కాంగ్రెస్ ప్రభుత్వ చర్యకు ఎక్కడికక్కడ నిరసన
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు
బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే రాజీవ్ విగ్రహాన్ని గాం«దీభవన్‌కు తరలిస్తుందని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయానికి, తెలంగాణ అమర జ్యోతికి మధ్యలో ఉండాల్సిన తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడం తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టుపెట్టే సిగ్గుమాలిన చర్యగా భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. సీఎం రేవంత్ రెడ్డి చర్యకు నిరసనగా మంగళవారం రాష్ట్రంలోని అన్ని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలభిషేకాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
తెలంగాణ తల్లిని అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన చర్యను ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులతో సహా తెలంగాణ వాదులంతా వ్యతిరేకిస్తూ నిరసన తెలుపాలని సోమవారం ఒక ప్రకటనలో కోరారు. తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయటమేంటని తెలంగాణ సమాజమంతా ఆవేదన చెందుతోందని, రేవంత్‌రెడ్డి వెంటనే తాను చేసిన తప్పును సరిదిద్దుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే కచ్చితంగా తెలంగాణ ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెప్పటం ఖాయమని హెచ్చరించారు.
ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి విగ్రహావిష్కరణా?
‘తెలంగాణ తల్లి విగ్రహం కోసం స్థలాన్ని కేసీఆర్ 2023 జూలైలోనే ఎంపిక చేశారు. యావత్తు తెలంగాణ సమాజం కూడా తెలంగాణ తల్లిని గౌరవించుకునేందుకు కేసీఆర్ ఎంపిక చేసిన స్థలానికి ఆమోద ముద్ర వేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కుసంస్కారంతో తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి విగ్రహాన్ని ఆ స్థలంలో ఏర్పాటు చేసింది.
కాంగ్రెస్ చర్య ప్రతి తెలంగాణ వ్యక్తి మనసునూ గాయపర్చేలా ఉంది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ తల్లి విగ్రహం కోసం కేటాయించిన స్థలంలో ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగిస్తాం. సకల మర్యాదలతో గాంధీ భవన్‌కు తరలిస్తాం..’అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఢిల్లీ మెప్పు కోసమే!
‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఢిల్లీకి బానిసత్వం చేస్తారని మేం ముందుగానే చెప్పాం. రేవంత్‌రెడ్డి ఇప్పుడు అదే పనిచేస్తున్నారు. ఢిల్లీ బాసుల మెప్పు కోసమే తెలంగాణ ఆత్మను తాకట్టు పెడుతున్నారు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ మనోభావాల కన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఢిల్లీ బాసుల మెప్పు పొందటమే ముఖ్యమైపోయింది.
తెలంగాణ ఉద్యమకారులమంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ నాయకులంతా ఢిల్లీకి గులాములేనని తేలిపోయింది. తెలంగాణ అస్తిత్వంతో పెట్టుకున్న వాళ్లెవరూ రాజకీయంగా బతికి బట్టకట్టలేదు. తెలంగాణ ప్రజలు వారికి రాజకీయంగా సమాధి తవ్వటం ఖాయం..’అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వం, ప్రయోజనాల విషయంలో బీఆర్‌ఎస్ మాత్రమే రాజీలేని పోరాటం చేస్తుందని చెప్పారు. తెలంగాణకు బీఆర్‌ఎస్ శ్రీరామరక్షగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment