ప్రాజెక్టులకు ‘వెన్నుపోటు’.. ఈ ప్రశ్నలకు బదులేది బాబూ? | Chandrababu Politics On Polavaram Project | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులకు ‘వెన్నుపోటు’.. ఈ ప్రశ్నలకు బదులేది బాబూ?

Published Fri, Dec 2 2022 11:27 AM | Last Updated on Fri, Dec 2 2022 2:36 PM

Chandrababu Politics On Polavaram Project - Sakshi

పోలవరం ప్రాజెక్టును నేనే పూర్తి చేస్తా.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తాజా ప్రకటన. గోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లిన సందర్భంగా ఆయన చేసిన  అనేక ప్రకటనలలో ఇది ఒకటి. అంతేకాదు.. చీకట్లో   పోలవరం సందర్శిస్తానని  ధర్నా చేశారు. నిజంగానే చంద్రబాబుకు భారీ ప్రాజెక్టులపైన నమ్మకం ఉదా? నిజంగా చెప్పాలంటే ఆయనకు  ఆ విశ్వాసమే లేదు. ఏదైనా పని చేయడానికి ముందు అసలు ఆ వర్క్ మీద ఒక అభిప్రాయం ఉండాలి. ఒక లక్ష్యం ఉండాలి. అవేవి లేకుండా ఏదో చేసేస్తానని చెబితే అది మొక్కుబడి తంతే అవుతుంది తప్ప మరొకటి కాదు.

ఎందుకంటే చంద్రబాబు 1995-2004 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా పోలవరం, పులిచింతల ప్రాజెక్టుల గురించి ప్రస్తావించి , వాటిని చేపట్టాలని కోరినప్పుడు అవి అయ్యేవి కావు.. అని మొహమాటం లేకుండా చెప్పేవారు. అదేమిటంటే ఎన్నికల సమయానికి అవి పూర్తి కావని, అందువల్ల  ఎన్నికలలో లబ్ది రాదని ఆయన గట్టిగా విశ్వసించేవారు. అప్పట్లో ఆయన ఇంకుడు గుంతలు, చెరువులు వంటి వాటికే అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇది పచ్చి నిజం. ఆ రోజుల్లో కనుక చంద్రబాబు పోలవరం వంటివాటిపై  దృష్టి పెట్టి ఉంటే, ఎప్పుడో ఆ ప్రాజెక్టులు పూర్తి అయిపోయేవి. కాని వాటిని అసలుపట్టించుకోలేదు.

దటీజ్‌ వైఎస్‌
2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ పదవి చేపట్టగానే ఆయన మొదట చేసింది ప్రాజెక్టుల ఫైళ్ళు తీసి దుమ్ము దులపడం. చంద్రబాబు టైమ్ లోనే అధికారులు ప్రాజెక్టులకు సంబంధించి ఒక నివేదిక తయారు చేశారు. దాని  ప్రకారం రూ.46 వేల కోట్లతో ఉమ్మడి ఏపీలోని వివిధ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టవచ్చని అందులో తెలిపారు. కానీ చంద్రబాబు దానిని పక్కనపడేశారు.

ఆ తర్వాత వైఎస్‌ హయాంలో క్యాబినెట్ సమావేశంలో ఈ నివేదికను అధికారులు పెట్టినప్పుడు ఆనాటి మంత్రులు వారిని ఒక ప్రశ్న వేశారు. నివేదిక సిద్దం చేసినా చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఓకే చేయలేదని అడిగారు. దానికి అధికారులు తమ బాధ్యత ప్రభుత్వంలోకి వచ్చినవారికి నివేదికలు సమర్పించడమేనని, వారి ప్రాధాన్యతలు వేరుగా ఉంటే తామేమీ చేయగలమని  అన్నారు. ఆ సమావేశం తర్వాత వైఎస్ మీడియాతో మాట్లాడుతూ పోలవరం , పులిచింతల ప్రాజెక్టులతో సహా వివిధ ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని అన్నారు.

చిత్తశుద్ధి.. జల సిద్ధి
ఎవరైనా ఇంత పెద్ద ప్రాజెక్టులు సకాలంలో పూర్తి అవుతాయా అంటే, ఎక్కడో చోట మొదలైతే, తర్వాత వచ్చేవారు అయినా పూర్తి చేస్తారు కదా అని జవాబు ఇచ్చేవారు. దీనిని విజన్ అంటారు. ఆ ప్రకారమే ఆయన ముందుకు వెళ్లారు. పులిచింతలకు శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన పనులను ఆరంభించారు. ముందుగా పోలవరం ముంపు ప్రాంత రాజకీయనేతలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ఈ ప్రాజెక్టు అవశ్యకత, ముంపు బాదితులను ఆదుకోవడానికి తీసుకునే చర్యలు మొదలైన వాటిని వివరించి వారందరిని ఈ ప్రాజెక్టు ముందుకు సాగేలా ఒప్పించారు.

తదుపరి కేంద్ర ప్రభుత్వం నుంచి రావల్సిన అనుమతులపై  దృష్టి పెట్టి పర్యావరణ అనుమతితో సహా పలు క్లియరెన్స్‌లను సాధించారు. అదే సమయంలో ప్రాజెక్టు కింద భూ సేకరణ చేసి కాల్వలను తవ్వించారు. కృష్ణా నది వరకు వచ్చే కుడి కాల్వను దాదాపు పూర్తి చేశారు. కానీ కొన్ని చోట్ల టిడిపి నేతలు పరిహారం పేరుతోనో, ఇతరత్రానో కాల్వ తవ్వకాలకు అడ్డుపడేవారు. అప్పుడు కూడా ప్రతిపక్ష నేత గా ఉన్న చంద్రబాబు ప్రాజెక్టు కట్టకుండా కాల్వలా అని విమర్శిస్తుండేవారు. అయినా ధైర్యంగా వైఎస్ ముందుకు వెళ్లారు. ఆయన అలా చేయకపోతే ప్రాజెక్టు పూర్తి అయినా కాల్వలు సిద్దం అయ్యేవి కావు.  కాని దురదృష్టవశాత్తు ఆయన మరణించడంతో ఆ ప్రాజెక్టు కూడా మందగమనంలోకి వెళ్లింది.

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
తదుపరి వచ్చిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలు సంబంధిత కాంట్రాక్టును ఫైనలైజ్ చేయడానికే చాలా సమయం తీసుకున్నాయి. అప్పటికీ ఒక కంపెనీకి  ఆమోదం తెలిపినా, తదుపరి రాజకీయ, ఇతర కారణాలతో దానిని రద్దు చేశారు. ఆ తర్వాత మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ కి కాంట్రాక్ట్‌ అప్పగించింది కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వం .ఆ కంపెనీ ప్రాథమిక ఏర్పాట్లకే అధిక సమయం తీసుకుంది.

ప్రాజెక్టు బాగా ఆలస్యం అయింది. ఇంతలో రాష్ట్ర విభజన జరగడం, పోలవరం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు కు అవకాశం వచ్చింది. ప్రధాని మోడీ తెలంగాణలోని ముంపు మండలాలను ఏపీలో విలీనం చేస్తూ ఆర్డినెన్స్ ఇచ్చారు. అది తన వల్లే జరిగిందని చంద్రబాబు చెప్పుకుంటారు. కాని బీజేపీ నేతలు మాత్రం అది నిజం కాదని, తమ వల్లే జరిగిందని అంటారు. ఏది ఏమైనా ఆ టైమ్ లో కాస్తో, కూస్తో మంచి జరిగిందంటే అదే అనుకోవాలి. నిజంగానే చంద్రబాబే అధి సాధించి ఉంటే, ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎందుకు ఆ ప్రాజెక్టు నిర్మాణంపై దృష్టి పెట్టలేదన్నదానికి సమాధానం దొరకదు. దాదాపు రెండున్నర ఏళ్లు ఆ ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అన్న చందంగా ఉండిపోయింది.

జీవనాడితో బాబు ఆటలు
ఈ ప్రాజెక్టుకు బదులు పట్టిసీమ లిప్ట్ ప్రాజెక్టు చేపట్టి, అదే గొప్ప విషయం అని చెప్పుకునేవారు. ఆ లిప్ట్ కు ఖర్చు చేసిన 1700 కోట్లను పోలవరం ప్రాజెక్టుపై ఆ రోజులలో పెట్టి ఉండి ఉంటే ఆయనకు మంచి పేరు వచ్చేది. ఎందరో ఆ మాట చెప్పినా ఆయన వినిపించుకోలేదు. అందులో ఆయనకు ఆర్ధిక ప్రయోజనాలు ఉన్నాయని ప్రతిపక్షాలు విమర్శించేవి.  తదుపరి ఏపీకి ప్రత్యేక హోదా లేకుండా, ప్యాకేజీని అంగీకరించిన ఫలితంగా చంద్రబాబు ప్రభుత్వానికి  పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు బాద్యతలు అప్పగించడానికి కేంద్రం ఒప్పుకుంది.

ఆ తర్వాత ఆయన ఆ కాంట్రాక్ట్‌ను ట్రాన్స్ ట్రాయ్ నుంచి నవయుగ  సంస్థకు మార్చారు. ఆ పిమ్మట కొంత పని జరిగినా, ఆశించినంత వేగంగా సాగలేదు. చంద్రబాబు సోమవారంపోలవారం అంటూ ప్రచారం చేసుకునేవారు. చంద్రబాబు ఈ విషయంలో విఫలం అయ్యారని స్వయంగా ఆయన పార్టీలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేసి తదుపరి బిజెపిలోకి వెళ్లిన సుజనా చౌదరే వ్యాఖ్యానించారు. చంద్రబాబు  అసలు పనులు మానేసి అసిస్టెంట్ ఇంజనీర్, ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ చేసే పనులను తానే చేయాలని భావించేవారని ఆయన ఎద్దేవా చేశారు.

బాబు ఏటీఎం@ పోలవరం
ఆ తర్వాత ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ వచ్చి పోలవరం చంద్రబాబుకు ఏటీఎం అయిందని, కాంట్రాక్ట్‌ పేరుతో ప్రాజెక్ట్‌ను పూర్తిగా అవినీతి మయం చేశారని ఆరోపించారు. దానికి ఇంతవరకు చంద్రబాబు సమాధానం ఇవ్వలేకపోయారు. ఇంకో సంగతి చెప్పాలి. పోలవరం ప్రాజెక్టు కోసం ఎర్రా నారాయణ స్వామి, వడ్డి వీరభద్రరావు వంటివారు ఎన్నోసార్లు చంద్రబాబు చుట్టూ తిరిగేవారు.

వడ్డి అయితే ఢిల్లీకి సైకిల్ యాత్ర చేశారు. చివరికి పని జరగడం లేదని నిరసనగా గుండు కూడా కొట్టించుకున్నారు. వీటన్నింటిని మర్చిపోయినట్లు చంద్రబాబు నటిస్తుంటారు. ఇంత చరిత్ర తన వెనుక ఉన్నా.. చంద్రబాబు మాత్రం పోలవరం తన కల అని ప్రచారం చేసుకుంటారు. తాను  పూర్తి చేస్తానని అంటారు. చంద్రబాబే  కనుక కాపర్ డామ్‌లను సజావుగా పూర్తి చేయించగలిగి ఉంటే, ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ కు వరదల వల్ల నష్టం కలిగేది కాదని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్  మేఘా సంస్థకు అప్పగించారు. ఆ తర్వాత ప్రాజెక్టు గేట్లు అన్నీ పూర్తి అయ్యాయి. కరోనా సమస్య, భారీ వరదలు రాకుండా ఉంటే ఈ పాటికి ఈ ప్రాజెక్టు తొలి దశ పూర్తి అయి ఉండేది. అదే సమయంలో నిర్వాసితుల పరిహారం సమస్య పూర్తి కాకపోవడం కూడా ఇబ్బంది అయింది.

కవరేజీ కోసం పాకులాట
ప్రస్తుత ప్రభుత్వం కచ్చితంగా పోలవరం తొలిదశను పూర్తి చేసి  గ్రావిటీ ద్వారా నీటిని అందించాలి. అందులో భిన్నాభిప్రాయం లేదు. ఇదేం ఖర్మ పేరుతో చంద్రబాబు ఆ ప్రాంతంలో తిరుగుతూ పోలవరం సందర్శనను సడన్ గా పెట్టుకున్నారు. చీకటి వేళ అనుమతి లేకుండా ఇంత పెద్ద నాయకుడు ఆ ప్రాజెక్టు సైట్ కు వెళ్లాలని అనుకోవడమే తప్పు. నిజంగా ఆయనకు ఆ ఉద్దేశం ఉంటే ముందుగానే ప్రభుత్వానికి ఆ విషయం చెప్పి వెళ్ళవచ్చు.

తగు సెక్యూరిటీ ఏర్పాట్లు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అలాకాకుండా రాత్రివేళ  అక్కడికి వెళతానని రోడ్డు మీద కూర్చోవడం ఏమిటో అర్ధం కాదు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆయనకు తెలియదా? ఆయన పర్యటనలో ఏవైనా అసాంఘిక శక్తులు చొరబడి ప్రాజెక్టు వద్ద గొడవ సృష్టిస్తే ఎవరు బాద్యత వహిస్తారు? ఇదంతా వచ్చే ఎన్నికల కోసం ఆయన ఆడిన డ్రామా అని ఇట్టే తెలిసిపోతుంది. నిజంగా చిత్తశుద్ది ఉంటే ఇలా ఉత్తుత్తి హడావుడి చేస్తారా? ఆయన అధికారంలో ఉన్నా అంతే.. అధికారంలో లేకపోయినా అంతే.. మీడియా కవరేజీ కోసం ఇలాంటి సన్నివేశాలను సృష్టిస్తుంటారు.

నాడు పోలవరం ప్రాజెక్టు డెబ్బై రెండు శాతం పూర్తి అయిందని చంద్రబాబు కాకి లెక్కలు చెబుతుంటారు. ఎన్ని గేట్లు పెట్టారు? ఎంత మందికి పరిహారం ఇచ్చారు. నిర్వాసితులకు ఎన్ని ఇళ్లు కట్టారు? కేంద్రం నుంచి ఎన్ని నిదులుతెచ్చారు? మొదలైనవాటి గురించి మాత్రం ప్రస్తావన చేయరు. ఏది ఏమైనా 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు  ప్రాజెక్టును పూర్తి చేయని చంద్రబాబు, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక తానే ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పడం విడ్డూరమే. 
-హితైషి, పొలిటికల్‌ డెస్క్, సాక్షి డిజిటల్‌
feedback@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement