సాక్షి ప్రతినిధి, ఖమ్మం/సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి, మహబూబాబాద్: ఇరవై నాలుగేళ్ల కింద తెలంగాణ కోసం బయలుదేరినప్పుడు ఎన్నో అవమానాలు, అవహేళనలను ఎదు ర్కొన్నామని.. కాంగ్రెస్ పార్టీ 14 ఏళ్లు పొత్తు పెట్టుకుని మోసం చేసిందని బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. చావునోట్లోతలపెట్టి పోరాడితే, దేశ రాజకీయ వ్యవస్థ మొత్తం తలొంచి తెలంగాణ ఇవ్వకుండా ఉండలేని పరిస్థితి సృష్టిస్తే తెలంగాణ వచ్చిందని చెప్పారు.
కాంగ్రెస్ వాళ్లు మళ్లీ మోసం చేయడానికి వస్తున్నారని, వారిని నమ్మితే అమ్మేస్తారని ఆరోపించారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే.. అంతా ఆగమాగం అవుతుందని, రైతుబంధుకు రాంరాం చెప్పి, ధరణిని దళారుల చేతిలో పెడతారని పేర్కొన్నారు. గత పదేళ్ల అభివృద్ధిని చూసి, ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఖమ్మం జిల్లా జీళ్లచెరువులో పాలేరు నియోజకవర్గ సభ, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో, వరంగల్ నగరం భట్టుపల్లిలో వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘24 గంటల కరెంటు అవసరం లేదని, మూడు గంటలు చాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రైతు బంధు వృధా అని మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారు. రైతుబంధు దుబారానా? రైతుబంధు వద్దా? మూడు గంటలు కరెంటు ఇస్తే ఎన్ని ఎకరాలు పారుతుంది? రైతులు మళ్లీ టార్చిలైట్లు పట్టుకుని పొలం దగ్గర పడుకోవాలా? రైతుబీమా వేస్ట్, కరెంట్ 24 గంటలు ఇవ్వొద్దు.. మనం మాత్రం హైదరాబాద్‌లో ఏసీలలో ఉండాలి. ఇది కాంగ్రెస్ వాళ్ల నీతి. ప్రజలకు రైతుబంధు ఇవ్వొద్దు. మనమే పంచుకు తినాలన్నట్టు వాళ్ల తీరు ఉంది.
పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే.. రైతుబంధుకు రాంరాం, దళితబంధుకు జైభీం అన్నట్టే. కరెంట్ కాటగలుస్తది. ప్రజల అభివృద్ధి, సంక్షేమం పట్టని వారికి ఓట్లేస్తే మన పరిస్థితి వైకుంఠపాళి ఆటలో పెద్ద పాము మింగినట్టే. మళ్లీ కథ మొదటికి వస్తది. ఏ గతి కావాలో ప్రజలు ఆలోచించి నిర్ణయించుకోవాలి. ధరణిని రద్దు చేసి మళ్లీ దళారులను తేవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ నాయకులను వచ్చే ఎన్నికల్లో బంగాళాఖాతంలో కలపాలి.
దేశం హర్షించేలా తెలంగాణ పథకాలు
ఒక రైతుగా నాకు వ్యవసాయం బాధలు తెలుసు కాబట్టే రైతుల సమస్యలు తొలగించే పనులు చేస్తున్నా. దేశ ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పాలించే కర్ణాటకలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా కాక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ధర్నాలు చేస్తున్నారు. అదే రాష్ట్రంలో రైతులు బాగుండటం వల్ల దేశంలోనే అత్యధికంగా వరి పండించే పంజాబ్ తర్వాత నంబర్ 2 స్థానానికి వెళ్లింది. నిండుగా పంటలు పండి తండాలు, గిరిజన గూడేలు ధనలక్ష్మి, ధాన్యలక్ష్మితో కళకళలాడుతున్నాయి.
ప్రజల సొత్తు ప్రజలకే పంచుతాం
నీతి నిజాయతీతో, చిత్తశుద్ధితో ప్రజల కోసం కులమత భేదాలు చూపకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. గతంలో రూ.70, రూ.200గా ఉన్న పెన్షన్లను రూ.2 వేలకు పెంచుకున్నాం. మళ్లీ గెలిచాక రూ.3 వేలు చేసి.. తర్వాత దశలవారీగా రూ.5వేలకు తీసుకెళ్తాం. తెలంగాణ సంపద పెరిగినకొద్దీ, ఆర్థికంగా బలోపేతం అవుతున్న కొద్దీ.. ప్రజల సొత్తును ప్రజలకే పంచుతాం. రైతుబంధు సొమ్మును పెంచుతాం. రైతుబీమా తరహాలోనే 93 లక్షల పేద కుటుంబాలకు కేసీఆర్ బీమాను అమలు చేస్తాం.
వచ్చే మార్చి నుంచి రేషన్‌పై సన్నబియ్యం సరఫరా చేస్తాం. అర్హులైన పేద మహిళలకు నెలకు రూ.3వేలు అందిస్తాం. ప్రజలపై భారం పడకూడదని రూ.400కే గ్యాస్ సిలిండర్ అందించాలని నిర్ణయించాం. ఎన్నికల తర్వాత సాదాబైనామాల రిజిస్ట్రేన్లకు అనుమతి ఇస్తాం. ఇవన్నీ జరగాలంటే బీఆర్‌ఎస్ కచ్చితంగా గెలవాలి. తెలంగాణ రాకముందు పరిస్థితి ఏమిటి? వచ్చాక ఏమిటన్న చర్చ ప్రతీ ఇంటిలో జరగాలి. పదేళ్లలో చేసిన అభివృద్ధిని చూడాలి.
గిరిజనులంటే కాంగ్రెస్‌కు చులకన
బెల్లయ్యనాయక్‌కు టికెట్ రావాలని లంబాడీ హక్కుల పోరాట సమితి వాళ్లు పోరాటం చేస్తే.. ‘వాళ్లదేముందయ్యా.. రూ.వెయ్యి చేతిలో పెట్టి, ఇంత గుడుంబా పోస్తే వాళ్లే ఓట్లు వేస్తారంటూ పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతున్నారు. ఇదేనా గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మర్యాద? ఇంత అహంకారంతో మాట్లాడే పార్టీ. రేపు ఎవరికి న్యాయం చేస్తుంది?’’అని కేసీఆర్ నిలదీశారు.
ఈ సభల్లో ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్, మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, తాతా మధు, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, నరేందర్, రెడ్యానాయక్, కందాల ఉపేందర్‌రెడ్డి, శంకర్‌నాయక్, ఆరూరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
రైతుబంధును యూఎన్‌ఓ కూడా మెచ్చుకుంది
తెలంగాణ పథకాలు ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలిచాయి. ఎక్కడెక్కడి నుంచో మన రాష్ట్రానికి వచ్చి చూసి వెళ్తున్నారు. రైతుబంధు పదాన్ని పుట్టించిందే కేసీఆర్. అంతకుముందు రైతులను పట్టించుకున్న వారే లేరు. ఈ పథకాన్ని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ప్రశంసించారు. శభాష్ చంద్రశేఖర్ బాగా చేశారంటూ కితాబిచ్చారు. ఐక్యరాజ్యసమితి (యూఎన్‌ఓ) కూడా రైతు బంధు వంటి ప్రపంచంలో ఎక్కడా లేదు. తెలంగాణ ప్రభుత్వం బాగా చేసిందని కితాబిచ్చింది.
మిత్రుడని చేరదీస్తే మోసం చేశారు
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మిత్రుడని చేరదీస్తే ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు రాకుండా చేశారు. ఇంట్లో కూర్చున్న వ్యక్తిని మంత్రిని చేశాం. కానీ మోసం చేశారు. కొందరు అనేక రకాలుగా పార్టీలు మారుతారు. వారి పదవుల కోసం, అవకాశాల కోసం పార్టీలు మారి.. మాట మార్చేవారు మన మధ్యలో ఉన్నారు. అందుకే ఏ పార్టీ, ఏ ప్రభుత్వం ఏం చేసింది? ప్రజల కోసం ఏం ఆలోచించింది అని ఆలోచించి ఓటు వేయాలి.
Comments
Please login to add a commentAdd a comment