
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు శనివారం ఉదయం 9 గంటలకు బీఆర్‌ఎస్ తరపున శాసనసభకు ఎన్నికైన 38 మంది ఎమ్మెల్యేలు తెలంగాణభవన్‌లో భేటీ అవుతున్నారు. తుంటి ఎముక చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన కేసీఆర్ ఈ భేటీకి హాజరయ్యే అవకాశం లేదు.
ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేల భేటీకి అధ్యక్షత వహిస్తారు. కేసీఆర్‌ను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు వీలుగా ఈ భేటీలో ప్రవేశపెట్టే తీర్మానాన్ని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆమోదిస్తారు. శాసనసభాపక్ష నేత ఎన్నిక అనంతరం పార్టీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ ఆల్పాహారం చేస్తారు. అనంతరం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రత్యేక వాహనంలో అసెంబ్లీ ప్రాంగణం ఎదుట ఉన్న గన్‌పార్కుకు చేరుకొని తెలంగాణ అమరుల స్తూపానికి నివాళి అర్పిస్తారు.
ఉదయం 11 గంటలకు ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన ప్రారంభమయ్యే తెలంగాణ మూడో శాసనసభ తొలి విడత సమావేశాలకు బీఆర్‌ఎస్ సభ్యులు హాజరవుతారు. ప్రొటెం స్పీకర్ సమక్షంలో నిబంధనలకు అనుగుణంగా ఎమ్మెల్యేలుగా బీఆర్‌ఎస్ తరపున ఎన్నికైన నేతలు ప్రమాణ స్వీకారం చేస్తారు.
విపక్ష నేతగా ఉండేందుకు కేసీఆర్ మొగ్గు
శాసనసభలో 119 మంది సభ్యులకుగాను బీఆర్‌ఎస్ తర పున 39 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ అవతరించిన నేపథ్యంలో పార్టీ శాసనసభాపక్ష నేతకు కేబినెట్ హోదా దక్కుతుంది. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో విపక్ష నేతగా ఉండేందుకు మొగ్గు చూపినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే కేటీఆర్ లేదా మాజీ మంత్రి హరీశ్‌రావు బీఆర్‌ఎస్ శాసనసభా పక్షనేతగా వ్యవహరిస్తారనే ప్రచారం జరిగింది.
వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్, శాసనసభా పక్ష నేతగా హరీశ్‌రావుకు చెరో పదవి అప్పగిస్తారని బీఆర్‌ఎస్‌లో చర్చ కూడా జరిగింది. తాము నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని ప్రకటించిన బీఆర్‌ఎస్ తరపున కేసీఆర్ శాసనసభా పక్ష నేతగా వ్యవహరిస్తే అటు పారీ్టకి, ఇటు ప్రజలకు మేలు జరుగుతుందనే భావన వ్యక్తమైనట్టు సమాచారం.