రేపు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష భేటీ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ శాసనసభాపక్షం కీలక భేటీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 8న (ఆదివారం) మధ్యాహ్నం ఒంటి గంటకు జరిగే ఈ భేటీకి రావాల్సిందిగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొందరు ముఖ్య నేతలను ఆహ్వానించనున్నారు.
అసెంబ్లీ ఉభయ సభల్లో లేవనెత్తాల్సిన అంశాలపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత హాజరుకావాలంటూ సీఎం రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలపై ఈ భేటీ సందర్భంగా కేసీఆర్ తన మనోగతాన్ని వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. 9న జరిగే శాసనసభ బీఏసీ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించే ఎజెండాలోని అంశాలను బట్టి కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యేదీ, లేనిదీ స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అలా గొంతు నొక్కితే ఎలా?
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తమ గొంతునొక్కారని బీఆర్‌ఎస్ ఆరోపించింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనూ అదే రకమైన పరిస్థితి తలెత్తితే ఎలా ఎదుర్కోవాలన్న వ్యూహంపైనా బీఆర్‌ఎస్ కసరత్తు చేస్తోంది. 9న కొత్త రూపుతో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో.. శుక్రవారం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. ఎర్రవల్లి నివాసంలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై కేసీఆర్ సూచనలు చేసినట్టు సమాచారం.
9న ‘తెలంగాణ తల్లి’ విగ్రహావిష్కరణ
ఏడాది పాలన విజయోత్సవాల్లో భాగంగా సచివాలయంలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరించనుంది. అయితే తెలంగాణ తల్లి విగ్రహం రూపు మార్చడాన్ని వ్యతిరేకిస్తున్న బీఆర్‌ఎస్ అదే రోజున పోటీ కార్యక్రమానికి సిద్ధమైంది. మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఉద్యమకాలంలో రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు సన్నాహాలు చేస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇక పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సుదీర్ఘ లేఖ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఇక రేవంత్ ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలను ఎత్తిచూపుతూ శనివారం చార్జిషీటు విడుదల చేసేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఈ చార్జిషీటు బాధ్యత అప్పగించినట్టు తెలిసింది. మరోవైపు అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్‌ను ఆహ్వానిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రభుత్వపరంగా ఎలాంటి ఆహ్వానం అందలేదని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment