ఎన్నికల ముందు చంద్రబాబు బూటకపు హామీలు     | Chandrababu Naidu Fake Promise In 2024 Ahead Of Assembly Elections, Details Inside - Sakshi
Sakshi News home page

ఎన్నికల ముందు చంద్రబాబు బూటకపు హామీలు    

Published Wed, Apr 17 2024 1:04 PM | Last Updated on Wed, Apr 17 2024 3:25 PM

Chandrababu Fake Promise in 2024 - Sakshi

ఇప్పుడు సూపర్‌ సిక్స్‌ అంటూ సన్నాయి నొక్కులు 


2014 ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణమాఫీ అంటూ మోసాలు

ముక్కున వేలేసుకుంటున్న జనాలు  


2019 ఎన్నికలకు ముందు పసుపు–కుంకుమ పేరుతో దొంగ నాటకాలు    

మేం నమ్మం బాబోయ్‌ అంటున్న మహిళలు  

2014లోఎన్నికలకు ముందు. ‘మేం అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తాం. ఏం అక్కచెల్లెమ్మలూ..! మీరెవ్వరూ బ్యాంక్‌ల్లో రుణాలు చెల్లించొద్దు. అంతేకాదు.. ఇంటికో ఉద్యోగం ఇస్తాం. ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు ఇస్తాం. ప్రతి మహిళనూ లక్షాధికారిని చేస్తాం. ప్రతి రైతునీ రారాజుని చేస్తాం’ అంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ప్రజలందర్నీ బురిడీ కొట్టించారు. 2014 నుంచి 2019 వరకు కుంభకర్ణుడిలా నిద్రపోయి ఎన్నికల ముందు మేల్కొన్నారు. మహిళల పవిత్రతకు ప్రతీకైన పసుపు–కుంకుమ పేరుతో ముష్టివిదిల్చినట్టు చిల్లర వేసి మహిళల ఓట్లు దండుకోవాలని చూసి బోల్తాపడ్డారు. ఇప్పుడు సూపర్‌ సిక్స్‌ పేరుతో మరో మారు మాయచేసేందుకు సన్నద్ధమయ్యారు. దీనిపై మహిళలు మండిపడుతున్నారు. మాయలోడి మాటలు నమ్మబోమని తేలి్చచెబుతున్నారు. ఇచ్చినమాటకు కట్టుబడిన జగనన్నకే మా మద్దతు అని ముక్తకంఠంతో నినదిస్తున్నారు.    

నట్టేట ముంచేశారు 
చంద్రబాబు మాయ మాటలకు ఒకసారి మోసపోయాం. 2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. మేము కూడా సంబరపడిపోయాం. 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. అధికారం వచ్చింది.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఆశించాం. అయితే చంద్రబాము మమ్మల్ని నట్టేట ముంచేశారు. ఐదేళ్లపాటు బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు కట్టలేక నానా అవస్థలు పడ్డాం. వడ్డీలు పెరిగిపోయాయి. కొత్త రుణాలు రాని పరిస్థితి. మళ్లీ 2019 ఎన్నికలు వచ్చే సరికి పసుపు–కుంకుమ పేరుతో రూ.10వేలు మా చేతిలో పెట్టారు. ఆ డబ్బులు వడ్డీలకు కూడా సరిపోలేదు. అందుకే ఆ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాం. అదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు విడతల వారీగా మా రుణాలు మాఫీ చేశారు. మాకు కొత్తగా రుణాలు తీసుకునే వెసులుబాటు కల్పించారు. సున్నావడ్డీకే బ్యాంకర్లు రుణం ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. మేము ఆర్థికంగా ఎదిగేందుకు సహకారం అందించారు. ఈ ఐదేళ్లలో జగనన్న ఏం చేశారో మాకు గుర్తుంది. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబును నమ్మం.                           – బుజ్జి, చిత్తూరు 

బాబు మోసం చేశారు 
చంద్రబాబు మీద కుప్పం ప్రజలకు అభిమానం తగ్గిపోయింది. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్వాక్రా రుణ మాఫీ చేస్తామని నమ్మించి మోసంచేశారు. దీంతో చాలా నష్టపోయాం. ఎన్నికలు దగ్గర వచ్చినప్పుడు పసుపు– కుంకుమ పేరిట రూ.10 వేలు భిక్షంగా వేసి ఓట్లు కోసం డ్రామా చేసిన విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు చంద్రబాబు చెప్పే మాటలను అసలు నమ్మలేం. అప్పట్లో మహిళలు ఆశ పడింది డ్వాక్రా రుణమాఫీ , రైతు రుణమాఫీ రెండింటినీ ఇవ్వకుండా మోసం చేశారు.ఇప్పుడు బాబు ఎంత చెప్పినా జనం నమ్మరు. ఏళ్ల తరబడిగా కుప్పం ప్రజలు చంద్రబాబును చూశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేసింది. మాకు కుటుంబానికి అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, జగనన్న ఇల్లు వచ్చాయి. అదే స్కీమ్‌లు మేము ఇస్తామని టీడీపీ వాళ్లు వస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం మాకు అన్ని పథకాలు అందిస్తోంది. ఇంకా వీళ్లు వచ్చి ఇచ్చేదేంటో అర్థం కావడంలేదు. మమల్ని నిలువునా మోసం చేసిన చంద్రబాబును జీవితంలో నమ్మం.                        
– మంజుల, ఎన్‌టీఆర్‌ కాలనీ, కుప్పం 

చంద్రబాబును ఎవ్వరూ నమ్మరు 
చంద్రబాబు మాటలు విని.. నమ్మి అలసిపోయాం. ఇప్పడు కుప్పంలో బాబు మాటలు ఎవ్వరూ నమ్మరు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలు ఏవీ నెరవేర్చలేదు. మాకైతే డ్వాక్రా రుణాలు మాఫీ, రైతులు రుణాలు మాఫీ చేస్తామని మోసం చేశారు. అప్పట్లో డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవడంతో అప్పులు, నగలు తాకట్టు పెట్టి కట్టాల్సి వచ్చింది. 2019 ఎన్నికల సమయంలో పసుపు–కుంకుమ పేరుతో రూ.10 వేలు ఇచ్చి చాలు పొమ్మున్నారు. సుమారు 35 ఏళ్లుగా చంద్రబాబును చూస్తునే ఉన్నాం. మాకైతే ఆయన చేసింది ఏమీ లేదు. వాళ్ల నాయకులు మాత్రమే బాగుపడ్డారు.  నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కుప్పంలో అదే రోడ్లు, అదే భవనాలే తప్పా అభివృద్ధి జరిగిందే లేదు. ఇప్పుడు చంద్రబాబుపై మాకు నమ్మకం పోయింది. ఇచ్చిన హమీలు కూడా జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న పథకాలనే మేమూ ఇస్తాం అంటున్నారు. గతంలో టీడీపీ ఉన్నప్పుడు వాటిని ఎందుకు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వంలో మాకు అమ్మఒడి, జగనన్న తోడు, పక్కా ఇల్లు వచ్చింది. జగనన్న గోరు ముద్ద పథకం కింద పిల్లలు తృప్తిగా¿ోజనం చేస్తున్నారు. మేము చాలా సంతోషంగా ఉన్నాం.              
 – ధనలక్ష్మి, అర్బన్‌ కాలనీ, కుప్పం 

బాబు మాటలకు ఏమారే ప్రసక్తే లేదు 
నేను ఉమామహేశ్వరి స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిని. 2014 ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే డ్వాక్రా రుణం మాఫీ అవుతుందని ప్రకటించారు. మా గ్రూపునకు రూ. లక్ష అప్పు ఉండటంతో రుణమాఫీ అవుతుందని ఆశపడ్డాం. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చినా రుణమాఫీ గురించి పట్టించుకోలేదు. 2019 ఎన్నికలు సమీపించే సమయంలో మహిళలు అందరూ ఆగ్రహంగా ఉన్నారని తెలుసుకుని మభ్యపెట్టడం కోసం పసుపు–కుంకుమ పేరిట మమ్మల్సి మోసం చేయాలని చూసిన ఘనుడు చంద్రబాబు. ఆయన పసుపు–కుంకుమతో ఏమార్చాలని చూస్తే మేమందరం ఓటుతో ఉప్పు, కారం పెట్టి సాగనంపాం. ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జగనన్న ఆసరా పేరిట రుణమాఫీ చేశారు. ఏడాదికి రూ. 24,950 చొప్పున నాలుగేళ్లకు మా రుణం మొత్తం మాఫీ అయింది. ఎన్నికల్లో చెప్పిన మాటపై నిలబడింది ఒక్క వైఎస్సార్‌సీపీ మాత్రమే. మళ్లీ ఇప్పుడొచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని మాటలు చెప్పినా ఏమారే ప్రసక్తే లేదు. 
– జైలా, ముడిపల్లె, నగరి మండలం

మాకు అప్పులే మిగిల్చారు 
నేను గత 15 ఏళ్లుగా మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉంటున్నా. చంద్రబాబు మాట లు నమ్మి 2014 ఎన్నికల్లో టీడీపీకి ఓటేశాం. డ్వాక్రా రుణం మాఫీ చేస్తారని ఆశపడ్డాం. బ్యాంకులో తనఖా పెట్టిన నగలు విడిపిస్తారని నమ్మాం. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోలేదు. రుణం మాఫీ చేయలేదు. తాకట్టు పెట్టిన నగలను విడిపించలేదు. చివరకు మాకు అప్పులే మిగిల్చారు. 2019 ఎన్నికలు వచ్చేసరికి ఆయనకు మా ఓట్లు గుర్తుకు వచ్చినట్టు ఉన్నాయి. పసుపు– కుంకుమ అంటూ రూ.10వేలు ఇచ్చి మాయ చేయాలని చూశారు. ఎక్కడికక్కడ సభలు పెట్టి బూటకపు హామీలు గుప్పించారు. సెల్‌ఫోన్‌ ఇస్తామని చెప్పి మోసం చేశారు. అందుకే ఆ ఎన్నికల్లో టీడీపీ నామరూపాల్లేకుండా పోయింది. అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం విడతల వారీగా డ్వాక్రా రుణమాఫీ చేసింది. నాకు నాలుగు విడతల్లో రూ.66వేల రుణం తీరిపోయింది. అలాగే సున్నావడ్డీ కింద మరో రూ.12వేలు వచ్చింది. మాకు ఇంత సాయం చేసిన జగనన్నకే జీవితాంతం అండగా ఉంటాం. 
– ఈశ్వరి, డ్వాక్రా మహిళ, గుడిపాల మండలం 

చంద్రబాబు మమ్మల్ని నవ్వుల పాలు చేశారు 
నేను ఓంశక్తి గ్రూపులో ఉండా. ముందు చంద్రబాబు మా డ్వాక్రా వాళ్లకి రుణమాఫీ చేస్తామని చెప్పారు. దీంతో మా గ్రూపు సభ్యులంతా సంతోషపడిరి. నేను అప్పుడే చెప్పినా ఈ చంద్రబాబు మాట నమ్మితే పుట్టగతులుండవు అని. అప్పుడు ఎవరూ పట్టించుకోలే. తర్వాత ఆయన మమ్మల్ని పట్టించుకోకపోవడంతో అందరికీ తెలిసివచ్చింది. మళ్లీ అప్పుడు ఎలక్షన్‌ రాగానే పసుపు–కుంకుమ ఇస్తాం.. పచ్చచీరలు కట్టుకురండని మా గ్రూపోళ్లకి మీటింగులే మీటింగులు పెట్టారు. అప్పుడూ చెప్పి నా ఆ యబ్బను నమ్మకండి మళ్లీ టోపీ పెడతాడు అని. అప్పుడు ఆడోళ్లందరూ నాపై ఎగిరినారు. మా గ్రూపోళ్లకైతే పసుపు–కుంకుమ రాలే. దీంతో అందరిలో మేమే నవ్వులపాలయ్యాం. అదే జగన్‌మోహన్‌రెడ్డి వచ్చాక సక్రమంగా వడ్డీ మాఫీ అయ్యింది. రుణం మాఫీ అయ్యింది. మాకు కొత్త గా రుణాలు కూడా ఇచ్చారు. ఆ బిడ్డ చల్లగా ఉండా ల. అప్పుడే మాలాంటి పేదలు సల్లగా ఉంటారు. ఇక బతుకులో ఎప్పటికీ చంద్రబాబును మాత్రం నమ్మం అని మా గ్రూపోళ్లందరం తీర్మానం చేసుకున్నాం.  
– ఈశ్వరమ్మ, శెట్టిపల్లె, బైరెడ్డిపల్లె మండలం 

వడ్డీలకే పోయింది 
అధికారం కోసం చంద్రబాబు నాయుడు 2014లో తప్పుడు హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత చేస్తామని చెప్పిన రుణమాఫీని గాలికి వదిలేశారు. దీంతో మేము బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు తడిసిమోపెడాయ్యాయి.  2019 ఎన్నికల సమయంలో మాత్రం పసుపు– కుంకుమ అంటూ మాకు ముష్టి వేశాడు. అది కూడా బ్యాంకు వడ్డీలకే పోయింది. మా చేతికి పైసా రాలేదు. ఆయన ఇచ్చిన పసుపు–కుంకుమతో మాకు ఒరిగిందేమీ లేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకే అండగా నిలుస్తున్నారు. ఇచ్చిన హామీ మేరకు డ్వాక్రా రుణమాఫీని విడతల వారీగా అమలు చేశారు. నాలుగేళ్లుగా వివిధ పథకాలతో మమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేశారు. జగనన్న పుణ్యాన హాయిగా జీవనం సాగిస్తున్నాం. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు బూటకపు హామీలతో వస్తున్నారు. ఆయన మాటలను  ఎలా నమ్మ గలం.    
– ఎస్‌.ప్రభావతి, ఈస్ట్‌పేట, పుంగనూరు 

 బాబుది పచ్చి మోసం 
హిందూ మహిళలు పవిత్రంగా భావించే పసుపు–కుంకుమ పేరుతో చంద్రబాబు మమ్మల్ని మోసం చేసేందుకు ప్రయతి్నంచారు. 2014 ఎన్నికల్లో డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే తుంగలో తొక్కేశారు. ఆయన కారణంగా మేము బ్యాంకర్లతో నానా మాటలు పడాల్సి వచ్చింది. మనశ్శాంతిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. డిఫాల్టర్‌గా మా గ్రూపు మారడంతో ఇతర అప్పులు కూడా రాని పరిస్థితి ఎదురైంది. అందుకే 2019 ఎన్నికల్లో పసుపు–కుంకుమ పేరుతో రూ.10వేలు ఇచ్చి మాయ చేయాలని చూసినా కీలెరిగి వాతపెట్టాం. ఓటుతో తగిన గుణపాఠం నేర్పించాం. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి సూపర్‌ సిక్స్‌ అంటూ వస్తున్నారు. చంద్రబాబు ఎలా నమ్మగలం. గతంలో డ్వాక్రా మహిళలకు రూ.3వేలు కూడా రుణ మాఫీ చేయలేని చంద్రబాబు, ఇప్పుడు మళ్లీ అధికారం ఇస్తే ఏదో చేస్తాడంటే ఎలా. సీఎం జగనన్న కరోనా కష్టాల్లో కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి  ఏటా క్రమం తప్పకుండా డ్వాక్రా రుణమాఫీ చేశారు. వచ్చిన రుణమాఫీ నిధులతో చిన్న వ్యాపారాలు, పాడి ఆవులతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాం. ఎప్పటికీ జగనన్నకు రుణపడి ఉంటాం.            
– లక్ష్మీ, కనికాపురం, పాలముద్రం మండలం  

మా ఉసురు తగిలింది 
డ్వాక్రా సంఘంలో సభ్యులుగా ఉంటూ ఆర్థికంగా ఎదుగుతున్న మాలాంటి మహిళలకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారు. తనను గెలిపిస్తే పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని, అడవాళ్లు ఎవరూ బ్యాంకులకు రుణాలు తిరిగి కట్టవద్దని 2014 ఎన్నికల ముందు ఆయన పదే పదే చెప్పారు. దాన్ని నమ్మి ఇందిరా పొదుపు సంఘంలోని మేము బ్యాంకుకు రూ.2లక్షల రుణం రీ పేమెంట్‌ చేయకపోవడంతో గ్రూపు డిఫాల్టర్‌ జాబితాలోకి వెళ్లిపోయింది. గ్రూపులు బాగా జరిగితే తక్కువ వడ్డీతో అవసరానికి అప్పులు దొరికేవి. అదీ లేకుండా చేశారు. ఆయన సీఎం అయినా రుణాలు మాఫీ చేయకుండా మళ్లీ 2019 ఎన్నికల ముందు పసుపు–కుంకుమ పేరుతో ఒక్కొక్కరికి రూ.10 వేలు ఇస్తామని కొందరికే ఇచ్చారు. అందుకే మా ఆడవాళ్ల ఉసురు తగిలి అప్పుడు అధికారం నుంచి దిగిపోయారు. ఇక ఎప్పటికీ చంద్రబాబు సీఎం కాలేరు.  కానీ జగన్‌మోహన్‌రెడ్డి వయసులో చిన్నవాడైనా 2019లో చెప్పిన మాట ప్రకారం మా గ్రూపునకు ఉన్న రూ 5,49,600 రుణం మాఫీ చేశారు. ఒక్కో సభ్యురాలికి రూ.13,750 వంతున నాలుగు విడతలుగా మా అకౌంట్లలో నగదు జమ చేశారు. మాకు మేలు చేసిన జగనన్న వెంటనే మేము నిలబడతాం. 
– ఈశ్వరి, కడపల్లె, శాంతిపురం  

  చంద్రబాబు అవకాశవాది 
డ్వాక్రా మహిళలకు  కనీసం రూ.3వేలు రుణమాఫీ చేయని చంద్రబాబు, ఎన్నికలు వచ్చేసరికి  అమ్మకు వందనం, వృద్ధాప్య పింఛన్‌ పెంపు అంటూ హామీలు గుప్పిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో పొదుపు సంఘాలకు రుణమాఫీ అంటూ మాయమాటలు చెప్పి నిలువునా మోసం చేశారు. ఏ గ్రేడ్‌లో ఉన్న సంఘాలను డీ గ్రేడ్‌కు తీసుకువచ్చి బ్యాంకు అధికారులతో తిట్టించారు. మళ్లీ 2019 ఎన్నికలు వచ్చినప్పుడే మహిళలు గుర్తుకు వచ్చారు. ఏదో చిల్లర డబ్బులు పడేస్తే నమ్మి ఓటేస్తారులే అని పథకం ప్రకారం పసుపు–కుంకుమ పేరుతో రూ.10వేల చొప్పున కొందరికే డబ్బులు వేశారు. అందుకే ఆ ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెప్పాం. అదే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్ని కష్టాలు వచ్చినా  విడతల వారీగా రుణమాఫీ చేశారు. ఆయన చేసిన రుణమాఫీ, అందించిన సంక్షేమ పథకాలతోనే  మా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. జగనన్న వల్ల ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నాం.  మేము ఎప్పుడూ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాం. చంద్రబాబు పచ్చి అవకాశవాది. ఆయనను నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరు.  
– వసంతమ్మ, పెద్దతయ్యూరు, ఎస్‌ఆర్‌పురం మండలం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement