![Chandrababe is the reason for destruction of diaphragm wall](/styles/webp/s3/article_images/2024/07/14/harsh.jpg.webp?itok=r49ioGyq)
డయాఫ్రం వాల్, గైడ్ బండ్ నిర్మాణాలు పక్కా ప్లాన్ ప్రకారం జరగలేదు..
ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు
పోలవరం సందర్శనకు రూ.500 కోట్ల ప్రజాధనం వృథాచేసిన బాబు
మాజీ ఎంపీ హర్షకుమార్
రాజమహేంద్రవరం సిటీ: పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణం నాశనమవడానికి సీఎం చంద్రబాబే కారణమని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ధ్వజమెత్తారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభంలో శీనయ్య కమిటీ రెండు డయాఫ్రం వాల్స్ కట్టాలని సూచించినా చంద్రబాబు ఒక్క నిర్మాణం మాత్రమే చేపట్టారని విమర్శించారు. డయాఫ్రం వాల్ ఒకచోట 52 మీటర్లు, మరోచోట 92 మీటర్ల మేర ఇష్టారాజ్యంగా నిర్మించారని చెప్పారు.
డయాఫ్రం వాల్ పునాది కచ్చితంగా హార్డ్ రాక్ వరకూ వెళ్లాలని అధికారులు సూచించినా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. డయాఫ్రం వాల్‌కు హార్డ్ రాక్ వరకూ పునాది నిర్మించలేదని, అందువల్లనే నేడు ఈ దుస్థితి నెలకొందని మండిపడ్డారు. దీనికి అక్కడి ఇంజినీర్లు, మారిన కాంట్రాక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో అత్యంత ప్రాధాన్యం కలిగిన డయాఫ్రం వాల్, గైడ్ బండ్ నిర్మాణాలు పక్కా ప్లాన్ ప్రకారం నిర్మాణం జరగలేదని, నిర్దేశిత లోతు వరకూ నిర్మించనందునే అది కొట్టుకుపోయిందన్నారు.
ఈ విషయాలపై పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్లు సమాధానం చెప్పాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. కారకులైన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లోపభూయిష్టంగా తయారైందని, తాను చెప్పిన విషయాలు కాదని ఇంజినీరింగ్ అధికారులు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలను ప్రజలు కూడా గమనించాలని కోరారు. డ్యామ్ నిర్మించాలనే విషయం అంతర్జాతీయ కుట్రగా అభివరి్ణంచారు.
చంద్రబాబుకు డబ్బులు దండుకోవడం తప్ప ప్రాజెక్టుపై చిత్తశుద్ధి లేదు
ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేసిన íసీఎం చంద్రబాబు.. ఇప్పటి వరకూ ఎంత ఖర్చు పెట్టారు, ఇంకా ఎంత ఖర్చవుతుందనే విషయాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. గోదావరి ప్రవాహం కొయిదా ప్రాంతం వరకూ సమానంగా సాగుతుందని, అక్కడి నుంచి ప్రాజెక్టుకు వచ్చే క్రమంలో మధ్యలో రోజుకు 9 టీఎంసీల నీళ్లు అదృశ్యమైపోతున్నాయని, దీనిని అరికట్టడంపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు.
చంద్రబాబుకు డబ్బులు, క్రెడిట్ దక్కించుకోవడం తప్ప పోలవరం ప్రాజెక్టుపై చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం రుషికొండపై రూ.500 కోట్లతో ప్యాలస్ కట్టారంటూ రాష్ట్రంలో అందరూ విమర్శించారని, కానీ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు ప్రజలను తీసుకెళ్లడానికి రూ.500 కోట్లు ఖర్చు పెట్టారని హర్షకుమార్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment