రిపోర్టర్లపై ఊగిపోయిన సీఎం! | CM Nitish Kumar Fires On Media Reporters While Questions On Crime | Sakshi
Sakshi News home page

రిపోర్టర్లపై ఊగిపోయిన సీఎం నితీష్‌ కుమార్‌

Published Fri, Jan 15 2021 3:05 PM | Last Updated on Fri, Jan 15 2021 7:43 PM

CM Nitish Kumar Fires On Media Reporters While Questions On Crime - Sakshi

పట్నా: శాంతంగా పరిపాలన సాగించే బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ మీడియా మిత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో మేనేజర్‌ హత్య నేపథ్యంలో ‘రాష్ట్రంలో హత్యలు పెరిగిపోతున్నాయి. శాంతి భద్రతలు అదుపు తప్పాయి. నిందితులపై పోలీసుల చర్యలు కానరావడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వీటన్నిటిపై మీ కామెంట్‌?’ అని రిపోర్టర్లు ప్రశ్నించడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. మీరు ఎవరికి మద్దతు పలుకుతున్నారని ఫైర్‌ అయ్యారు. 2005కు ముందు ఆ కుటుంబ 15 ఏళ్ల పాలనలో బిహార్‌లో నేరాలు ఏ తీరుగా ఉన్నాయో మరిచారా? అని ఎదురు ప్రశ్నించారు. 

ఈ సందర్భంగా... లాలూ-రబ్రీ దేవి పాలనపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అప్పటి అరాచకాలను ఏమాత్రం ప్రజల దృష్టికి తేకుండా.. మెరుగైన పాలన అందిస్తున్న తమను నిందితులుగా చూపెడుతున్నారని ఊగిపోయారు. నిందితుల గురించి సమాచారం ఏదైనా ఉంటే పోలీసులకు చెప్పాలని అన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని పోలీస్‌ చీఫ్‌ను ఆదేశించామని తెలిపారు. కాగా, ఇండిగో మేనేజర్‌ రూపేష్‌ కుమార్‌ను తన ఇంటి బయట వాహనం ఎక్కే క్రమంలో కొందరు దుండగులు మంగళవారం కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది.(చదవండి: ఇండిగో మేనేజర్‌ కాల్చివేత.. సీఎంపై ఆగ్రహం)

ఈ క్రమంలో... పట్టపగలే హత్యలు జరుగుతున్నా సీఎం మౌనం వహిస్తున్నారని అటు ప్రతిపక్ష ఆర్జేడీ, ఇటు సొంత పక్షం బీజేపీ విమర్శలు గుప్పించింది. ఇక జర్నలిస్టులపై సీఎం వ్యాఖ్యలను ఆర్జేడీ చీఫ్‌ తేజస్వీ యాదవ్‌ ఖండించారు. పాలన చేతగాక మీడియా మిత్రులను విమర్శిస్తున్నారని విమర్శించారు. నేరాల్ని అదుపు చేయాల్సింది పోయి గతంలో జరగలేదా అనడం సిగ్గు చేటని అన్నారు. ఇక బీజేపీ రాజ్యసభ సభ్యుడు గోపాల్‌ నారాయణ్‌ సింగ్‌ కూడా రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయానని, శాంతి భద్రతలు అదుపుతప్పాయని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement