ఎగుడు దిగుడు దారిలో కారు!  | BRS Party reigns | Sakshi
Sakshi News home page

ఎగుడు దిగుడు దారిలో కారు! 

Published Mon, Dec 4 2023 4:39 AM | Last Updated on Mon, Dec 4 2023 8:50 AM

BRS Party reigns - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంతో ఉద్యమ పార్టీగా మొదలైన టీఆర్‌ఎస్‌ (బీఆర్‌ఎస్‌)’రెండు దశాబ్దాల ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసింది. ఉద్యమ సమయంలో రాజీనామాలు, ఉప ఎన్నికలను అ్రస్తాలుగా ప్రయోగించి అందరి దృష్టిని ఆకర్షించింది. 2004లో కాంగ్రెస్‌తో, 2009లో టీడీపీ నేతృత్వంలోని కూటమితో జట్టుకట్టి ఎన్నికల బరిలో నిలిచింది. రాష్ట్ర అవతరణ తర్వాత తమది ఫక్తు రాజకీయ పార్టీగా మారినట్టు అధినేత కేసీఆర్‌ స్వయంగా ప్రకటించారు.

ఈ క్రమంలో 2014, 2018 ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి అధికారాన్ని చేపట్టింది. ఈ క్రమంలో జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీకి వీలుగా టీఆర్‌ఎస్‌.. భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా అవతరించింది. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల దిశగా రంగం సిద్ధం చేసుకుంటూనే.. తెలంగాణలో మూడోసారి అధికారం సాధించి ‘హ్యాట్రిక్‌’సీఎంగా రికార్డు సృష్టించాలని భావించారు.

తర్వాత ‘తెలంగాణ మోడల్‌’ఆలంబనగా జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో.. మేజిక్‌ ఫిగర్‌ను చేరుకోవడంలో విఫలమైన బీఆర్‌ఎస్‌ ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాలు కలుపుకొని మొత్తం 65 ఎంపీ సీట్లలో పోటీచేస్తామని బీఆర్‌ఎస్‌ గతంలో ప్రకటించింది. 

కొత్త రాష్ట్రంలో అధికార పీఠం: తెలంగాణ ఏర్పాటుతోపాటు జరిగిన 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 119 స్థానాల్లో ఒంటరిగా పోటీచేసి 63 సీట్లు సాధించింది. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ బాధ్యతలు స్వీకరించారు. తర్వాతి కాలంలో రాజకీయ పునరేకీకరణ పేరిట టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ, బీఎస్పీ, సీపీఐల నుంచి ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. నారాయణఖేడ్, పాలేరు ఉప ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఇంకా ఆరు నెలల గడువు ఉండగానే 2018 సెపె్టంబర్‌ 6న అసెంబ్లీని కేసీఆర్‌ రద్దు చేశారు.

అదే ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెల్చుకుని కేసీఆర్‌ రెండోసారి సీఎం అయ్యారు. తర్వాతి కాలంలోనూ వివిధ పార్టీల నుంచి గెలిచిన 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుని అసెంబ్లీలో 104 సంఖ్యాబలానికి చేరుకున్నారు.  మరోవైపు జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు 2022 అక్టోబర్‌ 5న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరును భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా మార్చారు. ప్రతికూల ఫలితాల నేపథ్యంలో రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ ప్రస్థానం, పై ఆసక్తి నెలకొంది.  

నాడు ఉప ఎన్నికలతో బలోపేతమై.. 
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో కేసీఆర్‌ 2001లో టీడీపీకి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ పదవికి, సిద్దిపేట శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి.. టీఆర్‌ఎస్‌ను స్థాపించారు. అదే ఏడాది 2001లో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కేసీఆర్‌ బరిలోకి దిగి గెలుపొందారు. 2004 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని..46 అసెంబ్లీ సీట్లలో పోటీచేసి, 26 స్థానాలును గెలుచుకుంది.

రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్‌ మాట తప్పిందంటూ యూపీఏ ప్రభుత్వం నుంచి బయటికి వచ్చిన కేసీఆర్‌.. 2006 కరీంనగర్‌ లోక్‌సభకు రాజీనామా చేసి, ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2008లో టీఆర్‌ఎస్‌కు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అయితే వాటికి జరిగిన ఉప ఎన్నికల్లో ఏడుగురే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు తిరిగి గెలిచారు.

ఈ క్రమంలో 2009 సాధారణ ఎన్నికల్లో మహా కూటమితో టీఆర్‌ఎస్‌ పొత్తు కుదుర్చుకుని 45 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసింది. కానీ పది సీట్లే సాధించింది. 2010 జూలైలో జరిగిన ఉప ఎన్నికల్లో 11 మంది, 2011 ఉప ఎన్నికలో బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాస్‌రెడ్డి విజయం సాధించారు. 2012లో టీడీపీ, కాంగ్రెస్‌లకు రాజీనామా చేసిన జోగు రామన్న, గంప గోవర్ధన్, జూపల్లి కృష్ణారావు, తాటికొండ రాజయ్య కూడా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా గెలుపొందారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement