సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్‌లో ప్రధాని స్పీచ్ అధ్వానంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఎప్పుడో చనిపోయిన నెహ్రూ, ఇందిరాగాంధీ పేర్లతో రాజకీయమేంటని ప్రశ్నించారు. నువ్వెన్ని ప్రభుత్వాలు కూలగొట్టావంటే నువ్వెన్ని.. అంటూ మోదీ, రాహుల్ గొడవపడుతున్నారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొత్తం 192 దేశాల్లో మన దేశం ర్యాంక్ 139 అని తెలిపారు. తలసరి ఆదాయంలో బంగ్లాదేశ్, శ్రీలంక కంటే భారత్ ర్యాంక్ తక్కువ ఉందన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అనేది పెద్ద జోక్ అని.. మన దేశం 3.3 ట్రిలియన్ డాలర్ల దగ్గరే ఆగిపోయిందని తెలిపారు. ఏదైనా తప్పు జరిగితే ఒప్పుకునే ధైర్యం ఉండాలన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని సీఎం కేసీఆర్ ఆరోపించారు.
ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వలేదు
దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వలేదని మండిపడ్డారు. ఇదేనా ఫెడరల్ వ్యవస్థ అని నిలదీశారు. పరిశ్రమలు మూతపడుతున్నాయని, బీజేపీ అధికారంలోకి వచ్చాక 20 లక్షల మంది దేశ పౌరసత్వాన్ని వదిలేశారని ప్రస్తావించారు. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. మన్మోహన్‌సింగ్ బాగా పనిచేసినా బీజేపీ బద్నాం చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ బాగా పనిచేయలేదని 2014లో మోదీకి ఓటేశారు. దీంతో పెనంపై నుంచి పొయ్యులో పడ్డట్లు అయ్యింది.
మోదీకి మంచి సలహాలు ఇవ్వాలి
దేశంలో చిత్ర విచిత్ర పరిస్థితులు ఉన్నాయి. పార్లమెంట్‌లో సబ్జెక్ట్ వదిలేసి ఏవేవో మాట్లాడుతున్నారు. అదానీపై ప్రధాని మోదీ ఒక్కమాట మాట్లాడలేదు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఈ విషయంపై కొట్లాడాయి. మోదీకి సలహాలు ఇచ్చేవాళ్లు సరిగ్గా ఇవ్వాలి. కొద్దిగా మంచి పనులు చేయాలని మోదీకి చెప్పాలి. వ్యతిరేకంగా మాట్లాడితే జైల్లో గది రెడీ చేశాం అంటారా?
2024 తర్వాత బీజేపీ ఖతం. బంగ్లాదేశ్ యుద్దం తర్వాత ఇందిరా గాంధీని వాజ్‌పేయి కాళికా అన్నారు. దేశంలో ప్రస్తుతం అడ్డగోలుగా ప్రయివేటీకరణ చేస్తున్నారు. నష్టం వస్తే ప్రజలపై భారం.. లాభం వస్తే ప్రైవేటు వ్యక్తులకు ఇస్తారా? బీబీసీని బ్యాన్ చేయాలని బీజేపీకి చెందిన లాయర్ సుప్రీంకోర్టులో కేసు వేశారు. గోద్రా అల్లర్లపై డాక్యుమెంటరీ చేస్తే బీబీసీని బ్యాన్ చేయాలా? బీబీసీ అంటే జీ న్యూసా ఈడీ దాడులు చేయగానే బంద్ చేయడానికి. బీబీసీ, ఈడీ బోడీకి భయపడుతుందా?’ అని సెటైర్లు వేశారు సీఎం కేసీఆర్.
చదవండి: ‘హైదరాబాద్‌లో డ్రగ్స్ కల్చర్ పెరుగుతోంది.. రూ.కోట్లలో వ్యాపారం'
Comments
Please login to add a commentAdd a comment