TRS To BRS: Strategy Behind KCR New National Party BRS, Details Inside - Sakshi
Sakshi News home page

KCR TRS To BRS: పార్టీ పేరు మారిపోయింది.. కేసీఆర్‌ నెక్ట్స్ స్టెప్‌ ఏంటి ?

Oct 6 2022 2:01 PM | Updated on Oct 6 2022 4:02 PM

CM KCR Strategy Behind BRS National Party - Sakshi

ఇంట గెలిచాక రచ్చ గెలవాలనే చందంగా ఇప్పుడు ఢిల్లీ గద్దెమీద జెండా ఎగరవేస్తామని గులాబీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే పార్టీ విస్తరణ ఎలా జరుగుతుందనే విషయంపై మాత్రం ఎవరి వద్ద స్పష్టత లేదు.

సాక్షి, హైదరాబాద్‌: ప్రత్యేక రాష్ట్రం నినాదంతో పురుడుపోసుకున్న తెలంగాణా రాష్ట్ర సమితి ఇప్పుడు పేరు మార్చుకుంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు వీలుగా భారత్‌ రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందింది. ఇంట గెలిచాక రచ్చ గెలవాలనే చందంగా ఇప్పుడు ఢిల్లీ గద్దెమీద జెండా ఎగరవేస్తామని గులాబీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే పార్టీ విస్తరణ ఎలా జరుగుతుందనే విషయంపై మాత్రం ఎవరి వద్ద స్పష్టత లేదు. పార్టీ పేరు మార్పు సందర్భంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జేడీఎస్ నేత కుమారస్వామితో పాటు ఆయన పార్టీ నేతలు హాజరయ్యారు. తమిళనాడుకు చెందిన ఒకరిద్దరు నేతలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పలు పార్టీల ప్రతినిధులు సైతం బీఆర్ఎస్ నామకరణానికి  వచ్చారు. అయితే కేసీఆర్ పార్టీలో వీరైనా చేరతారా అనే విషయంపై క్లారిటీ లేదు. 
చదవండి: టీఆర్‌ఎస్‌ ఇక కనుమరుగు.. 21 ఏళ్ల తర్వాత..

పార్టీ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చడానికి ముందే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ భారీ కసరత్తు చేశారు. దేశవ్యాప్తంగా చాలామంది ప్రాంతీయ పార్టీల అధినేతలను కలిశారు. జాతీయ స్థాయిలో బీజేపీ-కాంగ్రేసేతర కూటమి కోసం ప్రయత్నాలు చేశారు. 2018లో కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా భారీ మెజారిటీతో గెలిచిన తరువాత బెంగాల్  ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కేసీఆర్ భేటీ అయ్యారు. అయితే ఈ చర్చలు అంతగా ఫలించలేదనేది.. తరువాతి కాలంలో టీఆర్‌ఎస్‌తో కూటమికి మమతా అంతగా మొగ్గుచూపలేదనే వార్తలు వచ్చాయి. ఇక  గత నాలుగేళ్లలో మళ్లీ ఈ ఇద్దరు నేతల మధ్య ఎలాంటి భేటీలు జరగలేదు.

యూపీ, బీహార్‌లలో అటు సమాజ్‌వాది పార్టీ ఇటు ఆర్జేడీ నేతలతో కేసీఆర్ చర్చలు జరిపారు. ఎస్పీ నేత అఖిలేష్‌ యాదవ్‌తో కేసీఆర్‌ దాదాపు నాలుగుసార్లు భేటీ అయ్యారు. ఇటీవల కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన సందర్భంగా కేసీఆర్‌తో భేటీ అయిన  అఖిలేష్‌ హైదరాబాద్‌కు కూడా వచ్చారు.  ఆర్జేడీ నేత లాలూతోనూ కేసీఆర్ మంతనాలు జరిపారు. అయితే నితీష్‌తో కేసీఆర్ మంతనాలు అనుకున్న ఫలితాలనివ్వలేదని జేడీయూ వర్గాలు చెప్పాయి.

ఇక ఆమ్‌ ఆద్మీ పార్టీతోనూ కేసీఆర్ చర్చలు జరిపారు. ఢిల్లీ వెళ్లి కేజ్రీవాల్‌ సంక్షేమ పథకాలను పరిశీలించారు. చనిపోయిన  రైతులకు పంజాబ్ వెళ్లి ఆర్ధిక సహాయం చేశారు. అయితే ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం నేపధ్యంలో ఆప్‌ నాయకులపై ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం టీఆర్ఎస్‌కు చుట్టుకుంది. ఇక టీఎంసీ, జేడీయూ,  ఆర్జేడీ, ఎస్పీతో పాటు ఆమ్‌ ఆద్మీ పార్టీలు టీఆర్‌ఎస్‌ కంటే పెద్దవి. ఉత్తర భారతంలో చక్రం తిప్పిన చరిత్ర ఈ పార్టీలకంది. ఇలాంటి నేపధ్యంలో ఈ పార్టీలు తమ రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌కు విస్తరించే అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. ఏదైనా ఉంటే 2024 ఎన్నికల తరువాత కూటమి కోసం మాత్రమే ఈ పార్టీలు మొగ్గు చూపే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement