రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్
పేదలకో న్యాయం.. పెద్దలకో న్యాయమా?
బుల్డోజర్లకు అడ్డం పడైనా పేదలకు న్యాయం చేస్తాం
‘మూసీ’ పేరుతో భారీ కుంభకోణానికి తెరలేపారు
కూకట్‌పల్లి (హైదరాబాద్)/సాక్షి, హైదరాబాద్: హైడ్రా పేరుతో ప్రభుత్వం హైడ్రామాలు ఆడుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు మండిపడ్డారు. సామా న్యులకు అన్యాయం జరిగే పక్షంలో బుల్డోజర్లకు అడ్డం పడన్నా న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆక్రమణలకు తప్పుడు అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్ వారేనని చెప్పారు.
బ్లాక్ లిస్టు అయిన పాకిస్తాన్ కంపెనీకి మూసీ సుందరీకరణ కాంట్రాక్టు ఇచ్చి భారీ కుంభకోణానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ కుంభకోణానికి తెర లేపిన పెద్దల బాగోతాలను బయటకు తీస్తామని అన్నారు. బుధవారం ఫతేనగర్, ఖాజాకుంటలో మురుగునీటి శుద్ధి కేంద్రాలను (ఎస్‌టీపీలు) సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
కోర్టులను అపహాస్యం చేస్తున్నారు
‘హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో పేదలకు ఓ న్యాయం, పెద్దలకు ఓ న్యాయం జరుగుతోంది. వేదశ్రీ అనే ఏడేళ్ల పాప తన పాఠ్య పుస్తకాలు తీసుకోవటానికి కూడా సమయం ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేశారు. కస్తూరి అనే మహిళ చెప్పుల దుకాణాన్ని కూడా కూల్చివేశారు. కోర్టు సెలవు దినాన కావాలని ఉదయమే వచ్చి అభాగ్యుల ఇళ్లను కూల్చివేస్తూ కోర్టులను అపహాస్యం చేస్తున్నారు.
బఫర్ జోన్‌లో అనుమతులు ఇచ్చిన వారిని వదిలేసి, పేదల ఇళ్లను కూల్చివేయటం ఎంతవరకు సబబు? తమ ప్రభుత్వ హయాంలో పేదలకు లక్ష ఇళ్లు నిర్మించి ఇచ్చాం. మీకు చిత్తశుద్ధి ఉంటే పేదవారికి ఇళ్లు నిర్మించి ఇవ్వండి. మీ దౌర్జన్యాలను, దాషీ్టకాలను ఇలాగే కొనసాగిస్తే ప్రజలు బుద్ధి చెబుతారు.
మీ ఫాంహౌస్‌ల వీడియోలు బయట పెడతాం
జీహెచ్‌ఎంసీ, హైడ్రా ఆఫీసు, నీ అన్న ఇళ్లు బఫర్ జోన్‌లోనే ఉన్నాయి. మీ మంత్రుల ఫాంహౌస్‌లు కూడా బఫర్ జోన్‌లోనే ఉన్నాయి. అవసరమైతే ఫాంహౌస్‌ల వీడియోలు బయట పెడతాం. ముందు వాటిని కూలగొట్టి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితో రియల్ ఎస్టేట్ వ్యాపారం 42 శాతానికి పడిపోయింది. ఎంతోమంది కార్మికులు ఉపాధి దొరకక ఖాళీగా ఉంటున్నారు. హైడ్రా బాధితులందరికీ మేం అండగా ఉంటాం. ప్రజలు తెలంగాణ భవన్‌కు కూడా వచ్చి ఫిర్యాదులు ఇవ్వొచ్చు..’అని కేటీఆర్ తెలిపారు.
కేసీఆర్ సంకల్పం తీసుకుని ‘మురుగునీటి’పనులు పూర్తి చేశారు
‘మా ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో నాలాల పరిరక్షణతో పాటు రూ.4 వేల కోట్లతో 31 ఎస్‌టీపీలను నిర్మించాం. కేవలం కూకట్‌పల్లిలో నియోజకవర్గంలోనే రూ.350 కోట్లు ఖర్చు పెట్టాం. దక్షిణాసియాలోనే 100% మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్ చరిత్ర సృష్టించబోతోంది. కేసీఆర్ సంకల్పం తీసుకుని ఈ పనులు పూర్తి చేశారు. గత 10 నెలల్లో ఈ ప్రభుత్వం ఏ ఒక్క మంచి పని కూడా చేపట్టలేదు..’అని కేటీఆర్ విమర్శించారు.
హైదరాబాద్ ప్రజలు సంపూర్ణ ఆశీర్వాదం ఇచ్చి బీఆర్‌ఎస్‌ను గెలిపించినందుకు వారికి రుణపడి ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూద్ ఆలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, కేపీ వివేకానంద్, కాలేరు వెంకటే‹Ù, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
మనం సంధికాలంలో ఉన్నాం
– మళ్లీ నాలుగేళ్లలోనే కేసీఆర్‌ను సీఎంగా గెలిపించుకోవాలి
‘ఉద్యమ పార్టీగా అనేక ఆటు పోట్లు ఎదుర్కొని తెలంగాణ సాధించిన మనం ఇప్పుడు సంధి కాలంలో ఉన్నాం. 14 ఏళ్లు ఉద్యమ పార్టీ, పదేళ్లు అధికార పార్టీగా ఉన్న మనం ఇప్పుడు పోషిస్తున్న ప్రతిపక్ష పాత్ర కొత్తది. రాష్ట్రంలో చాలామంది మనవైపు చూస్తున్నారు. ఈ సమయంలో పార్టీని బలోపేతం చేసుకోవాలి. గాడిద ఉంటేనే గుర్రం విలువ తెలుస్తుంది అన్నట్లు చిట్టి నాయుడు (రేవంత్‌రెడ్డి) ఉంటేనే కేసీఆర్ విలువ తెలుస్తుంది.
ఈ ప్రభుత్వం తీరు చూసి మళ్లీ కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మళ్లీ నాలుగేళ్లలో కేసీఆర్‌ను సీఎంగా గెలిపించుకోవాలి..’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అధ్యక్షతన జరిగిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
వందేళ్ల పాటు దృఢంగా ఉండేలా పార్టీ నిర్మాణం
‘ఒక్కో జిల్లా కమిటీలో 800 మందికి పైగా కార్యకర్తలు, నేతలకు పదవులు ఇచ్చే వీలుంటుంది. తమిళనాడులో డీఎంకే పార్టీ 76 ఏళ్లుగా రాజకీయాలను శాసిస్తోంది. 24 ఏళ్ల మన పార్టీ మరో వందేళ్ల పాటు దృఢంగా ఉండేలా పార్టీ నిర్మాణంపై దృష్టి పెడదాం. శిక్షణ శిబిరాలు ఏర్పాటుతో పాటు గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకుందాం. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం షాడో గవర్నమెంట్ మాదిరిగా పనిచేసేందుకు కమిటీలు వేస్తాం..’అని కేటీఆర్ చెప్పారు.
స్టేషన్ ఘనపూర్ అభ్యర్ధిగా రాజయ్య
‘కొందరు పెద్ద నాయకులు పదవులు అనుభవించి పార్టీని వదిలివెళ్లారు. వారిని గతంలో రేవంత్ పచ్చిబూతులు తిట్టినా సిగ్గు లేకుండా ఆయన చుట్టూ తిరుగుతున్నారు. ఫిరాయింపులపై నెలలోగా నిర్ణయం తీసుకోవాలనే కోర్టు తీర్పుతో వారిలో భయం మొదలైంది. .’అని కేటీఆర్ తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కె.వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment