
సాక్షి, అమరావతి: బీసీ కులాల వెన్నెముక విరిచింది చంద్రబాబేనని బీసీ సంక్షేమం, సమాచార శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ ధ్వజమెత్తారు. ఎన్టీఆర్‌కు ద్రోహం చేసినట్లే బీసీలకూ బాబు ద్రోహం చేశారని దుయ్యబట్టారు. బీసీలంటే బాబు దృష్టిలో రామోజీ, రాధాకృష్ణలేనని వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
► ఏలూరు బీసీ గర్జన సభ డిక్లరేషన్ ప్రకారం సీఎం జగన్ అధికారంలోకి రాగానే బీసీలంతా ఆత్మగౌరవంతో తలెత్తుకుని జీవించేలా చర్యలు తీసుకున్నారు. మాట ప్రకారం బీసీ వర్గాల్లో 139 కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు అన్ని పదవుల్లోనూ బీసీలకు సముచిత స్థానం కల్పించి గౌరవించారు. సంక్షేమ పథకాల ద్వారా బీసీల జీవన ప్రమాణాలను పెంపొందిస్తున్నారు. వారిని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వృద్ధిలోకి తెస్తున్నారు. రాష్ట్రంలో సామాజిక విప్లవానికి నాంది పలికారు. కేబినెట్‌లో బీసీలకు సీఎం జగన్ పెద్దపీట వేశారు. గతంలో ఎన్నడూ లేనిస్థాయిలో మంత్రి పదవులు ఇచ్చారు.
► చంద్రబాబు రాజకీయ అవసరాల కోసమే ఎన్టీఆర్ జపం చేస్తున్నారు. ఒక్క మెడికల్ కాలేజీ అయినా చంద్రబాబు తెచ్చారా? స్పీకర్ స్థానంలో ఉన్న బీసీ వ్యక్తిని అగౌరవపరుస్తారా? 14 ఏళ్లు సీఎంగా ఉండి బీసీలకు ఏం చేశారని చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలి?
► బీసీ నాయకత్వాన్ని పెంచామని తరచూ చెప్పే చంద్రబాబు ఆయనకు వంతపాడే, వెన్నుపోటుకు సహకరించిన యనమల, కింజారాపు కుటుంబాలను మినహా ఇతరులను ఎప్పుడైనా ప్రోత్సహించారా? రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉన్నా పది శాతం పెంచినట్లు నటించి మీ పార్టీకి చెందిన వ్యక్తి ద్వారానే కేసులు వేయించి రద్దు చేయించడం బీసీలను మోసం చేయడం కాదా?
► మూడేళ్లలో ప్రభుత్వం చేకూర్చిన లబ్ధి, మంచి పనుల గురించి ఇంటింటికీ వెళ్లి చర్చిద్దాం. ప్రతిపక్షానికి ఆ ధైర్యం ఉందా? చంద్రబాబుకు 40 నెలల తరువాత బీసీలు గుర్తుకొచ్చారా?