సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి పరిధిలో గులాబీ జెండా మాత్రమే ఎగరాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఆ ప్రాంతంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సింగరేణి సంస్థకు చెందిన పాఠశాలల్లోని కాంట్రాక్టు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం ఆదివారం హైదరాబాద్‌లో కవితను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తే ఆ ప్రమాదాన్ని కేసీఆర్ తప్పించారని చెప్పారు. ఆర్టీసీ సంస్థను కూడా ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాకముందు సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల అంశం తీవ్రమైన సమస్యగా ఉండేదని, అప్పట్లో కేవలం 4,000 ఉద్యోగాలు మాత్రమే ఇస్తే, తెలంగాణ ఏర్పడిన తర్వాత 20 వేల ఉద్యోగాలు కల్పించారని చెప్పారు.
సింగరేణిలోని పాఠశాలల టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలను కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ జనరల్ సెక్రెటరీ మిరియాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment