TS: చేతికే చెక్‌ పెట్టాలి! | brs considering congress as main rival | Sakshi
Sakshi News home page

వచ్చే ఎన్నికల్లో తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సే అని భావిస్తున్న బీఆర్‌ఎస్‌

Published Fri, Jun 9 2023 1:59 AM | Last Updated on Fri, Jun 9 2023 3:41 AM

brs considering congress as main rival - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల కోసం తన సన్నద్ధతను భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) వేగవంతం చేసింది. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీల కదలికలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత జాతీయ, రాష్ట్ర స్థాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ఆ పార్టీ.. రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల నుంచి ఎదురయ్యే పోటీపై లెక్కలు వేస్తోంది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల గణాంకాలు, వివిధ రూపాల్లో అందిన నివేదికల ఆధారంగా తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సేనన్న అంచనాకొచ్చింది.

ఆ పార్టీ అనుసరించే వ్యూహాలు, ఎత్తుగడలు, ఇస్తున్న హామీలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తీరుతెన్నుల వంటి అంశాలపై లోతుగా దృష్టి సారించింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు వరుస సభలు, సమావేశాలతో క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆతీ్మయ సమ్మేళనాలు, దశాబ్ది ఉత్సవాల పేరిట పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికల వాతావరణంలోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్‌ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అక్కడి రాజకీయ పరిస్థితులు, సమీకరణాలు, పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీల పనితీరుపై కూడా కేసీఆర్‌ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. 

గత రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్సే.. 
రాష్ట్ర అవతరణ నేపథ్యంలో జరిగిన 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీయే ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. 119 అసెంబ్లీ స్థానాలకు గాను 2014లో 21 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందగా, మరో 50 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ 19 చోట్ల విజయం సాధించిన కాంగ్రెస్‌ మరో 68 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. ఇక 2014లో ఐదు స్థానాల్లో, 2018లో కేవలం ఒకే చోట బీజేపీ అభ్యర్థులు గెలిచారు. రెండు ఎన్నికల్లోనూ బీజేపీ పది నియోజకవర్గాల్లో రెండో స్థానంలో నిలవగా, ఇందులో సగం వరకు హైదరాబాద్‌ నగరంలోనే ఉండటం గమనార్హం. ఈ గణాంకాలతో పాటు, ప్రస్తుతం వివిధ సంస్థల నుంచి అందుతున్న సర్వేలు, నిఘా సంస్థల నివేదికల ఆధారంగా వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ప్రధాన పోటీ ఉంటుందో బీఆర్‌ఎస్‌ అధినేత విశ్లేషిస్తున్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలు, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ కొంత పుంజుకున్నట్లు కనిపించినా, కర్ణాటక ఎన్నికల తర్వాత ఆ పార్టీ గ్రాఫ్‌ గణనీయంగా తగ్గినట్లు అధికార పార్టీ అంచనా వేస్తోంది. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు కొంత మెరుగయ్యే అవకాశమున్నా ప్రధాన ప్రత్యరి్థగా మాత్రం కాంగ్రెస్‌ పార్టీయే ఉంటుందని కేసీఆర్‌ లెక్కలు వేస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. సుమారు 80 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమకు కాంగ్రెస్‌తోనే ప్రధానంగా పోటీ ఉంటుందని బీఆర్‌ఎస్‌ లెక్కలు వేస్తోంది.  

చేరికలతో బలోపేతం 
రాష్ట్ర అవతరణ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన కేసీఆర్‌ 2014 ఎన్నికల తర్వాత 25 మంది ఇతర పారీ్టల ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. ఇందులో కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు ఉన్నారు. టీడీపీ నిరీ్వర్యమైనా, 2018 ఎన్నికల్లో మొత్తం మీద 87 స్థానాల్లో కాంగ్రెస్‌ తన పట్టు ప్రదర్శించింది. 2018 తర్వాత 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించిన హుజూర్‌నగర్, మునుగోడు స్థానాలను ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్‌ కేవలం ఐదు స్థానాలకే పరిమితమైంది. 2014 ఎన్నికల్లో వివిధ పారీ్టల నుంచి చేరిన 25 మంది ఎమ్మెల్యేలకు తిరిగి 2018లో బీఆర్‌ఎస్‌ టికెట్లు దక్కగా, తీగల కృష్ణారెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, బానోత్‌ మదన్‌లాల్‌ ఓటమి పాలయ్యారు. అయితే వీరిపై గెలుపొందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరూ తర్వాతి పరిణామాల్లో బీఆర్‌ఎస్‌ గూటికే చేరుకోవడం గమనార్హం. ఈ విధంగా కాంగ్రెస్‌ కుదేలైనట్లు కనిపిస్తున్నా పొంగులేటి, జూపల్లి వంటి నేతలు ఆ పారీ్టలో చేరితే ఆ పార్టీయే తమ ప్రధాన ప్రత్యరి్థగా ఉంటుందని కేసీఆర్‌ భావిస్తున్నారు. అందుకనుగుణంగా బీఆర్‌ఎస్‌ ఎన్నికల వ్యూహం ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

వివిధ పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరికలు

పార్టీ 2014 2018
కాంగ్రెస్‌                 07 12 
టీడీపీ                12 02 
వైఎస్సార్‌సీపీ          03 – 
బీఎస్పీ             02   – 
సీపీఐ             01   –  
ఇతరులు              02
మొత్తం                25  16

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement