
రిజర్వుడు స్థానాలు పోగా మిగిలిన జనరల్ స్థానాల్లో 40 శాతం సీట్లను బీసీలకే ఇచ్చిన సీఎం జగన్
రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు లేకున్నా బలహీన వర్గాలకు 48 శాసనసభ, 11 ఎంపీ సీట్లు
అసెంబ్లీ, ఎంపీ కలిపి మొత్తం 200 స్థానాల్లో.. 100 సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే
సేవే పరమావధిగా.. నిజాయితీ కొలమానంగా విద్యావంతులు, సామాన్యులకు పట్టం
ఉపాధి కూలీ లక్కప్ప, టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు, కార్మికుడు ఖలీల్ అహ్మద్, రైతు బిడ్డ తిరుపతిరావుకు అవకాశం
రాజకీయ సాధికారతతో సీఎం జగన్ బలంగా అడుగులు.. దేశ చరిత్రలో ఇదో రికార్డు
156 శాసనసభ, 20 ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి
33 శాసనసభ, 4 లోక్‌సభ స్థానాల్లోనే బీసీలకు చాన్స్.. బడుగులకు ఇచ్చింది 23 శాతమే
ఓసీలకు కేటాయించిన 75 స్థానాల్లో 30 చోట్ల సొంత సామాజిక వర్గానికే చంద్రబాబు చాన్స్
కోట్లు కుమ్మరించే వ్యాపారులు, కాంట్రాక్టర్లు, ఎన్నారైలు, ఆర్థిక నేరగాళ్లు, నేర చరితులకే బాబు టికెట్లు.. బడుగులకు మరోసారి వెన్నుపోటు
సాక్షి, అమరావతి: పేదల పక్షాన ఎవరు? పెత్తందారులకు కొమ్ము కాస్తోంది ఎవరనేది ఎన్నికల సాక్షిగా స్పష్టంగా తేలిపోయింది. ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదల పక్షాన నిలిస్తే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పెత్తందార్ల వైపు నిలిచింది. రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్‌సభ నియోజకవర్గాలు వెరసి 200 స్థానాలకుగానూ సగం అంటే వంద సీట్లను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సీఎం జగన్ కేటాయించడం గమనార్హం.
ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు చేసిన 36 శాసనసభ, ఐదు లోక్‌సభ వెరసి 41 స్థానాలను మినహాయిస్తే మిగతా 159 శాసనసభ, లోక్‌సభ జనరల్ స్థానాల్లో 59 చోట్ల (48 శాసనసభ, 11 లోక్‌సభ) బీసీ వర్గానికి చెందిన అభ్యర్థులను సీఎం జగన్ బరిలోకి దించారు. అంటే జనరల్ స్థానాల్లో దాదాపు 40 శాతం సీట్లను బీసీలకు కేటాయించినట్లు స్పష్టమవుతోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు 159 జనరల్ స్థానాలకుగానూ కేవలం 35 స్థానాల్లో(31 శాసనసభ, 4 లోక్‌సభ) మాత్రమే బీసీలకు అవకాశం కల్పించారు.
టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అభ్యర్థులను ఖరారు చేసిన జనరల్ స్థానాలను పరిగణనలోకి తీసుకున్నా బీసీలకు కేవలం 37 స్థానాలను (33 శాసనసభ, 4 లోక్‌సభ) మాత్రమే కేటాయించారు. కూటమి కేవలం 23 శాతం స్థానాలను మాత్రమే బీసీలకు కేటాయించినట్లు స్పష్టమవుతోంది. సేవే పరమావధిగా జనబలమే గీటురాయిగా నిజాయితీ, నిబద్ధత, విధేయత కొలమానంగా విద్యావంతులు, సామాన్యులకు సీఎం జగన్ పట్టంగట్టారు. మరోవైపు చంద్రబాబు యథాప్రకారం కోట్లు కుమ్మరించే వ్యాపారులు, కాంట్రాక్టర్లు, ఎన్నారైలు, ఆర్థిక నేరగాళ్లు, నేర చరితులకు పెద్దపీట వేశారు.
అదే ఒరవడితో...
నామినేటెడ్ పనులు, పదవుల్లో ఆయా వర్గాలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏకంగా చట్టం చేసి మరీ రాజకీయ సాధికారతకు బాటలు వేసిన సీఎం జగన్ అదే ఒరవడిని కొనసాగిస్తూ సార్వత్రిక ఎన్నికల్లో సగం సీట్లను వారికి కేటాయించారు. రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు లేని బీసీలకు 48 శాసనసభ, 11 లోక్‌సభ వెరసి 59 స్థానాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుని సీఎం జగన్ సంచలనం సృష్టించారు. దేశ చరిత్రలో ఇదో రికార్డు.
అందులోనూ ఉపాధి కూలీ ఈర లక్కప్ప (మడకశిర), టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు (నెల్లూరు), బంగారు నగల తయారీ కార్మికుడు ఖలీల్ అహ్మద్(నెల్లూరు సిటీ), సర్నాల తిరుపతిరావు (మైలవరం), సాధారణ న్యాయవాది గూడూరు ఉమాబాల (నరసాపురం) లాంటి సామాన్యులను బరిలోకి దించారు. దేశంలో సామాజిక న్యాయం నినాదంతో ఆవిర్భవించిన బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, బీసీ నేతలు నాయకత్వం వహిస్తున్న సమాజ్‌వాది పార్టీ(అఖిలేష్ యాదవ్), ద్రవిడ మున్రేట్ర కజగం (తమిళనాడు సీఎం స్టాలిన్) సైతం ఈ స్థాయిలో బడుగు, బలహీన వర్గాలకు సీట్లను కేటాయించిన దాఖలాలు లేవు.
మరోసారి ద్రోహం..
సామాజిక న్యాయంలో సీఎం జగన్ దేశానికి మార్గనిర్దేశం చేస్తూ ఆదర్శంగా నిలవగా రాజకీయాలను ఫక్తు వ్యాపారంగా మార్చేసి ఓటుకు కోట్లు వెదజల్లిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి మాత్రం యథాప్రకారం సామాజిక ద్రోహానికి పాల్పడింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అరకొరగా కేటాయించడంతోపాటు మిగతా చోట్ల రూ.కోట్లకు కోట్లు కుమ్మరించే ఆర్థిక నేరగాళ్లు, వ్యాపారులు, కాంట్రాక్టర్లు, ఎన్నారైలనే చంద్రబాబు బరిలోకి దించారు.
2014 తరహాలోనే తాజాగా మరోసారి జనసేన–టీడీపీతో జతకట్టిన చంద్రబాబు 144 శాసనసభ, 17 లోక్‌సభ స్థానాల్లో టీడీపీ 21 శాసనసభ, రెండు లోక్‌సభ స్థానాల్లో జనసేన, పది శాసనసభ, 6 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేసేలా పొత్తు లెక్కలు తేల్చారు. ఈ కూటమి ఇప్పటిదాకా 156 శాసనసభ, 20 లోక్‌సభ వెరసి 176 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 78 స్థానాలను మాత్రమే కేటాయించింది.
ఇందులో 31 శాసనసభ, నాలుగు లోక్‌సభ వెరసి 35 స్థానాల్లో మాత్రమే చంద్రబాబు బీసీలకు అవకాశం ఇచ్చారు. మరో మూడు నాలుగు సీట్లకు మించి ఆ వర్గాలకు కేటాయించే అవకాశం లేదని కూటమి నేతలే చెబుతుండటం గమనార్హం.
నినాదం కాదు విధానమే..
58 నెలలుగా సామాజిక న్యాయం అంటే నినాదం కాదు అమలు చేయాల్సిన విధానమని ప్రతి అడుగులో చాటిచెబుతున్న సీఎం జగన్ సార్వత్రిక ఎన్నికల్లో మరో అడుగు ముందుకేశారు. ఈనెల 16వతేదీన ఒకేసారి 175 శాసనసభ, 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. 29 స్థానాల్లో ఎస్సీ, ఏడు స్థానాల్లో ఎస్టీ, 48 స్థానాల్లో బీసీ వర్గానికి చెందిన అభ్యర్థులను బరిలోకి దించారు. అంటే 84 శాసనసభ స్థానాలను ఆ వర్గాలకు కేటాయించినట్లు స్పష్టమవుతోంది.
ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన అభ్యర్థులకు ఏడు నియోజకవర్గాల్లో అవకాశం కల్పించారు. 25 లోక్‌సభ స్థానాలకుగానూ 11 చోట్ల బీసీలకు సీట్లు ఇచ్చిన సీఎం జగన్ నాలుగు స్థానాల్లో ఎస్సీలకు, ఒక చోట ఎస్టీ వర్గానికి చెందిన అభ్యర్థులకు అవకాశం కల్పించారు. సీఎం జగన్ ప్రకటించిన అభ్యర్థుల్లో అత్యధికులు సామాన్యులే ఉన్నారు.
పెత్తందార్లకు బాబు పెద్దపీట..
2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అంటూ ఆ వర్గాల ప్రజల పుట్టుకను అవహేళన చేసిన చంద్రబాబు, హామీలను నిలబెట్టుకోవాలని వేడుకున్న బీసీలను తోకలు కత్తిరిస్తా, తాటతీస్తానంటూ బెదిరించారు. బలహీన వర్గాలకు చెందిన వారు న్యాయమూర్తులుగా పనికిరారంటూ ఆ వర్గాల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరిన మైనార్టీ యువకులపై దేశద్రోహం కేసులు బనాయించి కటకటాల పాలుచేసి ఆ వర్గాలను అణగదొక్కారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ఆ వర్గాలకు ద్రోహం చేసి పెత్తందార్లకే పెద్దపీట వేశారు.
► టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ఇప్పటిదాకా 156 శాసనసభ స్థానాలకు (టీడీపీ 138, జనసేన 18) అభ్యర్థులను ప్రకటించగా బీసీలకు 33 (టీడీపీ 31, జనసేన 2), ఎస్సీలకు 27 (టీడీపీ 24, జనసేన 3), ఎస్టీలకు 6 (టీడీపీ 5, జనసేన 1), మైనార్టీలకు 3 సీట్లను కేటాయించారు. అంటే ఆ వర్గాలకు మొత్తం 69 శాసనసభ స్థానాలను కేటాయించారు. టీడీపీ ఓసీలకు కేటాయించిన 75 స్థానాల్లో 30 చోట్ల చంద్రబాబు తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారినే బరిలోకి దించడం గమనార్హం.
► కూటమి ఇప్పటిదాక 25 లోక్‌సభ స్థానాలకుగానూ 20 స్థానాల్లో (టీడీపీ 13, బీజేపీ 6, జనసేన 1) అభ్యర్థులను ఖరారు చేసింది. అందులో బీసీలకు 4 (టీడీపీ), ఎస్సీలకు 4 (టీడీపీ 3, బీజేపీ 1), ఎస్టీలకు ఒకటి (బీజేపీ) కేటాయించారు.
► శాసనసభ, లోక్‌సభ రెండూ కలిపి బీసీలకు 59 సీట్లను సీఎం జగన్ కేటాయించగా చంద్రబాబు కేవలం 35 స్థానాల్లో మాత్రమే వారికి పోటీకి అవకాశం కల్పించడం గమనార్హం. మైనార్టీలకు సీఎం జగన్ 7 శాసనసభ స్థానాల్లో అవకాశం ఇచ్చి ఆదరిస్తే చంద్రబాబు మూడు స్థానాలకే పరిమితం చేశారు.
► ఎన్నికల్లో కోట్లకు కోట్లు కుమ్మరించే కాంట్రాక్టర్లు అమిలినేని సురేంద్రబాబు (కళ్యాణదుర్గం నియోజకవర్గం), ఎన్నారైలు పెమ్మసాని చంద్రశేఖర్ (గుంటూరు లోక్‌సభ), వెనిగండ్ల రాము (గుడివాడ), కాకర్ల సురేష్ (ఉదయగిరి నియోజకవర్గం), వ్యాపారులు మాజీ మంత్రి పొంగూరు నారాయణ (నెల్లూరు సిటీ), కేశినేని చిన్ని (విజయవాడ), ఎం.భరత్ (విశాఖ లోక్‌సభ), చింతమనేని ప్రభాకర్ (దెందులూరు), వెలగపూడి రామకృష్ణ (విశాఖ ఈస్ట్), జూలకంటి బ్రహ్మారెడ్డి (మాచర్ల) లాంటి నేర చరిత్ర కలిగిన వారిని చంద్రబాబు బరిలోకి దించి తాను పెత్తందార్లకే కొమ్ము కాస్తానని మరోసారి నిరూపించుకున్నారు.
సామాజిక ప్రయాణం..
గత ఎన్నికల్లో అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ సామాజిక న్యాయాన్ని పాలనలో ప్రతి అడుగులోనూ చాటిచెబుతున్నారు. మంత్రివర్గంలో ఏకంగా 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశం ఇవ్వగా రాజ్యసభ, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల పదవుల్లో సింహభాగం ఆయా వర్గాలకే ఇచ్చారు. దేశ చరిత్రలో తొలిసారిగా నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఆయా వర్గాలకే రిజర్వేషన్ చేస్తూ చట్టం చేసి మరీ పదవులు, పనులు దక్కేలా చర్యలు తీసుకున్నారు.
సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో రూ.2.70 లక్షల కోట్లు, నాన్ డీబీటీతో రూ.1.79 లక్షల కోట్లు వెరసి రూ.4.49 లక్షల కోట్ల మేర పేదలకు లబ్ధి చేకూర్చగా ఇందులో సింహభాగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ప్రయోజనం పొందారు. సీఎం జగన్ ఒకవైపు పరిపాలనలో భాగస్వామ్యం మరోవైపు ఆర్థిక చేయూతనిస్తుండటం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలు సామాజిక సాధికారత సాధించేందుకు బాటలు వేసింది. ఇది ఆయా వర్గాల ప్రజల్లో సీఎం జగన్ నాయకత్వం పట్ల విశ్వసనీయత మరింత పెరిగేందుకు దోహదం చేసింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతోపాటు అగ్రవర్ణ పేదలు సీఎం జగన్ వెంటే నడుస్తున్నారని భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలు చాటిచెప్పాయి. మరోవైపు సామాజిక ద్రోహం తలపెట్టిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమికి నిరాదరణ ఎదురవుతోంది. టీడీపీ–జనసేన పొత్తుల లెక్క తేలాక ఆ రెండు పార్టీలూ ఉమ్మడిగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభకు, బీజేపీతో జత కలిశాక మూడు పార్టీలు చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలు ప్రజలు లేక పేలవంగా సాగడమే ఇందుకు నిదర్శనం.
సార్వత్రిక ఎన్నికలకు ముందే వైఎస్సార్‌సీపీ ప్రభంజనం మరోసారి సృష్టించడం ఖాయమని సిద్ధం సభలు తేల్చి చెప్పగా టీడీపీ–జనసేన–బీజేపీ కూటమికి ఘోర పరాజయం తథ్యమని తాడేపల్లిగూడెం, చిలకలూరిపేట సభలు నిరూపించాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మరో చారిత్రక విజయాన్ని నమోదు చేయడం ఖాయమని టైమ్స్ నౌ–ఏటీజీ, జీన్యూస్–మారిటైజ్ లాంటి డజనుకు పైగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ వెల్లడైంది. వీటిని పరిశీలిస్తే వచ్చే ఎన్నికలు ఏక పక్షమేనని, వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించి వైఎస్ జగన్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు.
ఎంపికపై కూటమి మల్లగుల్లాలు
కూటమితో జతకట్టిన చంద్రబాబు జనసేనకు 21, బీజేపీకి 10 అసెంబ్లీ సీట్లు పోగా మిగతా 144 శాసనసభ స్థానాల్లో టీడీపీ పోటీ చేసేలా పొత్తు కుదుర్చుకున్నారు. రెండు లోక్‌సభ స్థానాలను జనసేనకు, ఆరు లోక్‌సభ స్థానాలను బీజేపీకి కేటాయించగా మిగతా 17 ఎంపీ స్థానాల్లో టీడీపీ పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకూ 138 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించగా మరో ఆరు స్థానాలపై చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారు.
18 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పవన్ కళ్యాణ్ మిగతా సీట్లకు అభ్యర్థుల ఎంపికపై కుస్తీ పడుతున్నారు. 13 ఎంపీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ఖరారు చేయగా మిగతా నాలుగు చోట్ల చంద్రబాబు ఆపసోపాలు పడుతున్నారు. తనకు కేటాయించిన ఆరు లోక్‌సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. జనసేనకు కేటాయించిన రెండు లోక్‌సభ స్థానాల్లో కాకినాడకు అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్ మచిలీపట్నం ఎంపీ సీటుపై తర్జన భర్జన పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment