Buggana Rajendranath Comments On Chandrababu Skill Corp Scam - Sakshi
Sakshi News home page

‘స్కిల్‌’ సూత్రధారి బాబే 

Published Mon, Mar 20 2023 5:18 AM | Last Updated on Mon, Mar 20 2023 3:12 PM

Buggana Rajendranath Comments On Chandrababu Skill Scame - Sakshi

సాక్షి, అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబేనని, ఆయన ఆదేశాల మేరకే డీపీఆర్, టెండర్లు లేకుండా నిధుల దోపిడీ జరిగిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ స్పష్టం చేశారు. గుజరాత్‌ మోడల్‌ అంటూ అబద్ధాలు వల్లించి కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పారు. ఈ స్కామ్‌లో ప్రధాన సూత్రధారులను శిక్షించి తీరుతామన్నారు.

ఇటీవల విశాఖలో నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌పై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ రెండో రోజు ఆదివారం కూడా కొనసాగింది. ఇందులో భాగంగా టీడీపీ హయాంలో జరిగిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ అంశంపై బుగ్గన మాట్లాడారు. “ఏపీఎస్‌ఎస్‌డీసీకి ప్రైవేట్‌ వ్యక్తి గంటా సుబ్బారావు ఎండీగా నియమించడంతోపాటు సీమెన్స్‌ కంపెనీ పేరిట వాటా నిధులు ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండానే ప్రభుత్వ వాటాగా రూ.371 కోట్లు విడుదల చేయడం వెనుక పెద్ద కథే నడిచింది.

ఇంత పెద్ద ప్రాజెక్టును పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేసి తరువాత నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక శాఖ కార్యదర్శి ప్రతిపాదించినా పట్టించుకోలేదు. ఎంఓయూ, లైసెన్స్‌ ఒప్పంద పత్రంలో సీమెన్స్‌ కంపెనీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్‌బోస్‌గా పేర్కొన్నారు. సంతకాలు చేసేటప్పుడు మాత్రం ఎండీ పేరును సుమన్‌బోస్‌గా చూపారు.


ఈ ఒప్పందంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని, షెల్‌ కంపెనీలు, ఫేక్‌ ఇన్‌వాయిస్‌లతో మోసాలకు పాల్పడ్డారని జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీ ప్రకటించింది. ఇదే విషయాన్ని న్యాయస్థానానికి కూడా నివేదించింది. ఈ అక్రమాలపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. జీఎస్టీ విభాగంతోపాటు ఇన్‌కమ్‌ ట్యాక్స్, ఈడీ కూడా కుంభకోణంపై దృష్టి సారించాయి’ అని బుగ్గన పేర్కొన్నారు.

గత సర్కారు నైపుణ్యాభివృద్ధి ముసుగులో స్కామ్‌లకు పాల్పడగా తమ ప్రభుత్వం యువత భవిష్యత్‌ కోసం చిత్తశుద్ధితో అడుగులు వేస్తోందని బుగ్గన తెలిపారు. “రాష్ట్రవ్యాప్తంగా 192 స్కిల్‌ హబ్‌లను నెలకొల్పాం. ఉపాధి కల్పన కోసం పరిశ్రమలతో అనుసంధానం, డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లు, వైఫై, సీసీటీవీలు, బయోమెట్రిక్‌ హాజరు సదుపాయాలతో నైపుణ్య శిక్షణ అందిస్తున్నాం.

ఇప్పటికే 21 సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ల ఏర్పాటు చేపట్టాం. సంవత్సరానికి 50 వేల మందికి పైగా యువతీ, యువకులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్నాం’ అని బుగ్గన వెల్లడించారు.   

90 శాతం గ్రాంట్‌ ఎందుకిస్తుంది?: కురసాల కన్నబాబు, మాజీ మంత్రి 
చంద్రబాబు ఏ విధంగా రాష్ట్రాన్ని, ఖజానాను కొల్లగొట్టారో తెలుసుకోవాలంటే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంను పరిశీలిస్తే చాలు. అధికారంలోకి వచ్చిన నెల రోజులకే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రతిపాదన తెచ్చారు. టేబుల్‌ అజెండాగా కేబినెట్‌లో ప్రవేశపెట్టి రూ.3,356 కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. లెటర్‌ నెంబర్, డేటా లేకుండానే నిధులు విడుదల చేశారు.

సిమెన్స్‌ కంపెనీ కాకుండా ఇతరులు డీపీఆర్‌ ఇచ్చారు. ఇతరులు డీపీఆర్‌ ఎలా తయారు చేస్తారు? ఒక కంపెనీకి ప్రభుత్వం రూ.3 వేల కోట్లు ఖర్చు పెడుతుందా? అసలు 90 శాతం గ్రాంట్‌ను ఓ ప్రైవేటు కంపెనీ ఎందుకిస్తుంది? స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ముసుగులో రూ.వందల కోట్ల దుర్వినియోగంపై నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌ నిలదీసినా ఎల్లో మీడియా ఒక్క ముక్క కూడా రాయలేదు. రెండు టోకెన్లు హైదరాబాద్‌ వెళ్లాయనే కోడ్‌ భాషను చేధించాలని కోరుతున్నా.

ముందే హెచ్చరించినా బేఖాతర్‌: ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి 
చంద్రబాబు హయాంలో అన్నీ స్కామ్‌లే. యువతను నైపుణ్యాలతో తీర్చిదిద్దుతామంటూ ప్రజాధనం దోచేశారు. నిరుద్యోగ భృతి రూ.వెయ్యి ఇస్తామని యువతను మోసగించారు. గంటా సుబ్బారావుకు నాలుగు పోస్టులిచ్చారు. బాత్‌రూమ్‌ సైజు కార్యాలయంలో 34 షెల్‌ కంపెనీల ద్వారా రూ.371.25 కోట్లు కాజేశారు.

డబ్బులు ఎలా విడుదల చేయాలి? ఎలా ఖర్చు చేయాలనే వివరాలు ఎంవోయూలో లేవు. ఆర్ధిక శాఖ కొర్రీలను కూడా పట్టించుకోలేదు. ఏసీబీ, సీమెన్స్‌ అంతర్గత సర్వే, జీఎస్టీ అధికారులు నాలుగుసార్లు హెచ్చరించినా చంద్రబాబు లెక్క చేయలేదు. దేశంలో చంద్రబాబు తెచ్చుకున్నన్ని స్టేలు ఇంకెవరూ పొందలేదు. చిత్తశుద్ధి ఉంటే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో నిందితులు స్టే తెచ్చుకోకుండా విచారణకు సిద్ధపడాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement