కోడ్, కోవిడ్‌.. గాలికి! యథేచ్ఛగా చంద్రబాబు | Chandrababu High Drama At Renigunta Airport | Sakshi
Sakshi News home page

కోడ్, కోవిడ్‌.. గాలికి! యథేచ్ఛగా చంద్రబాబు

Published Tue, Mar 2 2021 3:20 AM | Last Updated on Tue, Mar 2 2021 7:42 AM

Chandrababu High Drama At Renigunta Airport - Sakshi

ధర్నాకు అనుమతి లేదన్న పోలీసులతో రేణిగుంట ఎయిర్‌పోర్టు విశ్రాంతి గదిలో కూర్చొని చంద్రబాబు వాగ్వాదం

క్యాడర్‌ను కాపాడుకోలేక...
ఎన్నికల్లో వరుస పరాజయాలు.. పునాదులను కదిలించిన ‘కుప్పం’పంచాయతీ ఫలితాలు.. నైరాశ్యంతో జారిపోతున్న క్యాడర్‌.. సొంత పార్టీ నేతలను కాపాడుకోలేక, కార్యకర్తల్లో నమ్మకం కలిగించలేని దైన్యంతో చంద్రబాబు తిరుపతి పర్యటనలో 5 వేల మందితో ధర్నా ముసుగులో రెచ్చగొట్టి అల్లర్లకు పథకం వేసినట్లు స్పష్టమవుతోంది. శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమవుతుందనే అంశాన్ని విస్మరించి కోవిడ్‌ నిబంధనలు, ఎన్నికల కోడ్‌ను పట్టించుకోకుండా ధర్నాకు దిగి ఎన్నికల్లో సానుభూతి పొందాలనే ఎత్తుగడ వేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలైన నేపథ్యంలో వాటిని ప్రభావితం చేసేలా వ్యవహరించారు. మునిసిపల్‌ ఎన్నికల్లోనూ ఏమాత్రం గెలిచే అవకాశాలు లేకపోవడం, పంచాయతీ ఫలితాలే పునరావృతం కానున్నాయని తేలడంతో టీడీపీ నేతలే స్వచ్ఛందంగా నామినేషన్ల ఉపసంహరణకు సిద్ధం కావడంతో బలవంతం చేశారంటూ వివాదాలు సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. 

సాక్షి, తిరుపతి, చిత్తూరు అర్బన్, తిరుపతి క్రైం: పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శాంతి భద్రతల అంశాన్ని గాలికి వదిలేయడంతోపాటు యథేచ్ఛగా ఎన్నికల కోడ్, కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తాను సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేశానని, ప్రతిపక్ష నేతగా ఎంతో అనుభవం ఉందని తరచూ చెప్పుకునే చంద్రబాబు వరుసగా ఎన్నికల్లో దారుణ పరాజయాలను ఎదుర్కోవడం, పార్టీ క్యాడర్‌ను కాపాడుకోలేక తాజాగా తిరుపతి ఎయిర్‌పోర్టులో వ్యవహరించిన తీరు పట్ల టీడీపీ నేతల్లోనే తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన చంద్రబాబును పోలీసులు సోమవారం తిరుపతి విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అయితే చంద్రబాబు విమానాశ్రయంలోనే బైఠాయించి నిరసనకు దిగి కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడ్డారు. తొమ్మిది గంటలకుపైగా హైడ్రామా అనంతరం రాత్రి 7.10 గంటల ప్రాంతంలో ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు పయనమయ్యారు. 
పోలీసులు బతిమిలాడుతున్నా వినిపించుకోకుండా నేలపై కూర్చున్న చంద్రబాబు 

బెదిరించి.. డైరీలో పేర్లు రాసుకుని
రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కోడ్‌ అమలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు కోవిడ్‌ నిబంధనలను సైతం లక్ష్యపెట్టకుండా తన మందీ మార్బలంతో చిత్తూరు, తిరుపతిలో 5,000 మందితో ధర్నాకు సిద్ధం కావడంతో పోలీసులు అనుమతి నిరాకరించారు. కోడ్‌ అమలులో ఉండటం, కోవిడ్‌ రెండో దశ ఉధృతంగా ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో ధర్నాకు అనుమతి ఇవ్వలేమని ఆదివారం రాత్రే స్పష్టం చేస్తూ నోటీసులు కూడా పంపారు. దీన్ని ఖాతరు చేయకుండా చంద్రబాబు సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో తిరుపతి విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులపై విరుచుకుపడ్డారు. ‘నన్నే అడ్డుకుంటారా? ఎంత ధైర్యం? మీ అంతుచూస్తా..!’అని బెదిరించినట్లు తెలిసింది. తన బ్యాగ్‌లో నుంచి డైరీ తీసుకుని అక్కడున్న పోలీసుల పేర్లను రాసుకున్నారు.
రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులను బెదిరిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు 

అనంతరం అక్కడే కింద బైఠాయించారు. ‘సార్‌ కుర్చీలో కూర్చోండి..’అంటూ ఏఎస్పీ మునిరామయ్య, డీఎస్పీలు రామచంద్ర, మురళీకృష్ణ, సూర్యనారాయణ పలువురు పోలీసులు బతిమాలినా నిరాకరించారు. గంట తరువాత చంద్రబాబు నీరు, కాఫీ, తాజా పండ్లు తీసుకున్నారు. మధ్యాహ్నం సమయంలో ఆయనకు నారావారిపల్లెలోని ఇంటి నుంచి ప్రత్యేకంగా భోజనం వచ్చినట్లు తెలిసింది. చంద్రబాబు విమానాశ్రయంలోని విశ్రాంతి గదిలో ఉంటే మంచినీరు కూడా ముట్టకుండా తమ అధినేత బైఠాయించారంటూ పార్టీ నేతలు ప్రచారం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ధర్నాకు అనుమతి లేనందున తిరిగి వెళ్లాలని చిత్తూరు, తిరుపతి అర్బన్‌ ఎస్పీలు సెంథిల్‌కుమార్, వెంకట అప్పలనాయుడు విమానాశ్రయం చేరుకుని పలుమార్లు చంద్రబాబును అభ్యర్థించారు. ఆయన ఏ సమయానికి తిరిగి వెళతారో అంతుబట్టక హైదరాబాద్, విజయవాడ వెళ్లే అన్ని విమానాల్లో టికెట్లు బుక్‌ చేసి ఉంచారు. 

చిత్తూరులో టీడీపీ నేతల వీరంగం..
చంద్రబాబు పర్యటన రద్దైనట్లు తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు చిత్తూరులో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. రోడ్లపైకి వచ్చి బైకులతో శబ్దాలు చేస్తూ అతివేగంగా నడపటంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన వారిపై వీడియోల ఆధారంగా పోలీసులు కేసులు నమోదుచేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement