సాక్షి, విజయవాడ: రామతీర్ధం ఘటన ప్రతిపక్షాల కుట్ర అని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు ముందు రోజే టీడీపీ ఈ కుట్ర చేసిందని, పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించబోమని, బాధ్యులు ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రామతీర్ధ ఆలయాన్ని తామే అభివృద్ధి చేశామన్న మంత్రి బొత్స.. ఈ ఘటన జరిగిన వెంటనే విచారణకు ఆదేశించామన్నారు.
‘‘విషయం తెలిసిన వెంటనే మా ఎంపీ, ఎమ్మెల్యే రామతీర్ధం వెళ్లారు. మరి టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు రామతీర్ధం ఎందుకు వెళ్లలేదు? చంద్రబాబు చిల్లర రాజకీయాల కోసం రామతీర్ధం వెళ్తున్నారు. సీఎం పర్యటనకు ముందు రోజు ఉద్దేశపూర్వకంగానే టీడీపీ కుట్ర చేసింది. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల నుంచి దృష్టి మరల్చేందుకే చేయడానికే చంద్రబాబు కుట్రలు రచించారు. ఈ ఘటనలో దోషులు ఎంతటి వారైనా శిక్షిస్తాం. రామతీర్ధంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
రామతీర్థం చేరుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి
రాముల వారి కోవెలలో జరిగన ఘటనను పరిశీలించేందుకు వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ పెనుమత్స సురేశ్ తదితరులు బోడికొండ చేరుకున్నారు. జై శ్రీరామ్ నినాదాలతో రామాలయాన్ని దర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పెనుమత్స సురేశ్ మాట్లాడుతూ.. ‘‘ రామతీర్ధం ఘటనపై టీడీపీ రాజకీయం చేస్తోంది. ప్రభుత్వంపై బురద చల్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. రామతీర్ధం ఘటనపై పోలీసుల విచారణ జరుగుతోంది’’ అని పేర్కొన్నారు.
కఠిన చర్యలు తప్పవు: దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి
చంద్రబాబు హడావుడిగా రామతీర్ధానికి ఎందుకు వెళ్లారని దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. ‘‘బాబు హయాంలో దేవాలయాలపై దాడులు జరిగినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని రామతీర్థం వెళ్లారు. అక్కడి రాముడి ఆలయాన్ని చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు.
ఇప్పుడు కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు’’ అని హెచ్చరించారు.
శిబిరం ఏర్పాటు చేసిన శిబిరం
ఇదిలా ఉండగా.. రామతీర్ధంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేశారు. టీడీపీ శిబిరానికి పోటీగా దీనిని నిర్వహిస్తున్నారు. కాగా ఘటనను పరిశీలించేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు రామతీర్థం చేరుకుంటున్నాయి. టీడీపీ సానుభూతిపరులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని నినాదాలు చేస్తూ.. ప్రతిపక్ష పార్టీ తీరును ఖండిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment