకు ‘బీసీబంధు’పేరిట రూ.10 లక్షల చొప్పున సాయం అందించాలని డిమాండ్ చేశారు. ‘బీసీ నిరుద్యోగులు, ఉపాధి కరువైన వాళ్లు లక్షల్లో ఉన్నరు. వాళ్లకు ఉద్యోగాల్లేవు. స్వయం ఉపాధితో బతుకుదామంటే రుణాలిచ్చే దిక్కులేదు. లోన్లు ఇస్తామని గత ఎన్నికల ముందు గొప్పగా ప్రకటించిన కేసీఆర్ మాటలు నమ్మి దాదాపు 6 లక్షల మంది బీసీ యువత దరఖాస్తు చేసుకున్నరు. ఎన్నికలప్పుడు కొద్దిమందికి ఇచ్చి ఆశజూపిన కేసీఆర్ ఓట్లు దండుకున్నాక ఆ ఊసే ఎత్తడం లేదు’అని విమర్శించారు.
బీసీబంధు కోసం పోరు: లక్ష్మణ్
రాష్ట్రప్రభుత్వం దళితబంధు పథకం ప్రకటించినట్లుగానే ‘బీసీబంధు’పథకం కోసం పోరాటం చేస్తామని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వెల్లడించారు. బీసీబంధు కింద కుటుంబానికి రూ.పది లక్షలు కేటాయించి కులవృత్తులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ వర్గాలకు బీజేపీని దగ్గర చేసే ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు.
రాష్ట్రంలో బీసీల బలం వెల్లడౌతుందన్న భయంతోనే సమగ్ర కుటుంబ సర్వే వివరాలను కేసీఆర్ ప్రభుత్వం బయటపెట్టడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకున్న 34 శాతం రిజర్వేషన్లను కేసీఆర్ 18 శాతానికి కుదించారని విమర్శించారు. ఓబీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment