సాక్షి, హైదరాబాద్: రైతులు బ్యాంకుల నుంచి రెండు లక్షల రూపాయల వరకు పంట రుణాలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆ విధంగా తీసుకున్న రుణాలను తాము అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామని భరోసా ఇచ్చారు. రైతు సంక్షేమం కోసం తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. చేవేళ్ల నియోజకవర్గంలోని శంకర్‌పల్లికి చెందిన పలువురు బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహా్వనించారు. వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏర్పడే ఇందిరమ్మ రాజ్యంలో నెలకు రూ.4 వేల పింఛన్ ఇస్తామని పునరుద్ఘాటించారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడి కారి్మకులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, పైలేరియా, డయాలిసిస్ పేషంట్లకు నెలకు రూ.4 వేల పింఛన్ ఇస్తామన్నారు.
ఒక్క హామీ నెరవేర్చని కేసీఆర్
తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని చెప్పిన కేసీఆర్, అధికారంలోకి వచ్చాక పేదల సంక్షేమాన్ని విస్మరించారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రైతు వ్యతిరేకి అయిన కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రంలో 88 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర సంపదను తన కుటుంబసభ్యులకు దోచి పెడుతున్నారని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు.
వేల ఎకరాల భూములను ఆక్రమించుకున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే పోలీసులను పంపి కేసులు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు భరిస్తామని, ఇల్లు కట్టుకునే ప్రతి పేదవాడికి రూ.5 లక్షల సాయం చేస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment